స్థానిక ఎన్నికల విషయాల్లో క్యాంపు రాజకీయాలు కొత్తేమీ కావు. రెండు పార్టీల మధ్యన పోటాపోటీ పరిస్థితి వచ్చినప్పుడు, సమస్థాయిల్లో అభ్యర్థులున్నప్పుడు, పరోక్ష పద్ధతిలో జరిగే మేయర్, చైర్మన్ ఎన్నికల సందర్భాల్లో బలాలు తారుమారు అయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని.. క్యాంపు రాజకీయాలను నిర్వహిస్తూ ఉంటాయి పార్టీలు. అయితే అదంతా పోలింగ్ తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాతి కథ. గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవడానికి, వారు ప్లేటు ఫిరాయించి మేయర్ ఎన్నిక సందర్భంగా రూటు మార్చకుండా ఉండటానికి పార్టీలు క్యాంపులను పెట్టుకోవచ్చు.
అయితే ఇప్పుడు ఏపీలో ఇంకా పోలింగ్ కు ముందే క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయనే వార్తలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ప్రత్యేకించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత జిల్లాలో ఈ చోద్యం జరుగుతోందట.అక్కడ ఎలాగోలా నామినేషన్లను వేయించిన టీడీపీ, అభ్యర్థులు ఆఖరి నిమిషంలో వెనక్కు తగ్గకుండా వారిని బెంగళూరు పంపించేస్తోందట. చిత్తూరు టౌన్ కు సంబంధించిన ఎన్నికలో పోటీలో ఉన్న, నామినేషన్లను వేసిన అభ్యర్థుల్లో ఎవరు పోటీలో ఉంటారో, ఎవరు తగ్గుతారో అనే భయాల నేపథ్యంలో నామినేషన్లను వేసిన వారిని రాష్ట్రం దాటిస్తున్నారట పచ్చపార్టీ వాళ్లు.
డబ్బులు ఇచ్చి, బెంగళూరు పంపించి, సెల్ లు స్విచ్ఛాప్ చేసుకోమ్మని, గెలుపోటములతో సంబంధం లేకుండా తాపీగా ఉండాలని పోటీలో ఉంటే అదే పదివేలు అన్నట్టుగా ఉందట పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగుతున్నారట. తమ వాళ్లను బెదిరిస్తున్నారంటూ ఆయన ధర్నాకు దిగబోతున్నారట. చంద్రబాబు నాయుడు ఇలాంటి ధర్నాలకు ప్లాన్లు చేశారంటేనే.. అక్కడ టీడీపీ పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు.
చంద్రబాబు నాయుడు ధర్నాలు, దీక్షలు అన్నారంటే అక్కడ తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం జరుగుతున్నట్టే అని గత ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో నిలబడనీయకుండా తమ వారిని బెదిరిస్తున్నారంటూ.. చంద్రబాబు నాయుడు ధర్నాకు దిగుతున్నారంటే, అక్కడ టీడీపీ పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారని దాన్ని కవర్ చేయడానికే చంద్రబాబు నాయుడు ఇలా రంగంలోకి దిగుతుంటారని వేరే చెప్పనక్కర్లేదు కూడా!