థింక్ డిఫరెంట్: (ఎర్ర)గులాబీ పాలిటిక్స్ ఇవి!

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ జరిగిన రెండుసార్లు ఎన్నికలు ఒకెత్తు.. ఈసారి జరగబోయే ఎన్నికలు మరొకెత్తు అన్నస్థాయిలో ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది! ఈ క్రమంలో… అటు పాదయాత్రలంటూ కాంగ్రెస్, బీజేపీలు ఎవరి దారిలో వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. తన స్టైలాఫ్ రాజకీయం తాను చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లూ ఒంటరిగానే బరిలోకి దిగిన టీఆరెస్స్.. నేడు బీఆరెస్స్ గా మారిన తర్వాత మాత్రం కొత్త రకం పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధపడుతుందట! ముందుజాగ్రత్తో లేక హస్తినలో తోడులో భాగమో కానీ… తెలంగాణలో అటు కాంగ్రెస్ – ఇటు బీజేపీలను బలంగా ఎదుర్కోవాలంటే ఎర్ర తోడు కావాలని ఫిక్సయ్యారంట కేసీఆర్. అయితే.. ఆ తోడులో – ఆ కలయికలో ఒక మెలిక కూడా సిద్ధం చేసుకున్నారు!

అవును… సీపీఎం, సీపీఐ లతో పొత్తు కలిసి ఈ సారి ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. ఆ రెండు పార్టీలు కనీసం తలో రెండు సీట్లు అడిగినా కూడా కేసీఆర్ ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. ఇప్పటికే తెలంగాణలో ఒక్కో నియోజకవర్గానికి బీఆరెస్స్ తరుపున కనీసం ఇద్దరేసి చొప్పున రెడీగా ఉన్నారు! దీంతో సర్దుబాట్ల తలనొప్పులు మొదలయ్యే అవకాశాలు పుష్కలం. దీంతో కేసీఆర్ మరో ఆలోచన చేశారంట!

ఫలితంగా… ఎర్రన్నలతో పొత్తు స్థానే అవగాహనతో పోవాలని నిర్ణయించారు కేసీఆర్! అంటే… అసెంబ్లీ స్థానాల్లో అవకాశం ఇవ్వరు కానీ, ఇటు స్టేట్ లోనూ, అటు సెంట్రల్ లోనూ పెద్దల సభలకు పంపనున్నారంట! అంటే… పని మాత్రం శాసనసభ- లోక్ సభ ఎన్నికలకు చేయించుకుని.. ప్రతిఫలం మాత్రం శాసన మండలి – రాజ్యసభల రూపంలో ఇవ్వనున్నారన్నమాట! ఇది బీఆరెస్స్ స్ట్రాటజీ అన్నమాట!