కెసియార్-జగన్ శిఖరాగ్ర సమావేశం… అమరావతిలోనే…

ఎలాగయినా సరే, 2019 లో తెలుగుదేశం అధినేత చంద్ర బాబును ఓడించాలనుకుని కంకణం కట్టుకున్న ఇద్దరు నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తొందర్లో లో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును జడిపించేందుకు ఈ సమావేశం అమరావతిలోనే జరిగే అవకాశం మెండుగా ఉంది.  తెలంగాణ ఎన్నికల ఘనవిజయం తర్వాత ఆంధ్రలో కెసియార్ అంటే కొన్ని వర్గాల్లో బాగా గౌరవం పెరిగింది.  అందువల్ల ఈ సమావేశం అమరావతిలో చాలా అట్ట హాసంగా జరుగుతుందని  వైసిపి వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అదిరిపోయేలా విజయవాడలో కెసియార్ కు స్వాగతం ఏర్పాట్లు జరగుతాయి చూడండని ఈ వర్గాలు ‘తెలుగు రాజ్యం’ కు చెప్పాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, వైఎస్ అర్ కాంగ్రెెస్ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ల ఉన్నత స్థాయి సమావేశానికి  ఈ రోజు  నిర్ణయం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ లో  ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్ కె టి రామారావు జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అయితే పైకి ఫెడరల్ ఫ్రంటులోకి జగన్ ను ఆహ్వానించడమే ఈ సమావేశం లక్ష్యం అని చెబుతున్నా,  చంద్రబాబును ఓడించే వ్యూహం కోసం కెసియార్, జగన్ కలువబోతున్నారని, దానికి ప్రిఫరేషనే ఈ సమావేశమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కెసియార్- జగన్ సమావేశం ఎపుడో జరుగుతుందో  ఇంకా వివరాలు అందడం లేదు, ఈ లోపు ఒక సారి కెసియార్ను ఆయత ఛండీయాగంలో కలుసుకునే అవకాశం ఉందని కూడా  వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

కెటియార్ కు స్వాగతం పలుకుతున్న వైసిపి నేతలు

  ఈ యాగం ఈ నెల 21 నుంచి 25 దాకా సాగుతుంది. గతంలో 2015 డిసెంబర్ 23 నుంచి 28 దాకా ఆయత ఛండీ యాగం నిర్వహించినపుడు ముఖ్యమంత్రి కెసియార్ స్వయంగా విజయవాడ వెళ్లి చంద్ర బాబు ను యాగానికి ఆహ్వానించారు. ఆయన వచ్చారు ఆశీస్సులందుకున్నారు. అపుడు చంద్రబాబు,కెెసియార్ స్నేహంగా ఉన్నరోజులు. ఇపుడు ఇద్దరి మధ్య వైరం భగ్గున మండుతూ ఉంది. 

2015 డిసెంబర్ ఆయత ఛండీ యాగానికి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు కెసియార్ విజయవాడ వచ్చినప్పటి ఫోటో.

ఈ సారి చంద్రబాబుకు ఆహ్వానం ఉండకపోవచ్చు. ఆయన కూడా దావోస్ ప్రపంచ కార్పొరేట్ అధినేతలు జరిపే మహా యాగానికి వెళ్తున్నారు. 

ఈ సారి జగన్ యాగానికి  తప్పక వస్తారని అంతా భావిస్తున్నారు.  ఇక ముందు కెసియార్ జగన్ ల మధ్య అనుబంధం పెరుగుతుందని, తరచూ సంప్రదింపులు జరుగుతాయని ఇరుపక్షాల సానుభూతి పరులు ఆశిస్తున్నారు.

ఈ రోజు సమావేశం అనంతరం, కెటియార్ కూడా వివరాలందించారు. 

1)  కేంద్రం అధికారాలను తన వద్ద పెట్టుకొని రాష్ట్రాలను ఇబ్బందులు పెడుతున్న తరుణంలో సమాఖ్య స్ఫూర్తితో ఫెడరల్ ఫ్రంట్ పోరాటాన్నికెసియార్  ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆయా పార్టీల అధ్యక్షులతో సంప్రదింపులు జరిపి తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

2) ఇందులో భాగంగా పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ గారికి నిన్న ఫోన్ చేసి మాట్లాడేందుకు రాావాలనుకుంటున్నామని చెప్పారు.ఆయన రమ్మన్నారు.

3)  లైక్ మైండెడ్ పీపుల్ (మేం) కలిసి.. రాష్ట్రాలను శక్తివంతం చేయడానికి భవిష్యత్తులో రాష్ట్రాల హక్కులను కాపాడటానికి సందర్భానుసారంగా ముందుకు వెళతాం. 

4) ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేసిఆర్ స్వయంగా వెళ్ళి.. జగన్ గారితో చర్చిస్తారు. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకుపోతాం.

5) ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మా వైఖరిని  తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో సహా రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు, లోక్ సభలో కవిత పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అప్పటి ప్రధాని లోక్ సభలో ఇచ్చిన మాట నిలబెట్టాలని మేం చెప్పాం.

6) ఈ రోజు జరిగింది కేవలం మొదటి సమావేశం మాత్రమే. మిగతా అంశాలన్నింటినీ.. కేసిఆర్ జగన్ కలసి కూలంకుషంగా చర్చిస్తారు.  తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలపై ఉమ్మడిగా ఏ విధంగా పోరాడాలనే అంశాలపై చర్చిస్తారు.

జగన్ ఏమన్నారంటే…

1) కేసిఆర్ గారు ఫోన్ లో మాట్లాడిన పిమ్మట.. తారక్(కేటిఆర్)ఈరోజు వచ్చి చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్  గురంచి  రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం గురించి చర్చించాం.

2) రాష్ట్రాలు అన్యాయానికి గురికాకుండా  కేంద్రాన్ని నిలదీసేందుకు రాష్ట్రాలు ఒక వేదికమీదకు రావాలి. లేకుంటే రాష్ట్రాల హక్కులు సాధించలేమన్నది మా అభిప్రాయం.

3) ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చేసిన హామీకే దిక్కూ దివానం లేదు.

4)ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఆంధప్రదేశ్  రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలకు తోడు.. పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 17 మంది ఎంపీలు జత అయితే  మొత్తం 42 మంది రాష్ట్రానికి జరుతున్న అన్యాయంపై ప్రశ్నించగలిగితే కేంద్రం దిగి వస్తుంది.

5) ఇది స్వాగతించదగిన విషయం. రాష్ట్రాల హక్కులు కాపాడబడాలంటే.. సంఖ్యాపరంగా ఈ నెంబర్ పెరగాలి.

6) రాష్ట్రాల బలం పెరిగితే.. అప్పుడు రాష్ట్రాలకు అన్యాయం చేసేవిధంగా కేంద్రం నడుచుకోవటానికి వెనకడుగు వేస్తోంది.

7) కేసిఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఒక జాతీయ ప్లాట్ ఫాం ఏర్పాటు చేశారు.అది హర్షించదగిన విషయం..

8) కేసిఆర్ గారు ఫోన్ లో మాట్లాడారు. ఈ అంశంపై మరోసారి చర్చలకు కేసిఆర్ వస్తానన్నారు. కేసిఆర్ చెప్పిన అంశాలను పార్టీలో సుదీర్ఘంగా చర్చించి.. రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకువెళ్ళే విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తాం.

9) రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల సంఖ్యాబలం పెరగాలి. అప్పుడే రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి రావాలి.