మండలి వుంటుందా? ఊడు తుందా?లాభ నష్టాల బేరీజులో వైసిపి!

సోమవారం సాయంత్రం లోపు ఈ చర్చకు తెర పడనుంది. మండలి రద్దయితే ఒకటి రెండు సంవత్సరాలు టిడిపి నేతలకున్న పదవీ కాలం అంత కన్నా ముందుగానే ముగియ వచ్చు. కాని ఇందువలన ప్రతిష్టంభనలో పడిన రెండు బిల్లులు వెంటనే గండం గడచి గట్టెక్కుతాయనేందుకు ఆధారం కన్పించడం లేదు. ఆదివారం వైసిపి నేతలు మంత్రులు చేసిన ప్రకటనలు పైగా సోమవారం ఉదయం మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన మండలి రద్దుకే సిద్ధపడి నట్లు భావించ వలసి వుంది. ఒకవేళ తాము ఆశించినట్లు టిడిపి నుండి గోపీలు లభ్యమైతే మండలి రద్దు కాక పోవచ్చునేమో!

మరో వేపు ఆది వారం జరిగిన టిడిపి శాసనసభ పక్ష సమావేశానికి 23 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయిదు మంది సమావేశానికి రాలేనందుకు ముందుగా సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. మిగిలిన . ఇద్దరు సభ్యులు మొన్ననే గోడ దూకేశారు. మరో విశేషమేమంటే అదనంగా మరి కొంత మంది గోడ దూకుతారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. ఈ లెక్కలు పరిశీలించితే మొత్తం 32 మంది టిడిపి సభ్యులు లెక్క తేలి పోయింది. ఒక వేళ టిడిపి నుండి ముగ్గురు లేక నలుగురు పార్టీ ఫిరాయించినా ప్రస్తుతం శాసన మండలి నుండి సెలక్ట్ కమిటీకి పంపబడిన రెండు బిల్లులు విషయంలో పెద్దగా ఒనకూడేదేమీ వుండదేమో. మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి సభ్యుల పేర్లు ఇవ్వమని ఆయా పార్టీల నేతలకు లేఖలు రాశారని ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. తిరిగి ఇదంతా వట్టిదనే వార్తలు వెలువడ్డాయి. మండలి సమావేశం లాగా ఇది కూడా గందరగోళంగా వుంది. ఈ దశలో టిడిపి నుండి ఏవరైనా ఫిరాయించినా చైర్మన్ చేపట్టిన ప్రక్రియ వాస్తవమైతే ప్రభుత్వానికి పెద్దగా లాభించదు. కాకుంటే పెద్ద సంఖ్యలో టిడిపి సభ్యులు పార్టీ ఫిరాయించితే అప్పుడు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి దించే అవకాశం ఉంది..

ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి ప్రకటన పరిశీలించితే అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఆగామని మండలి రద్దయితే తమ పార్టీ కొచ్చే నష్టమేమీ లేదని చెప్పడం గమనార్హం. వాస్తవంలో 2021 మార్చి నాటికి ప్రస్తుత చైర్మన్ తో సహా 15 మంది 2023 మార్చి నాటికి లోకేష్ తో సహా 12 మంది 2025 నాటికి ఎనమల రామ కృష్ణడుతో సహా ముగ్గురు టిడిపి సభ్యులు మండలి నుండి వైదొలుగు తారు. ఒక్క సంవత్సరానికే 15 మంది వైదొలిగితే అందరూ వైసిపి వారే ఎన్నికయ్యే అవకాశం ఉంది. 2024 సాధారణ ఎన్నికల నాటికి ఇప్పుడున్న వారికే కాకుండా కొత్తగా వచ్చే నేతలను కలుపుకొని మండలిలో సభ్యత్వం ఇవ్వ వచ్చు. అంతేకాదు 2024 ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేని వారికి మండలి ఆశ చూపించ వచ్చు.మండలి లేక పోతే అసంతృప్తి నేతలను అదుపు చేయడం కష్టం.

ఇవన్నీ అటుంచి మండలి రద్దు అయితే టిడిపి నేతల పదవుల ఉద్వాసన అటుంచి స్థానిక సంస్థలకు పట్ట భద్రులకు ప్రధానంగా ఉపాధ్యాయులకు ఇంతవరకు వున్న ప్రాతినిధ్యం పోతుంది. ఈ అంశంలో ఉపాధ్యాయులు ప్రభుత్వ యెడల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. మండలికి ఉపాధ్యాయ నియోజకవర్గాల నుండి ఎన్నికైన వారు టీచర్ల సమస్యల పరిష్కారంలో గణనీయమైన కృషి చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ద్వారా టీచర్లు తమ వృత్తి జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ఇవన్నీ బేరీజు వేసుకొనేందుకే సజ్జల రామ కృష్ణ రెడ్డి చెప్పినట్లు ఈ నాలుగు రోజులు ఆగారేమో. .

అయితే వీటన్నింటి కన్నా ముఖ్యమంత్రి కలల మూడు రాజధానులకు చెందిన చట్టాలు బయట పడటం అతి ముఖ్యం. ఈ చట్టాలు బయట పడేందుకు ఇప్పుడు మండలిని రద్దు చేస్తే అనుకూలిస్తుందనేదానికి ప్రాతిపదిక కనిపించడం లేదు. అయితే సోమవారం మంత్రి వర్గ సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్లు? మండలి రద్దు వలన తమకు నష్టం లేదని సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి చేసిన ప్రకటనలో నష్టం అటుంచి వెంటనే కలిగే లాభం కూడా కన్పించడం లేదు. ఇప్పుడు మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసినా టిడిపి సభ్యులు ఫిరాయింపులకు లొంగక పోతే ఎట్లలేదన్నా కనీసం ఒక సంవత్సరం మండలిలో ఇబ్బందులు పడవలసినదే. కాకుంటే టిడిపి సభ్యులకు పదవులు లేకుండా చేయ వచ్చు. అది కూడా వెంటనే జరిగే స్థితి లేదు. అప్పటికి 15 మంది సభ్యత్వం ఆటోమాటిక్ గా రద్దు అవుతుంది. ప్రస్తుతం వారిని భయ పెట్టడానికి మాత్రమే పనికొస్తుంది. సోమవారం శాసనసభలో మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసినా సెలక్ట్ కమిటీ ప్రాసెస్ ఆగేది లేదు. భవిష్యత్తు పరిణామాలు పక్కన బెడితే ఒక వేళ సోమవారం శాసనసభలో మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసితే ఏం ప్రయోజనం ఆశించి ముఖ్యమంత్రి ఈ చర్యకు దిగారో భవిష్యత్తులో తేలవలసి వుంది.