ఎంఎల్ఏ ఓటుకే ఎసరు

తెలుగుదేశంపార్టీ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూతలపట్టు వైసిపి ఎంఎల్ఏ డాక్టర్  సునీల్ కుమార్ ఓటును తొలగించమంటూ ఎన్నికల కమీషన్ దగ్గరకు ఫారం 7 వచ్చింది. దాంతో విషయం తెలిసి ఎంఎల్ఏనే నివ్వెరపోయారు. డాక్టర్ సునీల్ పేరుతో ఎవరో ఫారం 7ను ఎన్నికల కమీషన్ కు ఆన్ లైన్లో దరఖాస్తు చేశారు. ఈ విషయం బయటపడటంతోనే ఎంఎల్ఏ అప్రమత్తమయ్యారు.

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతోనే టిడిపి బాగా బరితెగించిన విషయం బయటపడింది. వైసిపి సానుభూతిపరుల ఓట్లు అన్న అనుమానంతో ఇప్పటికే లక్షలాది ఓట్లను జాబితాలో నుండి ఏరేశారు. ఆ విషయం ఆధారాలతో సహా బయటపడటంతో రెండు రాష్ట్రాల్లో సంచలనం మొదలైంది. దాంతో తెలంగాణా ప్రభుత్వం ఏపి ప్రభుత్వంపై మండిపడుతోంది. అదే సమయంలో చంద్రబాబు తెలంగాణా ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎదురుదాడి మొదలుపెట్టారు.

కడప జిల్లాలో మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద ఓటును కూడా తొలగించాలంటూ ఎన్నికల కమీషన్ కు ఫారం 7 అందింది. తాజాగా పూతలపట్టు వైసిపి ఎంఎల్ఏ పేరుతో కూడా దరఖాస్తు రావటం చర్చనీయాంశమైంది. ఎవరూ ఊరు, పేరు లేని వాళ్ళ పేర్లతో దరఖాస్తులు అందినా ఎవరికీ తెలీదు. కానీ రేపటి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న వారు, మాజీ మంత్రులు, ఎంఎల్ఏల పేర్లతోనే దరఖాస్తులు అందుతున్నాయంటే టిడిపి ఎంతగా బరితెగించిందో అర్ధమైపోతోంది.

తమ ఓట్లను తీసేయమంటూ వైసిపి నేతల పేర్లతోనే దరఖాస్తులు అందుతుంటే తమ పార్టీ ఓట్లను తీసేయాలంటూ వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు చేస్తున్న ఎదురుదాడిలో అర్ధమేమన్నా ఉందా ? ఎవరైనా తమ ఓటును తీసేయమంటూ తమంతట తాముగా ఎన్నికల కమీషన్ కు దరఖాస్తు చేస్తారా ? ఓటు హక్కు కావాలని అడగటమే ఉంటుంది కానీ తీసేయమని అడగటం ఎక్కడా చూడలేదు.