ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు బిజెపి వ్యూహానికి పదును పెడుతోంది. కేంద్రం సహయంతో పథకాలను టిడిపి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నదని బిజెపి అనుమనిస్తుంది. అందుకోసమే కేంద్రమంత్రుల రంగంలోకి దిగారు. కేంద్రం నిధులతో అమలవుతున్న పథకాలను బలంగా జనంలోకి తీసుకుపోతున్నారు. అలా అయితే పథకాలపై బిజెపి ముద్ర ఉంటుందని బిజెపి నేతల ప్లాన్ గా తెలుస్తోంది. దీనిని తిప్పికొట్టెందుకు టిడిపి కూడా కౌంటర్ సిద్దం చేసినట్టు తెలుస్తున్నది.
పోలవరానికి వేల కోట్ల రూపాయల నిధులు అందిస్తున్నా అది రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందన్న భావన ప్రజల్లో ఉందని బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు కేవలం ప్రతి సోమవారం సమీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారని, ఆ సమీక్షలతో ఆయనే ప్రాజెక్టు నిర్మిస్తున్నారనే విధంగా టిడిపి ప్రచారం చేసుకుంటుందని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో అనేక విద్యాసంస్థలు, సెంట్రల్ యూనివర్సిటి, యన్ఐటి, ఐఐటి,ఐఐఎం, వంటి అనేక సంస్థలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ క్రెడిట్ బిజెపికి దక్కలేదని నేతలు మదనపడుతున్నారు. ఎన్డీఏ నుంచి బిజెపి బయటికి వచ్చిన తర్వాత ఏపీ బిజెపి అధ్యక్ష బాధ్యతలు కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన బిజెపి కీలక నేతల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వద్దకు సంబంధిత మంత్రులు వెళ్లి పరిశీలించాలని నిర్ణయించారు. తద్వారా ప్రజల్లో అది కేంద్రం చేపడుతున్న పథకంగా గుర్తింపు పొందవచ్చని నిర్ణయించారు.
బిజెపి నిర్ణయించిన ఈ కీలక నిర్ణయంలో భాగంగానే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పది నెలల తర్వాత పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఈ కార్యక్రమానికి వెళ్లాలా వద్దా అని టిడిపి తర్జనభర్జనలు పడినా చివరకు చంద్రబాబు, మంత్రులు వెళ్లారు. రెండో డిపిఆర్ ను ఆమోదించాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసాల కోసం 33వేల కోట్ల రూపాయలు అవసరమని ఆ మొత్తాన్ని కేంద్రమే భరించాలని చంద్రబాబు గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న కేంద్రవైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపీ నడ్డా మంగళగిరి రానున్నారు. మంగళగిరిలో నిర్మిస్తున్న ఎయిమ్స్ హస్పిటల్ నిర్మాణ పనులను సమీక్షించనున్నారు. అలాగే విభజన సమయంలో ఎయిమ్స్ ని నిర్మిస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని ప్రజలకు తెలిసేలా బిజెపి ప్రచారం చేయనుంది.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వివిధ కేంద్ర విద్యా సంస్థల్లో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. వీటి నిర్మాణానికి కేంద్రం కేటాయిస్తున్న నిధులపై ప్రజలకు వివరించేందుకు ఈ నెల చివర్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ రానున్నారు.
కేంద్రమంత్రులు వరుసగా రాష్ట్రానికి వస్తుండటంతో టిడిపి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిమ్స్, విద్యాసంస్థలకు వందల ఎకరాల భూములు ఇచ్చామని వాటికి నీటి సౌకర్యం, మౌళిక వసతులు కల్పించామని ప్రచారం చేయాలని టిడిపి భావిస్తుంది. కేంద్రమంత్రులు అధికారిక పర్యటనలకు వస్తుండటంతో రాష్ట్ర మంత్రులను కూడా పంపాలని టిడిపి నిర్ణయించింది. రాష్ట్రంలో బిజెపి ఆటలు సాగనివ్వమని, ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలన్ని నెరవేర్చే వరకు బిజెపి ఎన్ని ఎత్తుగడలు వేసినా అవి వృథానేనని టిడిపి నేతలు అంటున్నారు.