ప్రచార బయోపిక్ (‘యాత్ర’ రివ్యూ)

―సికిందర్

Rating: 3 / 5
***

బయోపిక్ ల సీజన్ లో మరో బయోపిక్ స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్మరించుకుంటూ వచ్చింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటీవలే పాద యాత్ర ముగించుకున్న నేపధ్యంలో, ఆనాడు వైఎస్ జరిపిన చారిత్రిక పాద యాత్ర ఆధారంగా ‘యాత్ర’ విడుదలైంది. తెలంగాణాలో దీనికిప్పుడు రాజకీయ ప్రాముఖ్యం లేకున్నా, ఏపీలో ఎన్నికల ప్రచార బయోపిక్ గా ప్రయోగించినట్టు అర్ధమవుతుంది.

వైఎస్ ది ప్రజలు మర్చిపోయిన చరిత్ర కాదు, జగన్మోహన్ రెడ్డి వల్ల మనుగడలో వున్న చరిత్ర. గత పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య వివిధ యాత్రలు చేస్తూ వార్తల్లో వున్నారు. ఇప్పుడీ ఎన్నికల కీలక సమయంలో చివరి ఘట్టంగా బయోపిక్ రూపంలో వైఎస్ ని మళ్ళీ ప్రజల మధ్య ప్రతిష్టించే వ్యూహంతో వచ్చిన ఈ ‘యాత్ర’ అసలెలా వుంది… ఎక్కడనుంచి మొదలుపెట్టి ఎక్కడివరకూ ఈ బయోపిక్ వుంది…ఇందులో వస్తావాలెలా వున్నాయి…ఇవి తెలుసుకుందాం.

కథ

ఒక శాసనసభ ఉప ఎన్నికలో హైకమాండ్ నిర్ణయించిన అభ్యర్ధికి వ్యతిరేకంగా సుచరిత (అనసూయ) అనే అభ్యర్ధిని వైఎస్ (మమ్ముట్టి) ప్రకటించడంతో మొదలవుతుంది. హైకమాండ్ దూత తివారీ హైకమాండ్ కి వ్యతిరేకంగా వెళ్ళవద్దని సూచించినా, అభ్యర్ధికి మాట ఇచ్చాక ముందుకే వెళ్తానని అంటాడు. తనతో ఎప్పుడూ వుండే కెవిపి రామచంద్రరావు (రావు రమేష్) కి కూడా సున్నితంగా చెప్తాడు. హైకమాండ్ ప్రకటించిన వేరే అభ్యర్ధి నామినేషన్ వేసే సమయానికి రాకుండా కూడా వైఎస్ మేనేజ్ చేస్తాడు.

ఇలావుండగా రాష్ట్రంలో అధికారంలో వున్న మనదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకి వెళ్తాడు. దీంతో పార్టీ బలం, అర్దిక బలం లేని ప్రతిపక్ష నాయకుడుగా వైఎస్ సందిగ్ధంలో పడతాడు. అంతర్మథనంతో ఒక నిర్ణయానికొస్తాడు పాదయాత్రతో ప్రజల మధ్యకి వెళ్లాలనీ. దీనికి ప్రజలనుంచి భారీ స్పందన రావడంతో చేవెళ్ళ నుంచి రాష్ట్ర వ్యాప్త పాద యాత్ర ప్రారంభిస్తాడు. ఈ పాదయాత్రలో ప్రజల వివిధ కష్టాలు తెలుసుకుంటూ, హామీలిస్తూ, ఎలా పార్టీని అధికారంలోకి తెచ్చి తను ముఖ్యమంత్రి అయ్యాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ బయోపిక్ ని డాక్యుమెంటరీలా తీశారు. ముందస్తు ఎన్నికల ప్రకటన వల్ల వైఎస్ పాదయాత్రతో గోల్ అనే ఒక కథా లక్షణమేర్పడినప్పటికీ, ఈ గోల్ కి ఓ ప్రత్యర్థీ, ప్రతిఘటనా అనే మిగతా కథా లక్షణాలు లేకపోవడంతో, ఏక పక్ష గోల్ గా – పాదయాత్రలో వివిధ పిసోడ్లని కలుపుకుంటూ డాక్యుమెంటరీ మాత్రంగా రూపొందించారు.

ఇందులో ఎమోషనల్ డ్రామా కోసం రైతుల ఆత్మహత్యలు, కొడుకు ఇంజనీరింగ్ చదువుకి డబ్బుల్లేక పోలీసు పాల్పడే అవినీతి, బాలిక గుండె ఆపరేషన్ కోసం తల్లి పడే కష్టాలూ లాంటివి సృష్టించారు. రైతులకి ఉచిత కరెంట్, విద్యార్ధులకి ఫీజుల రీ ఎంబర్స్ మెంట్, రోగులకి ఆరోగ్యశ్రీ మొదలైన సంక్షేమ పథకాలకి – పాద యాత్రలో వైఎస్ చూసిన ఈ సంఘటనలే స్ఫూర్తి అన్నట్టుగా చిత్రించారు.

ఎవరెలా చేశారు

ఇది వైఎస్ ని సజీవ దృశ్యమానం చేసే కళాఖండం కాదు. ప్రచార బయోపిక్ ప్రయోజనం నెరవేరిస్తే చాలు. అందుకని ఇందులో ఎవరెంత పాత్రలకి సరిపోయారు, ఎవరెలానటించారూ అన్న ప్రశ్నేరాదు. పర్పస్ వైఎస్ మార్గాన్ని జనంలోకి తీసికెళ్ళడం, మమ్ముట్టిని వైఎస్ గా నిలబెట్టడం కాదు. ఆయనకి జాతీయ అవార్డులు రావడమూ కాదు. కాబట్టి మమ్ముట్టి వైఎస్ అనే ఓ టెంప్లెట్ ని భౌతికంగా భర్తీ చేశాడంతే. సాధ్యమైనంతవరకూ వైఎస్ ని అనుకరించాడు. డైలాగుల బలం (మన గడప తొక్కి సాయమడిగిన ఆడబిడ్డతో రాజకీయమేందిరా) వుండడం నటనకి ప్లస్ అయింది.

వైఎస్ ‘ఆత్మ’ కెవిపి పాత్రలో రావురమేష్ చేసేదేమీ వుండదు. కెవిపి పాత్రనే కాదు, మరికొన్ని ముఖ్య పాత్రల్నీ సూరీడు సహా నామమాత్రం చేశారు వైఎస్ ని హీరో చేసే ప్రయత్నంలో. వైఎస్ తండ్రి రాజారెడ్డిగా జగపతిబాబు, చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని, వి. హనుమంత రావుగా తోటపల్లి మధు కన్పిస్తారు. మనదేశం పార్టీ లీడర్లుగా పృథ్వీ, జీవా కన్పిస్తారు.

సాంకేతికంగా మంచి విలువలతోనే వుంది. సిరివెన్నెల నేపథ్య గీతాలతో డ్రామాని ఎలివేట్ చేశారు. దర్శకుడు మహి రాఘవ్ గతంలో పాఠశాల, ఆనందో బ్రహ్మ అనే రెండు సినిమాలు తీశాడు. దీన్నీ నీటుగా తీశాడు.

చివరికేమిటి

ప్రతీ చోటా వైఎస్ హైకమాండ్ కి వ్యతిరేకమన్నట్టు, డామినేటింగ్ పర్సనాలిటీ అన్నట్టూ, విధిలేక హైకమాండ్ అణిగిమణిగి పడి వున్నట్టూ అవాస్తవిక చిత్రణ చేస్తారు. ఆ పార్టీ ఇప్పుడు సాఫ్ట్ టార్గెట్ అనేమో, డమ్మీని చేసివదిలారు. అప్పటి ఎన్నికల ప్రచారంలో గులాం నబీ ఆజాద్ పోషించిన పాత్రని ఎవరూ మర్చిపోలేరు. ఆయన్ని కూడా నెగెటివ్ గా చూపించారు. కానీ వైఎస్ పార్టీకీ, సోనియా గాంధీకీఎంత విధేయుడో తెలిసిందే. ఇక ‘మనదేశం’ పార్టీ జోలికి పోలేదు. కాకపోతే ఇటీవలి చంద్రబాబు పాపులర్ ‘బ్రీఫుడు’ ఫోన్ కాల్ ని 2004 నాటి దృశ్యాల ఈ బయోపిక్ లో పెట్టేశారు.

ఈ బయోపిక్ ని వైఎస్ ఆశయాలని మరోసారి ప్రజల్లోకి తీసికెళ్ళేందుకు వివాదరహితంగా, శాంతియుతంగా తీశారు. కాకపోతే స్లోగా నడుస్తాయి దృశ్యాలు.

—-
న‌టీన‌టులు: మ‌మ్ముట్టి, అశ్రిత‌, జ‌గ‌ప‌తిబాబు, సుహాసిని, రావు ర‌మేష్‌, అన‌సూయ‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు

ఛాయాగ్ర‌హ‌ణం: స‌త్య‌న్ సూర్య‌న్‌

సంగీతం: కె

కూర్పు: శ్రీక‌ర్‌ ప్ర‌సాద్

పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి

స‌మ‌ర్ప‌ణ‌: శివ మేక‌

నిర్మాణం: శ‌శిదేవిరెడ్డి, విజ‌య్ చిల్లా

ద‌ర్శ‌క‌త్వం: మ‌హి వి.రాఘ‌వ్

విడుద‌ల‌: 8 ఫిబ్ర‌వ‌రి 2019

సంస్థ‌: 70 ఎమ్‌.ఎమ్‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌