సెక్యులర్ వాదం – అవకాశవాదం… మధ్యలో పవనిజం!

గత రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో పవన్ హాట్ టాపిక్ గా మారారు. వరుసపెట్టి మైకులముందుకు వస్తున్న పవన్… రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. గంటల వ్యవధిలో కొత్త కొత్త వ్యాఖ్యలు చేస్తూ, వాటికి తనదైన విశ్లేషణలు, వివరణలు ఇస్తున్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలు అర్ధం చేసుకున్న కొంతమంది జనసైనికులు తలలు పట్టుకుంటుంటే… అర్ధంకానివారు మాత్రం ఆగకుండా చప్పట్లు కొడుతున్నారు. ఈ సమయంలో పవన్ పై ఎర్రన్నలు మాత్రం నమ్మకంగా ఉన్నారు.

పవన్ ఒక పక్క బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పనిచేయాలని, ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేయాలని, 2014 రిజల్ట్స్ రిపీట్ కావాలని కోరుతున్నారు. ఫలితంగా రాష్ట్రానికి ఏదో ఒరుగుతుందని చెప్పడం లేదు కానీ… జగన్ ను ఓడించడం ఒక్కటే ప్రధాన లక్ష్యం అని అంటున్నారు. పవన్ కోరికలు అలా ఉంటే… పవన్ సెక్యులర్ వాదని, బీజేపీతో కలవరని నమ్మకంగా చెబుతున్నారు కమ్యునిస్ట్ నేతలు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెక్యులర్ వాదని నొక్కి చెబుతున్నారు కమ్యునిస్ట్ పార్టీ నేత రామకృష్ణ. మతతత్వ పార్టీ అయిన బీజేపీతో, జై భజరంగబలి అని ఓట్లు అడిగే పార్టీతో పవన్ కలవరని ఆయన బలంగా నమ్ముతున్నారు. అయితే… పవన్ ఇప్పటికే బీజేపీతో కలిసి ఉన్నారనే విషయం గుర్తుచేస్తున్నారు బీజేపీ నేతలు. పవన్ సెక్యులర్ వాది కాదని, అవకాశవాది అని వైసీపీ నేతలు సెటైర్స్ వేస్తున్నారు.

2014లో కలిసి పోటీచేసినప్పుడు, 2019 ఎన్నికల తర్వాత పొత్తులో ఉన్నప్పుడు, 2024 ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని రిక్వస్ట్ లెటర్లు రాస్తున్నప్పుడు.. ఇంకా పవన్ లో సెక్యులర్ వాద భావాలు ఉన్నాయని నమ్మడం అంత అజ్ఞానం మరొకటి లేదని కాస్త గట్టిగానే చెబుతున్నారు. ఇప్పటికే కేవలం మతతత్వ రాజకీయాలను మాత్రమే నమ్ముకుని బండి లాగిస్తున్న బీజేపీ నేతలు, తాము అధికారలోకి వచ్చిన రాష్ట్రాల్లో ముస్లింల రిజర్వేషన్స్ ఎత్తేస్తామని చెబుతున్న బీజేపీతో పవన్ జతకట్టాలని భావించడం… సెక్యులర్ వాద ముసుగులో, మతతత్వవాద రాజకీయాలు చేసే అవకాశవాద రాజకీయ నాయకుడని సెటీర్లు పేలుస్తున్నారు.

మరి కమ్యునిస్టులు చెబుతున్నట్లు పవన్.. సెక్యులర్ వాదా, వైసీపీ నాయకులు చెబుతున్నట్లు పవన్ కులతత్వ వాదా.. లేక నెటిజన్లు అభిప్రాయపడుతున్నట్లు అవకాశవాదా అన్నది తెలియాలంటే.. పొత్తులు ఫైనల్ అయ్యే వరకూ వేచి చూడాలి!