పవన్ లో బ్యాలెన్స్ తప్పుతోందా ?

అవును అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. మామూలుగానే మాట్లాడేటపుడు ఒకదానికి మరోదానికి పొంతన లేకుండా మాట్లాడుతుంటారు. ఒక అంశంపై మొదలుపెట్టి ఏమాత్రం సంబంధం లేని ఇంకో అంశంలోకి వెళిపోతుంటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియా సమావేశాల్లో పాల్గొనే మిత్రులకు ఈ విషయాలు బాగా అనుభవమే. అంటే ఏదో చెప్పాలన్న ఆవేశంతో మొదలుపెడతారు. కానీ ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో తెలీక సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తుంటారు. తాజాగా మండపేట బహిరంగసభలో మాట్లాడిన తీరు కూడా అదే చెబుతోంది.

 

బహిరంగసభలో మాట్లాడిన పవన్ ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. మొదటిది సమస్యల గురించి పట్టించుకోకుండా జగన్ పారిపోయారట. రెండోది కోడి కత్తి గుచ్చుకోగానే పోరాటం చేయకుండా ఒకటే గోల చేస్తున్నాట. మూడోది ఎంఎల్ఏలను కాపాడుకోలేకపోయారట. ఇక నాలుగోది వయస్సయిపోయిన కారణంగా చంద్రబాబుకు పాలించే అర్హత లేదట. మొదటి అంశమే తీసుకుంటే, సమస్యల గురించి ప్రస్తావించకుండా జగన్ ఎక్కడికి పారిపోయారు? ఎక్కడికి పారిపోలేదు.

 

దాదాపు మూడున్నరేళ్ళపాటు అసెంబ్లీ ప్రజాసమస్యలపై శక్తి మేరకు ప్రస్తావించారు. జగన్ పోరాటాన్ని తట్టుకోలేకే అధికార పార్టీ జగన్ ను ఎన్నిసార్లు అడ్డుకున్నదో పవన్ కు తెలీదా ? జగన్ మాట్లాడటం మొదలుపెట్టగానే మైకులు కట్ చేయించి తన ఎంఎల్ఏలతో చంద్రబాబు గోల చేయించటం అందరికీ తెలిసిందే. అసెంబ్లీకి వచ్చినా ఉపయోగం ఉండదని నిర్ణయించుకున్న తర్వాతే కదా జగన్ అసెంబ్లీని బహిష్కరించింది?

 

సమస్యలపై భయపడుతూ జగన్ లా తాను రోడ్లమీద తిరిగే వ్యక్తిని కాదని పవన్ చెప్పటం విచిత్రంగా ఉంది. సమస్యలంటే భయపడే వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు లేకపోతే దూరంగా వెళ్ళిపోతారు. అంతేకానీ జనాల్లో తిరుగుతారా ? పైగా సమస్యలపై భయపడే జగన్ జనాల్లో తిరుగుతున్నారని చెప్పటం కాస్త విచిత్రంగానే ఉంది. ఒకవైపు జగన్ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంటే పారిపోయాడని చెప్పటం పవన్ కే చెల్లింది. కోడికత్తి గుచ్చుకోగానే గుచ్చారు గుచ్చారంటూ జగన్ గోల చేశారని ఎద్దేవా చేశారు. రోడ్ల మీదకు వచ్చి తోలు తీయాలట. ఎవరి తోలు తీయాలో మాత్రం పవన్ చెప్పలేదు. ఉత్తరాంధ్రలో తనపై దాడికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించి ప్రజా పోరాట యాత్రనే అర్ధాంతరంగా ముగించిన విషయం పవన్ మరచిపోయినట్లున్నారు. యాత్రను మధ్యలో ఆపేసిన పవన్ అప్పట్లో ఎవరి తోలు తీశారు ?

 

ఎంఎల్ఏలను కాపాడుకోలేకపోయారంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష ఎంఎల్ఏను ప్రలోభాలకు గురిచేసి లాక్కుంటున్న అధికార పార్టీని ఎవరైనా ఎలా తట్టుకుంటారు ? తెలంగాణాలో కెసియార్ దెబ్బకు చంద్రబాబు, కాంగ్రెస్ చేతులెత్తేయలేదా ? అంతెందుకు ప్రజారాజ్యం పార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు చేయిదాటిపోతున్నారన్న కారణంగానే కదా చిరంజీవి పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేసింది ? మరపుడు యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్న పవన్ ఏం చేశారు. పోనీ వైసిపి ఎంఎల్ఏలను లాక్కోవటం తప్పని చంద్రబాబుకు పవన్ ఎప్పుడైనా చెప్పారా ? ఇక వయస్సయిపోయిన చంద్రబాబుకు పాలించే అర్హత లేదంటున్నారు. ఈ విషయాన్ని వైసిపి ఎప్పటి నుండో చెబుతోంది కదా ? మొత్తం మీద పవన్ స్పీచ్ లో అర్ధమవుతోందేమిటంటే, అర్జంటుగా 2019లో తాను సిఎం అయిపోవాలంతే. అవుతారా ?