Kadapa Shock : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంయమనం కోల్పోతున్నారు. గొప్పగా మాట్లాడేస్తున్నాననుకుంటూ తప్పులో కాలేస్తున్నారు. మొన్నీమధ్యనే చీప్ లిక్కర్‌ని తాము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే అందిస్తామంటూ ప్రకటించి ‘సారాయి వీర్రాజు’ అనే విమర్శల్ని ఎదుర్కొన్నారాయన.
తాజాగా, కత్తులతో నరుక్కునే కడప జిల్లావారికి ఎయిర్ పోర్ట్ అవసరమా.? అంటూ సంచలన రీతిలో ప్రశ్నాస్త్రాలు సంధించేశారు సోము వీర్రాజు. ఇంకేముంది.? కడప జిల్లా వాసులకు ఒళ్ళు మండిపోయింది. సోము వీర్రాజుకి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు కడప జిల్లా ప్రజానీకం. ‘సోము వీర్రాజు తక్షణం క్షమాపణ చెప్పాలనీ, కడప జిల్లా వాసుల్ని ఉద్దేశించి కత్తులతో నరుక్కునేటోళ్ళు.. అనడమేంటి.?’ అంటూ ఆవేశంతో కడప జిల్లా ప్రజానీకం ఊగిపోతున్నారు.
కడప జిల్లాకి చెందిన వైసీపీ నేతలు, సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోము వీర్రాజు బేషరతుగా కడప జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలనీ, వెంటనే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండడం గమనార్హం.
జిల్లాకో ఎయిర్ పోర్టు అనేది టీడీపీ – బీజేపీ కలిసి వున్నప్పుడు తీసుకున్న సంయుక్త నిర్ణయమే. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లాకి ఓ ఎయిర్ పోర్టు.. అని నినదించినప్పుడు, చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి.
సరే, జిల్లాకి ఓ ఎయిర్ పోర్టు అనేది సాధ్యమా.? కాదా.? వాటి వల్ల ఉపయోగమేంటి.. అన్నది వేరే చర్చ. కడప జిల్లా ప్రజల్నే కాదు, ఏ జిల్లా ప్రజల విషయంలో అయినా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం నాయకులకు తగదు. రాయలసీమలో ఫ్యాక్షనిజం వుంటే వుండొచ్చు.. అంతమాత్రాన అంతా అలాంటివాళ్ళేనంటే ఎలా.?