తిరుపతి ఉపఎన్నికల వ్యవహారం రోజురోజుకూ వేడెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో ఎలాగైనా పైచేయి సాధించాలని పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి పెట్టుకుంటే జనసేన, బీజేపీలు పోటీలో ఏ పార్టీ నుండి అభ్యర్థిని నిలబెట్టాలని విషమై తలమునకలయ్యాయి. ఎవరికివారు ప్రత్యర్థులను ఓడించాలని వ్యూహాలు పన్నుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన – బీజేపీ కూటమి, కాంగ్రెస్ మాత్రమే బరిలోకి దిగుతాయని మొదటి నుండి అనుకుంటుండగా ఇప్పుడు దళిత సంఘాలు కూడ రేసులో నిలబడ్డాయి. ఈ ఎన్నికల్లో దళిత సంఘాల తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని, దీని ద్వారా దళితులంతా ఏకమయ్యారనే విషయం స్పష్టం చేయాలని భావిస్తున్నట్టు జై భీమ్ జస్టిస్ ఆక్సిస్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్ తెలిపారు.
గత కొన్ని నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో దళితుల మీద దాడులు ప్రధానంగా చర్చకు వస్తోంది. రెండు మూడు నెలల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో దళితుల మీద వరుస దాడులు జరిగాయి. వీటన్నింటికీ కారణం వైకాపా ప్రభుత్వమేనని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతోంది. వైసీపీలో రెడ్డి నాయకులు దళితుల మీద కక్ష కట్టారని, వారిని అణచివేయాలని చూస్తున్నట్టు, రాష్ట్రంలో దళితులకు భద్రత లేదని ఆరోపణలు చేశారు. జగన్ సర్కార్ కూడ చంద్రబాబు ఆరోపణలకు ధీటైన సమాధానమే ఇస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో దళితులు వైకాపాకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. దాదాపు 70 శాతం ఓటు బ్యాంక్ జగన్ వైపే నిలిచింది. అందుకే రిజర్వ్డ్ స్థానాలన్నీ దాదాపు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అలాంటి వైసీపీ మీద దళిత వ్యతిరేకమనే ముద్ర పడతుండటం ఆసక్తిని రేపుతోంది.
ఆపాదడపా జరిగిన సంఘటనలను వాడుకుంటూ ప్రతిపక్షం వైసీపీని దళితులకు దూరం చేయాలని గట్టిగా ట్రై చేస్తోంది. అందుకే వీలైన ప్రతిచోటా దళిత కార్డును వాడుకుంటున్నారు. ఇక తిరుపతి లోక్ సభ స్థానం కూడ ఎస్సీలకు కేటాయించబడినదే. అందుకే దళిత సంఘాలు కలిసి అభ్యర్థిని నిలబెడుతున్నట్టు శ్రవణ్ కుమార్ అంటున్నారు. అయితే శ్రవణ్ కుమార్ నేతృత్వం వహిస్తున్న దళిత సంస్థ వెనుక ఎన్ని దళిత సంఘాలు ఉన్నాయి, వాటిలో ఎన్ని క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి, వాటికి ఎంతమంది మద్దతు ఉందనేది తేలాల్సి ముఖ్యమైన విషయం. గతంలో ఇలా కొన్ని సామాజికవర్గాల సంఘాలు ఎన్నికల్లో పోటీకి దిగినా గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. సొంత వర్గం ప్రజలే వారిని ఆదరించని తరుణాలే ఎక్కువ. మరి తిరుపతి ఉపఎన్నికల్లో దళిత వర్గాలన్నీ కలిసి నిలబెడుతాయని చెబుతున్న అభ్యర్థి ఏమాత్రం ప్రభావం చూపుతారు, అధికార పార్టీ ఓట్లను ఏమేరకు చీలుస్తారు అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది.