ఎవరీ గల్లా, పార్లమెంటులో జయదేవ్ మీదే చర్చ

శుక్రవారం నాడు లోక్ సభలో తెలుగు దేశం పార్టీ నుంచి ఎన్డీయే ప్రభుత్వాానికి చాలా శక్తివంతమయిన దాడి ఎదురయింది. దాడి ఎంపి జయదేవ్ ప్రసంగం. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి లోక్ సభలో ఇలాంటి బ్రిలియంట్ ప్రసంగం రాలేదు.

గతంలో ఎన్డీయే హాయంలో ప్రభుత్వ వ్యతిరేకోపన్యసాలు చేసే అవకాశం ,అసవరం టిడిపి లేకుండా ఉండేవి. 2004- 2014 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం వచ్చింది. అయితే, తన మనసులోని భావాన్ని చక్కగా ఆంగ్లంలో వ్యక్తీకరించే మొనగాడెవరే టిడిపిలో లేరపుడు. పూర్వం ఎన్టీయర్ కాలంలో తెలుగుదేశం పార్టీలో మేధావులుండే వారు.

ఆతరం పోయాక తెలుగు దేశం పార్టీకి లోక్సభలో మేధావులు దొరకలేదు. అంతా నాయకులే ఉన్నారు. గతంలో ఈ కొరతను చాలా మటుకు సి రామచంద్రయ్య రాజ్యసభలో, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లోక్ సభలో తీరుస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నా వీరిరువురు మంచి వక్తలుగా పేరు తెచ్చుకున్నారు. పాత ఎన్డీయే ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తున్నపుడు, స్టాక్ స్కామ్స్ దేశాన్ని కుదిపేస్తున్నపుడు వాటికి వ్యతిరేకంగా రాజ్యసభలో రామచంద్రయ్య చేసిన ప్రసంగాలకు మంచిపేరొచ్చింది. అప్పటి డిస్ ఇన్వెస్ట్ మెంట్ మంత్రి అరుణ్ శౌరి కూడా రామచంద్రయ్య ప్రసంగాలను మెచ్చుకున్నారు. పార్లమెంట్ హౌస్ లో టిడిపిపి కార్యాలయానికి వచ్చి రామచంద్రయ్య కు వాజ్ పేయి ప్రభుత్వ విధానం మేలు గురించి అరుణ్ శౌరి వివరించిన సందర్భాలున్నాయి. వాజ్ పేయి ప్రభుత్వం అనేక నిర్ణయాలను ఎగతాళి చేస్తూ ‘roll back is the hallmark of this government’ అని వాజ్ పేయి ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టారు. అదపుడు హెడ్ లైన్ అయింది. ఇపుడు వీరిరువురు పార్టీ మారి ఒకరు రామచంద్రయ్య కాంగ్రెస్ లోకి, ఉమ్మారెడ్డి వైసిపిలో కి మారారు.

చాలా కాలం తర్వాత ఇపుడు తెలుగు దేశం మళ్లీ చర్చలో నలుగుతూ ఉంది. టిడిపి సభ్యుడు గల్లాజయదేవ్ లోక్ సభలో ప్రసంగాలకు ఇంటెలెక్చువల్ సొంపు కల్పించారు. గల్లాజయదేవ్ ప్రసంగిస్తూన్నపుడు హౌస్ లో  “who’s this guy” అని అనుకుంటున్నారట. పార్లమెంటులో లాబీల్లో చర్చ మొదలయిందట. జయదేవ్ టాక్ ఆప్ ది టౌన్ ఢిల్లీలో.

ఇంతకీ ఎవరీ గల్లా జయదేవ్

1. గల్లా జయదేవ్ మొదటి ధఫా ఎంపి. కాబట్టే పార్లమెంటులో ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. దానికి తోడు ఆయన అందరికీ బాగా తెలిసేందుకు టిడిపిపి లీడర్ కూడా కాదు. గతంలో ఎర్రన్నాయుడు టిడిపిపి లీడరుగా ఊంటూ ఢిల్లీలోనే సంసారం వుండేవారు కాబట్టి అందరికీ తెలిసిపోయారు. గల్లా జయదేవ్  లోక్సభలో తన ప్రసంగంతో మెరుపులాగా మెరిసారు. మొదటి ధఫా ఎంపికి ఆవిశ్వాస తీర్మానం మీద ప్రసంగించే అవకాశం కల్పించడంతో కూడా ఎవరీ గల్లా అనే చర్చ ఉత్తరాది ఎంపిలలో మొదలయింది. గతంలో మీడియాలో  పార్లమెంటు రికార్డుల్లో ఒక  సంపన్న ఎంపిగా గల్లా అందిరికి తెలుసు.

2. గల్లాజయదేవ్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. అమర్ రాజా గ్రూప్ కంపెనీల అధినేత. ఈకం పెనీ టర్నో వర్ రు. 6000 కోట్లు.2014 ఎన్నికల్లో జయదేవ్ ప్రకటించిన ఆస్తులు రు. 683 కోట్లు. వాళ్ల కుటుంబం రాజకీయాలకు కొత్త కాకపోయినా, ఆయన మాత్రం ఎన్నికల్లో పోటీ చేసింది 2014లోనే. అపుడు గుంటూరు లో క్ సభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మీద దాదాపు 69 వేల వోట్ల మెజారిటీ తో గెలుపొందారు. తండ్రి రామచంద్ర నాయుడు. తల్లి గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత వారివురు టిడిపిలోకి వచ్చారు. రాష్ట్రంలో ఇపుడున్న రాజకీయనాయకుల్లో హుందాఅయిన నేత గల్లా.

3. మొదటిసారి ఎంపి అయ్యాడు కాబట్టి యువతరం ఎంపి అనవచ్చు. అయితే, ఆయన వయసు 52సంవత్సరాలు(జన్మదినం మార్చి 24, 1966).

4. నేడు జయదేవ్ చేసిన ప్రసంగం రెండో పెద్ద ప్రసంగం. 2018 ఫిబ్రవరిలో చేసిన ప్రసంగం ఎన్డీయే ప్రభుత్వాని కడిగి ఆరేసింది. గతంలో కూడా ఆయన చేసిన ప్రసంగాలు ఇలాగే కొత్తగా, బలంగా ఉన్నాయి.

4. సినిమాలను ప్రసంగంలోకి తీసుకువచ్చి తను చెబుతున్నది సులభంగా అర్థమయ్యేలా చూడటం జయదేవ్ ప్రత్యేకత. గత ప్రసంగంలో ఆయన బాహుబలి సినిమాను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం విదిలించిన నిధులు బాహుబలి సినిమా కలెక్షన్లంత కూడా లేవని ఎద్దేవా చేశారు.

5. నాటి తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూతరు పద్మావతిని ఆయన వివాహమాడారు. నేటి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆయనకు బావమరిది.
6. గల్లా జయదేవ్ ఇలినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ లో ఉన్నత విద్య నభ్యసించారు. జిఎన్ బి బ్యాటరీస్ సంస్థలో కొంతకాలం పనిచేసి వచ్చారు. తర్వాత ఇండియా వచ్చి కుటుంబ వ్యాపారంలో పడిపోయారు.

7. పార్లమెంటులో బాగా యాక్టివ్ సభ్యలలో జయదేవ్ ఒకరు. ఆయన ఇంతవరకు పార్లమెంటులో ఆయన అటెండెన్స్ 84 శాతం. 432 ప్రశ్నలేశారు. 105 చర్చల్లో పాల్గొన్నారు.

 

(ఫోటో, జయదేవ్, తల్లి అరుణకుమారి, చంద్రబాబు నాయుడు. ఇది జయదేవ్ ఫేస్ బుక్ నుంచి తీసుకున్నది)