సంచలనం : కొత్త వివాదంలో కాంగ్రెస్ బండ్ల గణేష్ (వీడియో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 

బండ్ల గణేష్ సినీ రంగంలో ఎంత మెరుపు వేగంతో దూసుకొచ్చి స్టార్ డమ్ సాధించారో కానీ రాజకీయాల్లో మాత్రం అంతటి వేగాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేరారో లేదో ఇలా విమర్శల పాలయ్యారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతున్న తరుణంలో బండ్ల గణేష్ ను వివాదం చుట్టు ముట్టింది.

టివి 1 అనే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు. ఎన్నికల సర్వేల గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ ఇచ్చిన సమాధానం వివాదం రగిలించింది. ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నారో? లేక యథాలాపంగా అన్నారో తెలియదు కానీ తీవ్ర దుమరాం రేగుతున్నది.

ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఒకసారి చదవండి…

‘‘సర్వేలు ఏముందండి సార్.. సర్వేజనా సుఖినోభవంతు.. సర్వేలు ఏముంటది సార్. మా షాద్ నగర్ పోతే బైకులేసుకుని వరుసగా ఉంటారు కుర్రాళ్లు. అరే ఏం చేస్తున్నావురా అంట. అందరూ ఒకటే డైలాగ్ కొడతారు. ఏం చేయరు. వాళ్లు పాన్ వేసుకుని సిగరేట్ తాగుతుంటారు. ఏందంటే రియల్ ఎస్టేట్ అంటారు. స్కూటరోడు , కారోడు ఎవరిని అడిగినా రియల్ ఎస్టేట్.. అట్లాగే ఇప్పుడు ఎవరిని అడిగినా సర్వేలే అంటున్నారు.  రియల్ ఎస్టేట్ బూమ్ ఉండేది 2004లో అప్పుడు ఎవరిని అడిగినా రియల్  ఎస్టేట్ అనేవారు. టెన్త్ క్లాస్ తప్పినోడు కూడా రియల్ ఎస్టేట్ అనేవారు.’’ అని మాట్లాడారు బండ్ల గణేష్.

షాద్ నగర్ యూత్ నిరసన 

బండ్ల గణేష్ షాద్ నగర్ యూత్ ను అవమానించేలా మాట్లాడారని, ఎవరూ ఏం చేయరు, నోట్లో పాన్ వేసుకుని, సిగరేట్ తాగుతూ రియల్ ఎస్టేట్ చేస్తారంటూ అవమానించేలా మాట్లాడారని సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పై షాద్ నగర్ యూత్ విరుచుకుపడుతున్నారు. పానేసుకుని సిగరేట్ తాగడం ఎలాగో బండ్ల గణేష్ నేర్పితే నేర్చుకుంటా అని ఒక యువకుడు ఫేస్ బుక్ లో తన వాల్ మీద పోస్టు చేశాడు. తక్షణమే బండ్ల గణేష్ షాద్ నగర్ యూత్ కు క్షమాపణ చెప్పాలని ఇంకో యువకుడు పోస్టు పెట్టారు. అంతేకాకుండా టివి 1లో వచ్చిన ఇంటర్వ్యూ క్లిప్ ను కూడా తన వాల్ మీద పోస్టు చేశాడా యువకుడు.

బండ్ల గణేష్ టివి 1 కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో క్లిప్ కింద ఉంది చూడండి.