ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అందులో ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం హైలైట్. అందులోనూ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. అందుకోసం అందరు తహసీల్దార్ లకు జాయింట్ రిజిస్ట్రార్ హోదా కల్పించారు. అయిదు సంవత్సరాల తర్వాత అమ్ముకొనే వీలు కల్పించారు. ఇదంతా ఎంతో అద్భుతంగా వుంది.
కాని ఇందుకోసం మొత్తం 43 141 ఎకరాలను ప్రభుత్వ సేకరిస్తోంది. ఇందులో ప్రభుత్వ భూమి పోగా 16 వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుండి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కలు కూడా నిర్దిష్టంగా లేవు. దాదాపు 26 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా చెబుతున్నారు. ఇందులోనే తిరకాసు ఇమిడి వుంది. జిల్లాలో ఇంత భారీ ఎత్తున భూమి సేకరణ అంత సులభం కాదు. పైగా గ్రామాలకు దగ్గరలో వుండాలి. అందుకోసం పలు జిల్లాల్లో అధికారులు టార్గెట్ పూర్తి చేసేందుకు ఈపాటికే నిరుపేదలు సాగు చేస్తున్న భూముల స్వాధీనానికి తలపడ్డారు. ఇందులో రెండు మూడు రకాలున్నాయి.
ఈ పాటికే పేదలకు డికెటి పట్టాలు ఇచ్చిన భూములు వున్నాయి. పట్టాలున్నా కొంత కాలం సాగు చేసి పడావుగా వున్న భూములు వున్నాయి. పట్టాలు లేకుండా సాగు చేస్తున్న భూములు వున్నాయి.
మరో విశేషమేమంటే పట్టాలు లేక గాని పట్టాలు వుండి గాని ప్రస్తుతం పొలంలో పంట వున్న భూములు వున్నాయి. కొన్ని జిల్లాల్లో అధికారులు అత్యుత్సాహంతో అన్ని రకాల భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. తుదకు పొలంలో పంట వున్నా నిర్దాక్షిణ్యంగా పొలం చదును చేస్తున్నారు. చాలా జిల్లాల్లో పైగా స్థానిక రాజకీయాలతో జరిగిన ఉదంతాలు ప్రభుత్వానికి మంచి పేరు కన్నా చెడ్డ పేరు తెచ్చి పెడుతోంది.
ఈ అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి వెళుతున్నవో లేదో రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ గ్రామాల్లో గగ్గోలు మొదలైంది. మరో విశేషమేమంటే ఈలాంటి వార్తలు ఒక రకమైన మీడియాలో రావడంతో అధికారుల పని ఇంకా సులువు అయింది. మంత్రులు ఎమ్మెల్యేలు ఇదంతా ఎల్లో మీడియా సృష్టి అని చెబుతున్నారు. ఫలితంగా ప్రభుత్వం వేపు నుండి ఏం జరుగుతుందో తెలుసుకొనే ప్రయత్నాలు జరగడం లేదు. అందువలన అధికారులు కూడా తమ తమ టార్గెట్ లు పూర్తి చేసేందుకు మరింత దూకుడు పెంచుతున్నారు. ఫలితంగా నిరుపేదలకు జరిగే అన్యాయం నిలువరింప బడటంలేదు. మరో వేపు ప్రభుత్వ వ్యతిరేకత ఆంజనేయుని వాలంలా పెరుగుతోంది. పది మంది కోసం ఇద్దరు ముగ్గురు బలి అవుతున్నారు.
ఈ ఇళ్ల పట్టాల స్థలం ఎంపిక పలు ప్రాంతాల్లో చిత్రంగా వుంది. గ్రామాలకు దూరంగా కొండలు గుట్టలు చదును చేసి ప్లాట్లు వేస్తున్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు ఉపయోగ పడుతున్న చిన్న చిన్న చెరువులు గుంటలు కూడా చదును చేస్తున్నారు.ఇవన్నీ గ్రామాలకు దూరంగా వున్నాయంటున్నారు
కొన్ని ప్రాంతాల్లో పట్టాలు తీసుకున్నా ఎక్కువ మంది ఇళ్లు కట్టుకొనే పరిస్థితి లేదు. ఈలాంటి చోట కాలనీలు ఏర్పాటు చేస్తామంటున్నారు. కాలనీ అంటే అన్ని మౌలిక సదుపాయాలు వుంటేనే ఎవరైనా ముందుకు వస్తారు. అంతెందుకు? ప్రైవేటు వ్యక్తులు వేసే వెంచర్లు కూడా సంవత్సరాల తరబడి ఖాళీగా వుంటాయి. ఎందుకంటే అందరూ ఒక సారిగా ఇళ్ల నిర్మాణం చేపట్టరు. మరీ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలకు దూరంగా వుండే స్థలాలు ఇస్తే వెంటనే ఉపయోగంలోనికి రావడం కష్టం. రాష్ట్రంలో జరుగుతున్న తంతు చూస్తే ఎక్కువ ప్రాంతాల్లో కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో పీక్కొన్నట్లు తయారయ్యే ప్రమాదం పొంచి వుంది. భూసేరణలో నిరుపేదలకు అన్యాయం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇది మున్ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుది బండగా మిగులుతుందేమో.
ఇదిలా వుండగా రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల మంజూరు జఠిలంగా మారింది. న్యాయ పరమైన చిక్కులు వస్తున్నాయి. ఎందుకో గాని ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయాన్ని న్యాయ స్థానాలు తప్పుపడుతున్నాయి. ఈ పరిస్థితి ఏ ప్రభుత్వానికి మంచిది కాదు.