ఆంధ్రా టిడిపికి మాజీ మంత్రి గుడ్ బై, ఆయన దారేది ?

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ఆంధ్రప్రేదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. సేఫ్ జోన్ లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు సేఫ్ పార్టీ అనుకుంటే ఆ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఇప్పుడున్న పార్టీలో అవమానాలకు గురవుతున్నట్లు భావించేవారు పక్క పార్టీల్లో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

తాజాగా నవ్యాంధ్ర మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు టిడిపికి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. డిసెంబరు 1న ఆయన టిడిపికి గుడ్ బై చెప్చి మరో పార్టీలోకి చేరనున్నారు. ఆంధ్రా రాజకీయాల్లో రావెల కిశోర్ బాబు టిడిపిలో ఒక సమయంలో ఫైర్ బ్రాండ్ గా నిలిచారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన స్థాయిలో ఆయన విమర్శల వర్షం కురిపించారు. అలాగే తెలంగాణ సిఎం కేసిఆర్ మీద కూడా నిప్పులు చెరిగారు ఓటుకు నోటు కేసు సమయంలో కేసిఆర్ మీద విమర్శల వర్షం కురిపించారు. ఇక ఏండ్ల తరబడి జగన్ ను టార్గెట్ చేసి పదునైన విమర్శలు చేస్తూ  రావెల హాట్ టాపిక్ అయ్యారు.

రావెల కుటుంబం మీద విమర్శలు

అయితే రావెల గత కొద్దికాలంగా టిడిపిలో అసంతృప్తితో ఉన్నారు. ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఆయన కుటుంబం మీద విమర్శలు రావడం, ఆయన ఒక వర్గానికే మంత్రిగా ఉండి పనిచేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు చంద్రబాబునాయుడు. దీంతో ఆయన గత కొంతకాలంగా మంత్రి పదవిలేకుండానే పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 

రావెల కిశోర్ బాబు కుటుంబం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఒక సమయంలో రావెల తనయుడు హైదరాబాద్ లో ఒక యువతి చేయి పట్టుకున్నట్లు విమర్శలు వచ్చాయి. సిసి టివిల్లో కారు నడుపుకుంటూ వెళ్లి ఒక మహిళ చేయి పట్టుకుని ఆమెను వేధింపులకు గురిచేసినట్లు రికార్డు అయ్యాయి. ఆ సిసి పుటేజ్ సోషల్ మీడియాతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారం రేపింది. 

డిసెంబరు 1వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా  కొల్లిపొర బహిరంగసభలో రావెల జన సేనలో జాయిన్ కానున్నారు. ప్రస్తుతం రావెల పత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రావెల మరో రిజర్వుడు సీటు అయిన వేమూరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే రావెల కు జనసేనాని పవన్ కళ్యాణ్ లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం అందుతోంది. 

ప్రస్తుతం వేమూరు నియోజకవర్గానికి మంత్రి నక్కా ఆనంద బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రావెల వివాదాల్లో చిక్కారు. దీంతో ఆయనను చంద్రబాబు పదవి నుంచి తప్పించి నక్కా ఆనంద బాబుకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. ఈ నేపథ్యంలో నక్కా ఆనంద బాబు మీదనే రానున్న ఎన్నికల్లో రావెల కిశోర్ బాబు పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు.

రావెల ఎందుకు పార్టీ మారుతున్నారంటే..?

రావెల టిడిపిని ఎందుకు వీడబోతున్నారన్నదానిపై రాజకీయవర్గాల్లో హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో అణగారిన వర్గాలకు ప్రాధాన్యత లేదని ఆయన ఆవేదన చెందుతున్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు చేసేందుకు మాత్రమే టిడిపిలో దళిత, బడుగు బలహీన వర్గాల నేతలను వినియోగిస్తారని, తీరా వారి అవసరం తీరాక వారిని కరివేపాకు కంటే హీనంగా చూస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రావెల రాకతో గుంటూరులో జనసేన పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందా? లేక రావెల వల్ల ఆ పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదా అన్న చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జన సేనలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మంత్రి స్థాయిలో పనిచేసిన రావెల కూడా చేరడం ఆ పార్టీకి కొంత మైలేజీ రావొచ్చని జన సేన వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను టిడిపి ఎలా ఎదుర్కోబోతున్నది అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.