ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నానికి వైఎస్ జగన్ ఢిల్లీ చేరుకుని మొదట కేంద్ర జలవనరుల శాఖా మంత్రిని, తర్వాత గనుల శాఖా మంత్రిని కలిసి రాత్రి 10 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాలి. కానీ పర్యటన రద్దయింది. కారణం అమిత్ షా బిజీగా ఉండటం. గుజరాత్, మహారాష్ట్రలలో నిసర్గ తుఫాన్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో అమిత్ షా తలమునకలై ఉండటంతో కలిసే వీలు లేక సమావేశం రద్దు చేశారని తెలుస్తోంది. పనులన్నీ పూర్తయ్యాక అపాయింట్మెంట్ ఇస్తామన్నారట.
దాదాపు రెండున్న నెలల తర్వాత వైఎస్ జగన్ వెళ్లాలనుకున్న కీలక పర్యటన కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ టూర్లో సీఎం విభజన హామీలు, పోలవరం, గోదావరిపై తెలంగాణ సర్కార్ కడుతున్న ప్రాజెక్టులు, లాక్ డౌన్ సహాయ నిధులు, శాసన మండలి రద్దు, రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులు వంటి కీలక విషయాలను జగన్ అమిత్ షా ముందు ఉంచుతారని ప్రచారం జరిగింది. కానీ ఇంతలో షా తాను బిజీ అంటూ అపాయింట్మెంట్ రద్దు చేయడం అధికార పార్టీ సైతం నిరుత్సాహనికి గురిచేసింది.
రోజూ ఎంతో మందిని కలిసే అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రిని కలవడానికి సమయం లేదని అనడం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. పైగా జగన్ పలు బిల్లుల విషయంలో భాజాపాకు మద్దతిచ్చారు. అయినా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, పైగా ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో రెండు గంటల్లో బయలుదేరుతారనగా క్యాన్సిల్ చేయడం వైసీపీకి ఇబ్బంది కలిగించాయి. అందుకే ఈసారి పక్కాగా అపాయింట్మెంట్ నిర్ణయించబడిన తర్వాతే ఢిల్లీ టూర్ వివరాలను బయటపెడితే మంచిదని సొంత పార్టీ వారే ఆభిప్రాయపడుతున్నారు.