రేవంత్, రమేష్ లు చంద్రబాబు బినామీలా ?

కమలంపార్టీ నేతలు చెబుతున్న ప్రకారమైతే అవుననే అనుకోవాలి. బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మాట్లాడుతూ, రేవంత్, సిఎం రమేష్ ఇద్దరూ చంద్రబాబునాయుడుకు బినామీలంటూ కొత్త ఆరోపణలు చేయటంపై సర్వత్రా చర్చ మొదలైంది. పైగా చినబాబు నారా లోకేష్ వ్యాఖ్యలతో చంద్రబాబుకు రమేష్ బినామీ అన్న విషయం స్పష్టమైపోయిందని కూడా అంటున్నారు. ఇంతకీ లోకేష్ వ్యాఖ్యలతో స్పష్టత ఎలా వచ్చిందట ? ఎలాగంటే, పంచాయితీరాజ్, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ బినామీ కంపెనీలను పెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను, భూములను దోచుకున్నారట.

 

ప్రధామిక ఆధారాలు లేకుండా ఐటి శాఖ ఉన్నతాధికారులు ఎవరిపైనా దాడులు జరపరని కూడా జివిఎల్ ఐటి శాఖ తరపున వకాల్తా పుచ్చుకుని మరీ చెబుతున్నారు. సరైన సమాచారం ఉంది కాబట్టే రమేష్ ఇళ్ళు,  కంపెనీలపై ఐటి దాడులు జరిగినట్లు కూడా నిర్ధారించేశారు. దాడుల సందర్భంగా ఐటి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా టిడిపిపై కక్షసాధింపు చర్యలని తప్పించుకుంటే కుదరదని కూడా హెచ్చరించారు లేండి.

 

తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏమిటంటూ జివిఎల్ టిడిపి నేతలను నిలదీస్తున్నారు. ఇతర పార్టీల నేతలపై ఐటి దాడులు జరిగినపుడు సోదాలు చేసినపుడు ఐటి దాడులు భేష్ అంటూ మెచ్చుకున్న ఇదే టిడిపి నేతలు తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతుంటే మాత్రం ఎందుకు భుజాలు తడుముకొంటున్నారంటూ నిలదీశారు. అందుకే రేవంత్ , రమేష్ ఇద్దరూ చంద్రబాబు బినామీలంటూ జివిఎల్ తేల్చేశారు.

 

తెలంగాణా కాంగ్రెస్ కు టిడిపి రూ 500 కోట్లు ఇచ్చారని అదంతా అవినీతి సొమ్మేనంటూ మండిపడ్డారు. ఉక్కు కర్మాగారంపై సిఎం రమేష్ చేసిందంతా దొంగ దీక్షలంటూ కొట్టిపడేశారు. తన అక్రమార్జనపై రమేష్ సమాధానాలు చెప్పితీరాల్సిందేనంటూ జివిఎల్ డిమాండ్ చేయటం ఆశ్చర్యంగా ఉంది. సోదాలన్నాక ఐటి అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎలాగూ సమాధానాలు చెప్పాల్సిందే కదా ?