తేదాపా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైకాపా బాట పడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవులు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు రావడానికి బుధవారం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. రేపు తన కుమారుడు అనుచరణగంతో భౌతిక దూరం పాటిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపా కండువా కప్పుకోనున్నారు. శిద్ధా ఎంట్రీ తర్వాత మరికొంత మంది సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ గా ఉన్నారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తేదాపా అధినేత, విపక్షనేత చంద్రబాబు నాయుడు పార్టీ మారుతోన్న వారిపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
టీడీపీ ప్రజా ప్రతినిధులు, ఇన్ ఛార్జ్ లతో చంద్రబాబు కాసేపటి క్రితం ఆన్ లైన్ లో భేటీ అయ్యారు. ఈసందర్భంగానే నేతలపై ఒకింత అసహనాన్ని వెళ్లగక్కారు. పార్టీకి ద్రోహం చేసే వారిపట్లు అప్రమత్తంగా ఉండాలని, పార్టీ ద్రోహులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. పార్టీకి ద్రోహం చేసిన వారెవరినీ ప్రజలు ఆదరించరని మండిపడ్డారు. ద్రోహులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆక్షేపించారు. శిద్ధా వైకాపా కండువా కప్పుకుంటున్నారు అన్న విషయం చంద్రబాబుకు తెలియడంతోనే హుటాహుటి న ఆన్ లైన్ ద్వారా నేతలకి టచ్ లోకి వచ్చారు బాబు. శిద్ధా గురించి నేతలంతా మాట్లాడినట్లు తెలుస్తోంది.
సీనియర్ నేతల మాట అటుంచితే చంద్రబాబుకు బైబై చెప్పడానికి ఉన్న ఎమ్మెల్యేలే రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఏడు నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వైకాపా నేతలకి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు వినిపిస్తోంది. వైకాపా ఎమ్మెల్యేలే ఆ విషయాల్ని బహిర్గతం చేసారు. అదే జరిగితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మరి నిజంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైతే బాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.