నిర్మాత, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ ఇకలేరు!

తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. గొప్ప నిర్మాత, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణని కోల్పోయింది. నిర్మాతగానే కాకుండా.. తనదైన నటనతో, విలనిజంతో విలక్షణ నటుడిగా చక్కటి గుర్తింపును తెచ్చుకున్న ఆయన అనారోగ్యంతో నేడు (ఏప్రిల్ 2, ఆదివారం) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. 1954లో చెన్నై వెళ్లి అసిస్టెంట్‌ కాస్ట్యూమర్‌గా సినిమారంగంలో ప్రవేశించిన ఆయన అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావిస్తాడు. జగపతి బాబు హీరోగా వచ్చిన ‘పెళ్ళిపందిరి’ చిత్రాన్ని నిర్మించాడు. అందులో ఓ పాత్రలో కూడా నటించాడు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని ‘అరుంధతి’ పేరుతో రీమేక్ చేశాడు.

నటుడిగా భారత్ బంద్, అల్లరి మొగుడు, దేవుళ్ళు, మా ఆయన బంగారం, విలన్ (2003), శాంభవి ఐపిఎస్ (2003), పుట్టింటికి రా చెల్లి (2004), పెళ్ళాం చెబితే వినాలి తదితర చిత్రాల్లో నటించిన ఆయన నిర్మాతగా పెళ్ళిపందిరి చిత్రాన్ని నిర్మించారు. ఆయన పూర్తి పేరు కృష్ణ మాదాసు. ఆయన స్వస్థలం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయ నగరం జిల్లా లక్కవరపు కోట. ఆయన సినీ పరిశ్రమలో కాష్ట్యూమ్ డిజనర్‌గా ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘భారత్ బంద్’ చిత్రంలో విలన్‌గా ఎంతో పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో ఆయన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నటుడిగా వరుసగా అవకాశాలు ఆయనను పలకరించాయి. ముఖ్యంగా కోడి రామకృష్ణ కాస్ట్యూమ్స్ కృష్ణని నటుడిగా మంచి పాత్రలు ఇచ్చి ఎంతగానో ప్రోత్సహించారు.

కాస్ట్యూమ్స్ కృష్ణ 1994లో సర్కార్ అందివలే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి అక్కడ సినిమా వాళ్ల దగ్గర అసిస్టింట్ కాస్ట్యూమర్‌గా జాయిన్ అయ్యారు. ఆయన డిజైన్ చేసిన కాష్ట్యూమ్స్‌తో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వాణిశ్రీ, జయసుద, శ్రీదేవి, జయప్రద వంటి ఎంతో మంది నటీనటులను అందంగా చూపించడంలో ఆయన పాత్ర ఉండడం గమనార్హం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ వేసుకునే బెల్ బాటమ్ ప్యాంట్స్‌కు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ తీసుకొచ్చిన ఘనత కూడా కృష్ణకే దక్కుతుంది. అయితే కాష్ట్యూమ్ డిజైనర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే కోడిరామకృష్ణ ఈయనలోని నటుడిని గుర్తించి ఈయనలో ఏదో ప్రత్యేకత ఉందని చెప్పి సినిమాల్లో నటించమని అడిగారు. మొదట వద్దన్న కోడిరామకృష్ణ పట్టుఒదలక పోవడంతో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారత్ బంద్’లో విలన్‌ పాత్రలో ఒదిగిపోయారు.

ఇక కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎంతో బిజీగా ఉన్న సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా విజయ శాంతి హీరోయిన్‌గా బి.గోపాల్ దర్శకత్వంలో ‘అశ్వధ్ధామ’ చిత్రాన్ని నిర్మించారు. నటుడిగా ‘పెళ్లాం చెబితే వినాలి. మా ఆవిడ కలెక్టర్, కొండపల్లి రాజా, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, ‘పుట్టింటికి రా చెల్లి, చిత్రాలు కాస్ట్యూమ్స్ కృష్ణకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి అలాగే జగపతి బాబు హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘పెళ్లి పందిరి’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ అయినా.. ఎందుకనో ఆర్ధికంగా భారీగానే నష్టపోయారు. మొత్తంగా అశ్వత్ధామ నుంచి పెళ్లి పందిరి వరకు 8 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. సినీ  ఇండస్ట్రీలో కాష్ట్యూమ్ డిజైనర్‌గా అడుగుపెట్టి.. ఆ పై నిర్మాతగా, నటుడిగా తనదైన విభిన్న శైలిలో ప్రేక్షకులను అలరించిన కాస్ట్యూమ్స్ కృష్ణ మృతిపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.