RK Roja: చంద్రబాబు నగరి పర్యటన ‘అట్టర్ ప్లాప్’.. ఖాళీ కుర్చీలకే అబద్ధాలు చెప్పారు: మాజీ మంత్రి రోజా ధ్వజం

RK Roja: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటన పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. శనివారం నగరిలో జరిగిన సభలో జనస్పందన కరువైందని, ఖాళీ కుర్చీలను చూస్తూ చంద్రబాబు అలవోకగా అబద్ధాలు చెప్పారని ఆమె ఎద్దేవా చేశారు.

నగరిలో చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, అందుకే చెప్పుకోవడానికి ఏమీ లేక వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 100 పడకల ఆసుపత్రికి పునాది పడితే, జగన్ హయాంలో దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. సీఎం పర్యటన కోసం ఆసుపత్రిలోని పేషెంట్లను కూడా బయటకు పంపించి శుభ్రం చేయించడం సిగ్గుచేటని విమర్శించారు.

నగరిలో డయాలసిస్ సెంటర్లు, ఎలక్ట్రిక్ స్మశాన వాటిక, పార్కులు, పుత్తూరులో పాలిటెక్నిక్ కాలేజ్, షాదీ మహల్ వంటివి నిర్మించామని గుర్తుచేశారు. టీటీడీ ద్వారా వడమాలపేట, బుగ్గ అగ్రహారం వద్ద కళ్యాణ మండపాలు, నిండ్రలో ఐటీ కాలేజ్, సబ్ స్టేషన్లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను తామే నిర్మించామన్నారు.

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేపై గతంలో చంద్రబాబు విష ప్రచారం చేశారని, ఇప్పుడు అదే సర్వేను తమ గొప్పతనంగా చెప్పుకోవడం హాస్యాస్పదమని రోజా అన్నారు. “జగనన్న తెచ్చిన టెక్నాలజీతోనే మీరు రీసర్వే చేస్తున్నారు. పాస్ బుక్ ల అట్టలు మార్చి ‘కాపీ క్యాట్’లా ఇస్తున్నారు. జగన్ తెచ్చిన రీసర్వే వల్ల ప్రభుత్వానికి రూ. 400 కోట్ల రాయితీ వచ్చింది నిజం కాదా? దమ్ముంటే ఆ సర్వేను రద్దు చేయండి” అని ఆమె సవాల్ విసిరారు.

నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన తండ్రి ముద్దుకృష్ణమనాయుడు నియోజకవర్గాన్ని నాశనం చేశారని రోజా ఆరోపించారు. నాలుగుసార్లు సీఎంగా ఉన్నా, సొంత జిల్లాలోని నగరి నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని ఆమె దుయ్యబట్టారు. గతంలో జగన్ పై ఏ విధంగా అయితే విషం చిమ్మారో, ఇవాళ నగరిలో కూడా అదే పద్ధతిని కొనసాగించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

పళ్ళు రాలుతాయ్ || Congress Kalva Sujatha Fires On KTR Phone Tapping Case || Revanth Reddy || TR