తెలంగాణా ఎన్నికలతో జనసేనకు డిమాండ్

తెలంగాణా ఎన్నికల ఫలితాల తర్వాత జనసేనకు డిమాండ్ పెరుగుతోందా ? పార్టీ నేతలైతే అవుననే సమాధానం చెబుతున్నారు. నిజానికి పార్టీ పరిస్ధితి ఇప్పటికైతే చాలా దయనీయంగా ఉంది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న చాలా నియోజకవర్గాల్లో జనసేనకు గట్టి నేత ఒక్కరు కూడా లేరనే చెప్పాలి. ఇపుడిపుడు ఇతర పార్టీల నుండి నేతలు జనసేన వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నుండి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి పి. బాలరాజు,   టిడిపి నుండి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేనలోకి అలా వచ్చిన వారే. రావెల పార్టీలో చేరి నెల రోజులైపోయినా మళ్ళీ ఇంత వరకూ ఒక్క నేత కూడా పార్టీలో చేరలేదు.

 

ఈ నేపధ్యంలోనే తెలంగాణా ఎన్నికలు జరిగాయి. తెలంగాణాలో కాంగ్రెస్, టిడిపి పొత్తులు పెట్టుకుని తల బొప్పి కట్టించుకున్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణా ఎన్నికల్లో గనుక మహాకూటమి విజయం సాధించుంటే కాంగ్రెస్, టిడిపిలకు క్రేజు పెరిగేదేమో ? అలా కాకుండా పెద్ద షాక్ కొట్టటంతో ఏపిలో పై రెండు పార్టీల మధ్య పొత్తులపై అందరిలోను అపనమ్మకాలు మొదలైపోయాయి. ఇక్కడ కూడా పొత్తులతో వెళితే తెలంగాణాలో ఫలితమే తప్పదనే భావన నేతల్లో పెరిగిపోతోంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు గ్యారెంటీ లేని టిడిపి నేతలు, కాంగ్రెస్, బిజెపి లో సీనియర్ నేతల్లో కొందరు జనసేన వైపు చూస్తున్నారట.

 

ఎన్నికలకు ఇక ఎంతో దూరం లేదు కాబట్టి ఇప్పటి నుండే అవకాశం ఉన్న వారు నేరుగా పవన్ కల్యాణ్ తోను లేనివారు నాదెండ్ల మనోహర్ తో మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. టిక్కెట్లు గనుక హామీ ఇస్తే పై రెండు పార్టీల నుండి వచ్చి జనసేనలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారట. జనసేనలో చేరటానికి ఉత్సాహం చూపుతున్న నేతల్లో అత్యధికంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర నేతలున్నట్లు సమాచారం. పెద్దాపురం టిక్కెట్టు ఆశిస్తున్న ఓ టిడిపి నేత ఇప్పటికే జనసేనలోని కీలక వ్యక్తులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.  

 

బిజెపికి చెందిన రాజమండ్రిలోని ఓ సినియర్ నేత కూడా జనసేనలోకి ప్రయత్నిస్తున్నారట. తనకు రాజమండ్రి ఎంపి టిక్కెట్టు లేదా తన భార్యకు రాజమండ్రి అసెంబ్లీ టిక్కెట్టును ఆశిస్తున్నట్లు సమాచారం. పెద్దాపురంలోని బిజెపి సీనియర్ నేత కూడా ట్రై చేసుకుంటున్నారట.     అలాగే కోనసీమకు చెందిన మరో బిజెపి నేత కూడా గన్నవరం లేదా అమలాపురం అసెంబ్లీ టిక్కెట్టు ఆశిస్తున్నట్లు సమాచారం. అలాగే, వైసిపిలో కూడా టిక్కెట్లు రాదని అనుకుంటున్న నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారట. మొత్తం మీద తెలంగాణా ఎన్నికల ఫలితాల వల్ల జనసేనకు డిమాండ్ పెరగటం విచిత్రంగా ఉంది.