కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టు పార్టీలోకి కిశోర్ చంద్ర దేవ్?

పార్టీలు మారడం ఈ కాలం విశేషం కాదు. అదంత పెద్ద వార్త కూడా కాదు, కాంగ్రెస్ వాళ్లు టిడిపిలోకి వస్తారు, టిడిపి వాళ్లు వైసిపిలోకి వస్తారు. కాంగ్రెస్ నుంచి టిడిపి మీదుగా వైసిపిలోకి వస్తారు. వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్తారు. ఇలా పార్టీలు మారుతూ ఉంటారు. ఇలాంటి వార్తలు విని స్టన్ అయిపోయే రోజులు పోయాయి. సిపిఎం వదిలేసి టిఆర్ ఎస్ లోకి వెళ్లడం చూశాం అదే విధంగా సిపిఐ వాళ్లు కూడా పార్టీ మారడం విన్నాం. అయితే, కాంగ్రెస్ నుంచి సిపిఎం లోకి వెళ్లడం ఎక్కడయయినా విన్నామా?

ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉన్న అధ్వాన్నమయిన పరిస్థితినుంచి బయటపడేందుకు కాంగ్రెస్ వాళ్లు ఏ పార్టీలోకైనా వెళ్తారు, లేదా అదే పార్టీ లో ఉంటారు గాని కమ్యూనిస్టు పార్టీలో చేరతారా? అయితే, ఇలాంటి వింతే ఇపుడు జరుగుతూ ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేత, ఎలాంటి వివాదాలలో లేకుండా రాజకీయాల్లో నిష్కళంకుడిగా పేరున్న మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ పార్టీ వదిలేసి సిపిఎంలోకి వెళ్తున్నారనే వార్త గుప్పు మంది.

ఆయన అల్లాటప్ప లీడర్ కాదు. దశాబ్దాలుగా కాంగ్రెస్ తో అను బంధం ఉన్నవారు. వివాద రహితుడు, కాంగెస్ అధిష్టానం దగ్గిర గౌరవం కూడా ఉన్నవాడు. సోషలిస్టు భావాలు ఉన్నవాడు. ఆయన ఇపుడు కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) లో చేరుతున్నట్లు వార్త లొస్తున్నాయి.

1977లో ఆయన తొలిసారి ఎంపిగా గెలిచారు. పార్వతీపురం లోక్ సభ స్థానానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించాక, 2009 లో అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ‘అరకు’ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

1979లోనే ఇందిరాగాంధీ నాయకత్వంలో బొగ్గు గనులు, ఉక్కు శాఖ సహాయ మంత్రి అయ్యారు. 2011లో యుపిఎ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమం, పంచాయతీ రాజ్ శాఖ క్యాబినెట్ మంత్రి అయ్యారు.చాలా పార్లమెంటరీ కమిటీల కు నాయకత్వం వహించి యోగ్యుడని పేరుపొందారు. 2008లో ఓటుకు నోటు కేసు వివాదం మీద వేసిన పార్లమెంటరీ కమిటీకి ఛెయిర్మన్ గా ఉన్నారు. ఒక సారి రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. కాంగ్రెస్ లో నిబద్ధత కలిగిన నాయకుడు. అవసరమయినపుడు పార్టీ ని విమర్శించడానికి కూడా వెనకాడరు.

కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో రాష్ట్రంలో పాలనా తీరు మీద విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. ఎంపి విభజన తర్వాత ఆయన పూర్తిగా క్రియారహితం అయ్యారు. ఒక దశలో పిసిసి అధ్యక్షుడిని మార్చాలని కూడా ఆయన హైకమాండ్ కు సూచించారు.

ఇలాంటి వ్యక్తి ఇపుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా పోన్ చేసి పార్టీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచన మానుకోవాలని కోరారు. అయితే ఆయన తన నిర్ణయం మార్చుకోలేదు. ఆయన మరో పార్టీ లో చేరబోతున్నారని చెబుతున్నారు. అయితే అదే పార్టీ?

కొందరేమోతెలుగుదేశం పార్టీ అన్నారు.ఇంకొకవైపు వైసిపి అని కూడా వినిపించింది. అయితే, ఇపుడు ఆశ్చర్య కరమయిన వార్త గుప్పు మంది . ఆయన సిపిఎం పార్టీ లో చేరబోతున్నారని బలంగా వినబడుతూ ఉంది. గిరిజనులు ఎక్కువగా ఉన్న అరకు లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన సిపిఐ, జనసేన వంటి పార్టీ లసహకారంతో పోటీ చేస్తారని బలంగా వినిపిస్తూ ఉంది.