3 Capitals : బిగ్ క్వశ్చన్: ఎలా.? మూడు రాజధానులు తెచ్చేదెలా.?

3 Capitals : న్యాయవ్యవస్థకున్న పరిధి, అధికారాల గురించి అసెంబ్లీ సాక్షిగా చర్చించాల్సిన పని వుందా.? లేదా.? అన్న చర్చను పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు స్పష్టతనిచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులు చేసి తీరతామంటున్నారు. తమ ప్రభుత్వ విధానం రాష్ట్ర సమగ్రాభివృద్ధి అనీ, అందుకోసమే మూడు రాజధానులు అనీ వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు.

ఎప్పుడైతే రాష్ట్ర అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టాన్ని వైఎస్ జగన్ సర్కారు ఉపసంహరించుకుందో, దాంతో ఇకపై మూడు రాజధానులపై చర్చ కూడా వుండదని చాలామంది భావించారు. కోర్టుల్లో వైసీపీ సర్కారుకి ఎడా పెడా మొట్టికాయల నేపథ్యంలో, కోర్టుల పరిధిపై ఏవేవో మాట్లాడేసి, మూడు రాజధానులపై ‘మమ’ అనిపించేస్తారని అంతా అనుకున్నారుగానీ, సభలో కాస్త సుదీర్ఘంగానే సభ్యులు మాట్లాడారు.

దేవుడి దయతోనో, ప్రజల ఆశీస్సులతోనో అనుకున్నది సాధిస్తామంటూ పదే పదే వైఎస్ జగన్ చెబుతుంటారు. మరెందుకు మూడేళ్ళుగా వైఎస్ జగన్ సర్కారు కొన్ని పనుల్ని అనుకుని కూడా చేయలేకపోతోంది.? మిగతా విషయాల సంగతి తర్వాత, మూడు రాజధానులపై ఎలా ముందడుగు వేస్తారు.?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో కనిపించిన పెద్ద మార్పు ఏంటంటే, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అండగా వుంటామని చెప్పడం. ఈ మాటేదో గతంలోనే వైఎస్ జగన్ చెప్పి వుంటే, పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేదే కాదు. రాజధానిలో నెలల తరబడి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వారిని పిలిపించుకుని, మాట్లాడి సమస్యకు పరిష్కారం వెతికి వుంటే, మూడు రాజధానుల అంశం ఇంత రచ్చగా మారి వుండేదే కాదు.!
కేవలం అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్ని ఒప్పించడం ద్వారా మాత్రమే జగన్ సర్కారు మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయగలగుతుంది. ఈ దిశగా ముందడుగు పడటం అభినందనీయమే.