అబ్బాయ్-బాబాయ్ మధ్య ఆధిపత్య పోరు..2019లో ఏమవుతుందో ?

తెలుగుదేశంపార్టీకి సంబంధించి పోయిన ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు చాలా తేగా ఉంటుంది. పోయిన ఎన్నికలేమో పదేళ్ళ ప్రతిపక్షంలో ఉండి అధికార కరువుతో అల్లాడుతున్న నేపధ్యంలో వచ్చినవి. వచ్చే ఎన్నికలేమో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మధ్య జరుగబోతున్నవి. దానికితోడు ప్రతి జిల్లాలోనూ నేతల మధ్య ఆధిప్యత పోరు తీవ్రంగా ఉంది. అందులో శ్రీకాకుళం కూడా మినహాయింపేమీ కాదు. ఈ జిల్లాలో ఆధిపత్యం ఎవరి మధ్యో కాదు. స్వయానా అబ్బాయ్-బబ్బాయ్ కింజరాపు రామ్ మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు మధ్యే కావటంతో చంద్రబాబు తలలు పట్టుకుంటున్నారు.

తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లా అంటే కింజరాపు బ్రదర్సే అన్నట్లుగా అయిపోయింది. కింజరాపు కుటుంబమంటే ముందు యర్రన్నాయుడు తర్వాత అచ్చెన్నాయడు. సరే వారసత్వ హోదాలో యర్రన్నాయుడు ఇపుడు కొడుకు రామ్ మనోహర్ నాయుడు తయారవుతున్నారు. దశాబ్దాల పాటు సాగిన వారి హవా వచ్చే ఎన్నికల్లో కూడా కంటిన్యూ అవుతుందా అన్నదే అనుమానంగా మారింది. ఎందుకేంట, వచ్చే ఎన్నికలు ఇద్దరి సామర్ధ్యానికి ఒకేసారి పరీక్షగా నిలవబోతున్నాయి.

మనోహర్ నాయుడు తండ్రి కేంద్ర మాజీ మంత్రి కింజరాపు యర్రనాయుడు జిల్లాలోని  శ్రీకాకుళం  పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీకి బలమైన పునాదిని వేశారనే చెప్పాలి. టిడిపితో రాజకీయ అరంగేట్రం చేసిన యర్రన్నాయుడు 1996లో శ్రీకాకుళం ఎంపిగా పోటీ చేసి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఒకసారి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 1983 నుండి నాలుగుసార్లు జిల్లాలోని హరిశ్చంద్రాపురం ఎంఎల్ఏగా సేవలందించారు. అయితే, 2012, నవంబర్ 2న జిల్లాలోని రణస్ధలం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. 

ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే 2014 ఎన్నికల్లో రామ్ మోహన్ నాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేనాటికే తండ్రి యర్రన్నాయడు బలమైన రాజకీయ పునాది వేసుంచారు. రోడ్డు ప్రమాదంలో తండ్రి హఠాత్తుగా మరణించటం, రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగిన ప్రత్యేకమైన ఎన్నికలు, టిడిపికి బిజెపి, పవన్ కల్యాణ్ మద్దతుగా నిలవటం లాంటి అనేక అంశాల కారణంగా రామ్ మోహన్ నాయుడు సునాయాసంగానే గెలిచారు. టిడిపి అభ్యర్దిగా రామ్మోహన్ కు 5,56,163 ఓట్లొస్తే వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసిన రెడ్డి శాంతికి 4,28,591 ఓట్లొచ్చాయి. అంటే రామ్మోహన్ 1,27,572 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

సరే, 2014 లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రియిన దగ్గర నుండి జరిగిన డెవలప్మెంట్సన్నీ అందరికీ తెలిసిందే. ముందు పవన్ తో విడిపోవటం తర్వాత కేంద్రమంత్రివర్గంలో నుండి ఆ తర్వాత ఎన్డీఏలో నుండి కూడా టిడిపి బయటకు వచ్చేసింది. అక్కడి నుండే చంద్రబాబుకు సమస్యలు మొదలయ్యాయి. అంతకుముందే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా పాదయాత్ర మొదలుపెట్టారు. జనాలు కూడా పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

నిజానికి నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనపై జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చేసింది. చంద్రబాబు మీద వ్యతిరేకతతోనే జనాలు జగన్ పాదయాత్రలో విశేషంగా పాల్గొంటున్నారు. మొత్తం ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైల్వేజోన్ అంశమే చాలా కీలకం. దాని తర్వాత ఉధ్థానంలో కిడ్నీ వ్యాధి బాధితుల సమస్య పరిష్కారం బాగా కీలకమైంది. విశాఖపట్నం రైల్వేజోన్ రాదన్న విషయం తేలిపోయింది. అదే సమయంలో ఉధ్థానం కిడ్నీ సమస్యతో పాటు స్ధానికంగా ఇతరత్రా సమస్యలను కూడా రామ్మోహన్ పరిష్కరించ లేకపోయారు. దాంతో జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందనే చెప్పాలి.

పార్లమెంటు నియోజకవర్గంలో శ్రీకాకుళం, ఇచ్చాపురం, పాతపట్నం, నరసన్నపేట, పలాస, టెక్కలి, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం ఏడు నియోజకవర్గాల్లో పాతపట్నంలో మాత్రమే వైసిపి అభ్యర్ధి కలమట వెంకటరమణ గెలిచారు. మిగిలిన ఆరింటిలోను టిడిపి అభ్యర్ధులే గెలిచారు. అందులోనూ ఇచ్చాపురంలో 25038, శ్రీకాకుళంలో 24131 ఓట్లొచ్చాయి. దాంతో రామ్మోహన్ గెలుపు నల్లేరు మీద నడక అయిపోయింది.

 

అయితే వచ్చే ఎన్నికలు అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే, ప్రభుత్వంపై పెరిగిపోయిన జనాల వ్యతరేకత, జగన్ పాదయాత్ర ప్రభావం, పార్టీలోనే అంతర్గతంగా విభేదాలు అన్నీ ప్రభావం చూపుతాయి. వీటన్నింటికి తోడు సొంత బాబాయ్ అంటే యర్రన్నాయడు తమ్ముడు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో గొడవలు ఎక్కువైపోయాయి. జిల్లా పార్టీపై ఆధిపత్యం విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోయాయి. మంత్రిపై ఎంపి తన తల్లితో కలిసి చంద్రబాబు దగ్గర ఫిర్యాదు చేయటం కూడా పెద్ద దుమారమే రేపింది.

యర్రన్నాయుడు నీడలో రాజకీయంగా ఎదిగిన అచ్చెన్న అన్న తరపున జిల్లాలో రాజకీయ పెత్తనం బాగా చెలాయించేవారు. హఠాత్తుగా సోదరుడు మరణించటంతో పరోక్షంగా చేసిన పెత్తనం కాస్త ప్రత్యక్షమైపోయింది. దాంతో అచ్చెన్న మాటకు ఎదురు లేక పోయింది. తిరుగులేని పెత్తనంతో పాటు వ్యతిరేకతను కూడా తెస్తుంది కదా ? అయితే, పోయిన ఎన్నికల్లో వారసత్వంగా రామ్ ఎంపిగా గెలవటంతో అచ్చెన్న వ్యతిరేకులంతా అబ్బాయ్ మద్దతుగా నిలబడ్డారు. దాంతో జిల్లాపై అబ్బాయ్-బాబాయ్ మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయింది. ఈ సమస్య పరిష్కారంగానే అచ్చెన్నను ఎంపిగా పోటీ చేయమని చంద్రబాబు చెబుతున్నారట. అంటే అపుడు అబ్బాయ్ టెక్కలి ఎంఎల్ఏగా పోటీ చేస్తారేమో ?

 

ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గానికి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో టిడిపి 6 సార్లు గెలిచింది. అందులోను తండ్రి కొడుకులే ఐదుసార్లు, ఒకసారి కణితి విశ్వనాధం గెలిచారు. ఎనిమిదిసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 1952లో జరిగిన మొదటి ఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధి బొడ్డేపల్లి రాజగోపాలరావు గెలిచారు. అలాగే, 1967లో జరిగిన ఎన్నికలో స్వతంత్ర అభ్యర్దిగా ఎన్జీ రంగా గెలిచారు.   నియోజకవర్గంలో మొత్తం 12,26,125 ఓట్లున్నాయి. అందులో మహిళా ఓటర్లు 6,32,961 కాగా పురుష ఓటర్లు 5,93,164 మంది. జిల్లాలో ఉన్నట్లే నియోజకవర్గంలో కూడా తూర్పు కాపులు, కొప్పుల వెలమలు, జాలర్లు ఎక్కువగా ఉన్నారు. అంటే ఒక విధంగా బిసిల జనాభా ఎక్కువ. రామ్మోహన్ నాయడు వెలమ సామాజికవర్గానికి చెందిన నేత.

ఇక వైసిపి విషయానికి వస్తే పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన రెడ్డి శాంతి చాలా యాక్టివ్ గా తిరుగుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపిగా పోటీ చేస్తారో లేదో తెలీదు. అదే సమయంలో జనసేన, బిజెపి, కాంగ్రెస్ తరపున కూడా అభ్యర్ధులు పోటీలో ఉండే అవకాశాలున్నాయి. పోయిన ఎన్నికల్లో టిడిపికి మద్దతుగా నిలిచిన బిజెపి, జనసేన వేరు కుంపట్లు పెట్టుకున్న కారణంగా రామ్మోహన్ కు బాగా ఇబ్బందే. వైసిపికి పోయిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు వస్తే చాలు. బిజెపి, జనసేనలు వాటి ఓట్లు అవి పోల్ చేసకుంటాయి. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఓట్లను వైసిపి వేయించుకోగలిగితే అవి బోనస్ అవుతాయి. కాబట్టి ఇన్ని వ్యతిరేకతల మధ్య రామ్మోహన్ పోటీ చేయటమంటే పెద్ద పరీక్షను ఎదుర్కోవటమనే చెప్పాలి.