విలువలే వలువలు..!

జీవితం మొత్తం పోరాటాలు.. త్యాగాలు.. నిబద్ధత.. క్రమశిక్షణ.. విలువలు.. ధర్మాచరణ.. ఇవన్నీ అంటుంటే బాపూజీ గురించే అనుకుంటాం.. కానీ అచ్చంగా వీటిన్నిటినీ ఆచరించి ఇంచుమించు మహాత్ముడి వోలె జీవితాన్ని సాగించిన వ్యక్తి ఈ విజయనగరంలోనే నిన్న మొన్నటి వరకు సంచరించారు.. నిజం.. ఇప్పటి తరం వారికి ఆయన పరిచయం లేకపోవచ్చు.. కానీ నిన్నటి తరానికి ఆయన పరిచయమే అవసరం లేని మహానుభావుడు..మార్తాండ తేజుడు..కందాళ సుబ్రమణ్య తిలక్..బాలగంగాధర్ తిలక్ ని అభిమానించే తండ్రి ఆ పేరు పెట్టారనో ఏమో..తిలక్ జీవితం మొత్తం స్ఫూర్తిదాయకంగానే సాగింది..!

సాయం.. సంస్కారం.. రణం.. సంస్కరణం.. న్యాయాన్యాయ విచక్షణం.. విలక్షణం.. సలక్షణం.. ఇన్ని సుగుణాలు మూర్తీభవించిన వ్యక్తి.. తిలక్.. జీవితంలో ఎన్ని పాత్రలు పోషించారో.. అన్నిటికీ న్యాయం చెయ్యడం ఆయన సాధించిన అతి పెద్ద విజయం..

విశాఖలో 1920లో జన్మించిన తిలక్ ఎక్కడా ఒక చోట ఎప్పుడూ ఆగలేదు..జీవితం మొత్తం ప్రయాణమే..అయితే ఆ ప్రయాణం గమ్యం లేనిది కాదు..ప్రతి మలుపులో ఓ గెలుపు.. మరో కొత్త పిలుపు.. ఎందరో మహనీయులతో పరిచయం..అందరిలోనూ ఓ గురువును చూసిన తిలక్ ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు..తాను నేర్చుకున్నది ఇతరులకు నేర్పే ముందు ఖచ్చితంగా ఆచరించారు..అందుకే ఆయన జీవితం ఆద్యంతం ఆదర్శప్రాయం అయింది.. విద్యాహీనుడు ఏదీ సాధించలేడని,కనీసం తన హక్కుల గురించి కూడా ప్రశ్నించే పరిస్థితి ఉండదని నమ్మిన తిలక్ తాను ఉన్నత విద్యాభ్యాసం చెయ్యడమే గాక పది మంది చదువుకునేలా ఆర్థికంగానూ.. ఇతరత్రా కూడా సాయపడ్డారు.. స్వయంగా న్యాయశాస్త్రం అభ్యసించిన తిలక్ ఏ దశలోనూ తన పట్టాలను ఉపాధి పట్టాలు ఎక్కించలేదు.తన విద్య సమాజం కోసం ఉపయోగపడాలని కోరుకున్నారు.అసలు చదువు జ్ఞాన సముపార్జన కోసమేనని నమ్మిన తిలక్ జీవితంలో తనకు లభించిన ప్రతి అవకాశం పది మందికీ ఉపయోగపడేలా సార్థకం చేసుకున్నారు.

మాన్సాస్ సంస్థ సి ఇ వో.. పార్లమెంట్ సభ్యుడు.. రైల్వే బోర్డు చైర్మన్.. ఏ కొలువైనా ఎవరికీ బరువు కాకుండా పరువుగా నిర్వహించి పదుగురికి ఉపయోగపడేలా బాధ్యతలు నిర్వర్తించి.. ఆ సమయం ఆసన్నం అయినప్పుడు గౌరవంగా తప్పుకున్న ధీశాలి.. రైల్వే బోర్డు చైర్మన్ గా తన హయాంలో ఎటువంటి అవినీతికి..విమర్శకు తావు లేకుండా ఎంతో మందికి ఉద్యోగాలు వేయించి వేలాది కుటుంబాల్లో దీపం వెలింగించిన మహోన్నతుడు..!

ఆకర్షణీయమైన రూపం.. అద్భుతమైన వాగ్ధాటి.. చెప్తున్న విషయంపై అనన్యసామాన్యమైన అవగాహన..తిలక్ ప్రత్యేక లక్షణాలు..

తొలి ప్రధాని నెహ్రూ మొదలుకుని నిన్నమొన్నటి మన్మోహన్ సింగ్ వరకు ఎందరెందరో ప్రముఖలతో సాన్నిహిత్యం ఉన్నా తన పలుకుబడిని జనహితం కోసమే వాడిన నిస్వార్ధపరుడాయన… ఏ దశలోనూ తాను ఎవరికీ భారం కాకుండా వృద్ధాశ్రమంలో కాలం వెళ్ళబుచ్చిన ఆత్మాభిమాని..1952 లో అతి చిన్న వయసులోనే పార్లమెంట్ సభుడైన తిలక్ అప్పుతో ఎంపిగా జీవితం ప్రారంభించి నిప్పులా గడిపి ఆ అప్పుతోనే బయటికి వచ్చారు..స్వతంత్ర పోరాట వేళ జైలు జీవితాన్ని గడిపిన సందర్భంలో గాంధీ.. నెహ్రూల్లా ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న మహనీయుడు.. నాడు జైళ్లలో మగ్గిపోతున్న వారి జీవన స్థితిగతులను చూసి చలించిపోయిన తిలక్ జైళ్లలో కూడా సంస్కరణలు రావాలని అభిలషించారు.. నమ్మిన ప్రతి సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన నిబద్దుడు తిలక్..అవే సిద్ధాంతాలను నమ్మిన ఆయన సతీమణి కాంతం కూడా ఆయన పోరాటాల్లో పాల్గొని ఆయనతో పాటు జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి.క్విట్ ఇండియా ఆందోళన సమయంలో అరెస్ట్ అయిన తిలక్ నాలుగు నెలలు కారాగారంలో గడిపారు.

తిలక్ వంటి మహానుభావుడు విజయనగరంలో జీవించడం ఈ గడ్డ చేసుకున్న పుణ్యం..ఆయన నడిచిన నేలపై నడవడం విజయనగర ప్రజల సుకృతం..ఎందరో మహనీయుల పురిటి గడ్డ విద్యలనగరం నుదుటిన కందాళ సుబ్రమణ్య తిలక్ దేదీప్యమాన కీర్తి తిలకం..

స్వాతంత్ర సమరయోధులు.. గాంధేయవాది.. పార్లమెంట్ మాజీ సభ్యులు.. విజయనగరం వాసి.. విజయనగరానికే వాసి కందాళ సబ్రమణ్య తిలక్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం..