నేల రాలిన మరో తెలంగాణ జర్నలిస్ట్… విషాదం

తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్, నమస్తే తెలంగాణ స్టేట్ బ్యూరో కరెస్పాండెంట్ మహ్మద్ సలీముద్దీన్ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. సలీమ్ సొంత ఊరు నల్లగొండ జిల్లాలోని మునుగోడు. సలీమ్ సుదీర్ఘ కాలం జర్నలిజం లో పనిచేశారు. ఆంధ్ర ప్రభ, సూర్య దినపత్రికలలో పని చేసిన ఆయన ఆ తర్వాత నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అందులోనే పనిచేస్తున్నారు. సలీమ్ కు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. ఆస్తిపాస్తులు కూడా లేవు. 

సలీముద్దీన్

గత కొంత కాలంగా సలీం కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో బాధపడుతూ ఉన్నారు. గత శనివారం రాత్రి డ్యూటీలో ఉండగానే సలీమ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే సహచర జర్నలిస్ట్ లు నమస్తే తెలంగాణ ఆఫీస్ పక్కనే ఉన్న స్టార్ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ చేశారు. తర్వాత నయం కావడంతో డిచార్జి చేశారు. రెండు రోజుల తర్వాత సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో డాక్టర్ అప్పాయింట్మెంట్ తీసుకుని వెళ్లారు. కాలు ఇన్ఫెక్షన్ ప్రమాదకరంగా ఉందని డాక్టర్ చెప్పడంతో ఆయన అడ్మిట్ అయ్యారు.

ఆ సమయంలో తెలంగాణ సర్కారు ఇచ్చిన హెల్త్ కార్డ్ కింద ఈ జబ్బుకు వైద్యం చేయలేమని యశోద డాక్టర్లు చెప్పారు . అయితే నమస్తే తెలంగాణ యాజమాన్యం వారు ఇచ్చిన హెల్త్ కార్డ్ కింద ట్రీట్మెంట్ నడుస్తున్నది. కానీ అంతలోనే కాలుకు ఉన్న ఇన్ఫెక్టన్ శరీరంలోని మిగతా అవయవాలకు సోకింది. సలీంకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం ఆలస్యం జరిగిందని జర్నలిస్టులు చర్చించుకుంటున్నారు. ట్రీట్మెంట్ నడుస్తుండగానే సలీమ్ గురువారం రాత్రి మరణించారు.

జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ పని చేయదు అని తెలియగానే కొందరు జర్నలిస్టులు ఎల్ ఓసి కోసం ప్రయత్నాలు చేసారు. నమస్తే తెలంగాణ హెల్త్ కార్డ్ 2 లక్షల పరిమితి ఉందని చెబుతున్నారు.  అది రిలీజ్ అయిందని, దాని ద్వారానే ట్రీట్మెంట్ నడిచిందని చెబుతున్నారు. అయినా పరిస్థితి చేయి దాటి సలీమ్ చనిపోయారు. సలీం అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నాం 12 గంటలకు శివరాంపల్లిలో జరగనున్నాయి.

హెల్త్ కార్డు పనిచేయనందుకే సలీం మరణించారని పలువురు, సకాలంలో చికిత్స అంది ఉంటే సహచర జర్నలిస్టు మిత్రుడు బతికేవారని ఇంకొందరు జర్నలిస్ట్లు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సలీం మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపాయి. తెలుగు జర్నలిజం ఒక గొప్ప జర్నలిస్ట్ ను కోల్పోయింది అని పలువురు జర్నలిస్ట్ లు పేర్కొన్నారు. వివాదరహితుడు గా పేరు పొందిన సలీమ్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో ఆత్మీయంగా మాట్లాడే వాడు అని చెబుతున్నారు. ఆయన మృతిని జర్నలిస్టులు జీర్ణించుకోలేక పోతున్నారు.