(ఎల్ వెంకట్రావ్* )
రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి. హత్యలు ఉండవనేది ఒక నానుడి. దీనికి అర్థం ఏమిటంటే రాజకీయ నాయకులు తమ రాజకీయ జీవితాన్ని వారే తమ చేజేతులా పాడు చేసుకుంటారు. అంతేకాని, వారి పొలిటికల్ ప్యూచర్‌ను ఎవరూ పాడు చేయలేరు. ఇప్పుడు ఈ నానుడి ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కరెక్ట్‌గా సరిపోతుంది.రాజకీయాల్లో తప్పటడుగులు నాయకులకు భవిష్యత్తే లేకుండా చేస్తాయి. వాటి పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు తప్పటడుగులు వేయడం వల్ల వచ్చే పర్యవసానాలను స్వయంగా అనుభవిస్తున్నారు.
ఇల్లు ఉండగానే…దీపం చక్క పెట్టుకోవాలనే సామెతను బాగా వంట పట్టించుకున్న కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ ప్రజల బాగోగులను పట్టించుకోకుండా తమ స్వప్రయోజనాలను చూసుకుంటున్నారు. అధికార దాహంతో తాము చెప్పిందే వేదం అన్నట్లు నియోజకవర్గాల్లో వ్యవహారిస్తూ ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు. అధికార పార్టీలో ఉన్నందున ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరించడానికి ఎక్కువ వీలు ఉంటుంది. కానీ చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ నాలుగేళ్లు ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. దీనితో సదరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేక ఏర్పడినట్లు తెలుస్తోంది. వీళ్లంతా అధికారాన్ని సొమ్ముచేసుకునే పని లో పడిపోయారని, ఇలాంటి వారి వల్లే రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ అని పేరు వచ్చిందని ముఖ్యమంత్రి అనుమానిస్తున్నారని తెలిసింది.
దాదాపు 40 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు అనుమానితుల జాబితాలో ఉన్నారని చెబుతున్నారు. వాళ్ల నియోజకవర్గ ప్రజల్లో చంద్రబాబు చేయిస్తున్న సర్వేల్లో వీళ్ల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైనట్లు తెలిసింది. ఈ 40 మంది నియోజకవర్గాల్లో చంద్రబాబు పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో వారికి సీటు లేనట్లే..
సర్వేల్లో దిట్టైన చంద్రబాబు..ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ మార్కులు ఇస్తూ ఉంటారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను హెచ్చరించి మెరుగుపరచుకోవాలి సూచిస్తుంటారు. ఇప్పటికే అనేక సార్లు టీడీపీ ఎమ్మెల్యేలను హెచ్చరించిన చంద్రబాబు, పనితీరును మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు మాటలను చెవికి ఎక్కించుకుని ఆ 40 మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చురాలేదని దీంతో వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు ఇప్పటికే చెప్పినట్లు పార్టీలు వర్గాలు గుసగుసపోతున్నాయి.
కాగా,ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఈ 40 మంది ఎమ్మెల్యేల స్ధానాల్లో ప్రత్యామ్నాయంగా కొత్త వారి కోసం చంద్రబాబు వెతుకులాట చెపట్టినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.సమర్థవంతమైన అంగ బలం,ఆర్థిక బలం ఉన్న అభ్యర్థుల కోసం టీడీపీ హైకమాండ్ చర్యలు మొదలు పెట్టిందంటున్నారు టీడీపీ శ్రేణులు దీంతో . టికెట్ దక్కదని తెలుసుకున్న సదరు 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు.చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది?
(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయలు రచయిత వ్యక్తిగతం)