దేశం రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందతోంది. వరకట్న నిషేధానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టినప్పటికీ ఈ రోజుల్లో కూడా ఎంతోమంది మహిళలు వరకట్నం వేధింపులకు గురవుతున్నారు. ఈ వరకట్న వేధింపులు భరించలేక ఎంతోమంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. కారు కొనడం కోసం రూ.10 లక్షలు పుట్టింటి నుండి తీసుకురమ్మని భర్త వేదించటంతో ఆ వేధింపులు భరించలేక 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే…విజయనగరం జిల్లాకు చెందిన అప్పలస్వామి కుమార్తె సునీత (23) అదే ప్రాంతానికి చెందిన రమేష్ కి ఇచ్చి వివాహం జరిపించారు. రమేష్ ప్రైవేట్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కూతురి పెళ్ళి సమయంలో 25 తులాల బంగారం, రూ.14 లక్షల నగదు, 20 సెంట్ల భూమిని కట్నంగా ఇచ్చారు. వివాహం తర్వాత సునీత తన భర్తతో కలిసి ఉమ్మడి కుటుంబం లో ఉండేది. అయితే సునీత అత్త మామలు, భర్త అదనపు కట్నం కోసం ఆమెను వేదించేవారు. ఇటీవల రమేష్ ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు మకాం మార్చారు.
ఈ క్రమంలో రమేష్, సునిత గచ్చిబౌలి సుదర్శన్‌నగర్ కాలనీలో మెజిస్టిక్ ప్లజంట్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అయితే ఇక్కడికి వచ్చినా కూడా రమేష్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. తాజాగా గత నెల 24 వ తేది కూడా అదనపు కట్నం కోసం సునీత ను దారుణంగా కొట్టి హింసించాడు. కారు కోసం రూ.10 లక్షలు పుట్టింటి నుండి తీసుకొని రావాలని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. అయితే సునీత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. అదనపు కట్నం కోసం భర్త పెట్టే బేధింపులు భరించలేక మనస్థాపంతో సునీత గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి భర్త అత్తమామలు కారణమని సునీత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.