YS Sharmila Alleges: ఆరోగ్యశ్రీని ప్రైవేట్‌కు తాకట్టు పెడుతున్నారు: చంద్రబాబుపై షర్మిల ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు పాల్పడుతోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రైవేట్ ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడం వెనుక, పేదలకు సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే దురుద్దేశం దాగి ఉందని ఆమె ఆరోపించారు.

కుట్ర ఆరోపణ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వీర్యం చేస్తూ రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని షర్మిల విమర్శించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.2,700 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతోనే ఆసుపత్రులు సమ్మెకు దిగాయని, నెల రోజులుగా ఓపీ సేవలు నిలిచిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు దానిని కేవలం 10 శాతానికి కుదించి రూ.2.5 లక్షల ప్రైవేట్ బీమాతో సరిపెట్టడం మోసమేనని ఆరోపించారు. రూ.2.5 లక్షలు దాటితే మళ్లీ ఆరోగ్యశ్రీ కింద ఇస్తామనడంలో ఆంతర్యం ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చడమేనని ఆమె ప్రశ్నించారు. ఏటా రూ.4 వేల కోట్లు ఆరోగ్యశ్రీ కోసం కేటాయించడానికి వెనుకాడే ప్రభుత్వం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వేల కోట్లు ఎలా దోచిపెడుతుందని నిలదీశారు.

దేశంలో ప్రైవేట్ బీమా అమలు చేసిన 18 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు తిరిగి ప్రభుత్వ ట్రస్ట్ విధానానికే మళ్లాయని షర్మిల గుర్తు చేశారు.

ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ బీమాకు అనుసంధానించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ట్రస్ట్ విధానంలోనే ఆరోగ్యశ్రీని కొనసాగించాలి.  ఆసుపత్రులకు ఉన్న రూ.2,700 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి, వైద్య సేవలను పునరుద్ధరించాలి. ప్రభుత్వ తీరుపై షర్మిల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పించారు.

Adulterated liquor Behind Story After Kutami Govt Ruling | Telugu Rajyam