కరోనాకి కళ్లెం వేయడంపై అసలేమీ క్లారిటీ లేదు. మరోవైపు కరోనాతో సహజీవనం చేస్తూనే ఇతర పనులన్నీ సాగించాలని జనాల్ని అలెర్ట్ చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. “ఉన్నవాళ్లే ఉంటారు.. పోయే వాళ్లు పోతుంటారు!“ అన్న ఫార్ములానే అనుసరించి ఇక లాక్ డౌన్ లు ఎత్తేసే సీనే కనిపిస్తోంది. ఆ క్రమంలోనే సినిమా వాళ్లకు ఓ వైపు బెంగ తగ్గకపోయినా కానీ.. ఇప్పటికే చిత్రీకరణలు పూర్తయిన సినిమాల రిలీజ్ ల విషయమై ఆశావహంగానే కనిపిస్తున్నారు. ప్రభుత్వాలు లాక్ డౌన్ లు ఎత్తేస్తే తమ సినిమాల్ని థియేటర్లలో రిలీజ్ చేసుకుని రాబట్టుకోవాల్సినది రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
గత రెండు నెలలుగా రిలీజ్ లన్నీ వాయిదా పడడంతో ఇప్పుడు వాటికి లైన్ క్లియర్ చేయాలని ప్లాన్ ని డిజైన్ చేశారట. అందుకు మూడు దశలు ప్లాన్ చేశారట. జూన్ నుండి షూటింగులను ప్రభుత్వం అనుమతిస్తుందని.. అటుపై జూలై నుండి సినిమా థియేటర్లు ఓపెనవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉండేలా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే యథావిధిగా సినిమా విడుదలలు ప్లాన్ చేయనున్నారట. వివిధ దశల్లో రిలీజ్ ప్లాన్ చేశారట. జూలైలో తొలుత తక్కువ బడ్జెట్ చిత్రాలైన ఓరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రీమించడమెలా? వీటితో పాటే మరికొన్ని చిన్న సినిమాలు విడుదల చేస్తారు. ఈ సినిమాలు ప్రేక్షకుల మానసిక స్థితిని పరీక్షిస్తాయి. జనం థియేటర్లకు వస్తారా రారా? అన్నది వాటితో అర్థమవుతుంది.
అటుపై ఆగస్టులో కాస్త క్రేజ్ ఉన్నవి… అంటే నానీ-సుధీర్ ల `వీ`.. రామ్ – రెడ్ వంటి మీడియం-బడ్జెట్ చిత్రాలను విడుదల చేయడానికి అనుమతిస్తారు. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించడానికి కృష్ణాష్టమి, స్వాతంత్య్ర దినోత్సవం వంటి తేదీలను ఎంపిక చేసుకుంటారట. ఈ రెండు దశలు చిత్రనిర్మాతలకు విశ్వాసం పెంచితే.. మూడవ దశ ఆగస్టు చివరి నుండి దసరా వరకు కొనసాగుతుంది. ఈ దశలో `వకీల్ సాబ్` వంటి పెద్ద చిత్రాలు బయటికి వస్తాయి. మూడవ దశ నాటికి పూర్తిగా కరోనా తగ్గిపోతుందనే నిర్మాతలు నమ్ముతున్నారట. సోలో బ్రతుకే సోబెటర్, క్రాక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లవ్ స్టోరీ వంటి చిత్రాలు ప్రజల స్పందన ఆధారంగా రెండవ దశలో లేదా మూడవ దశలో విడుదల కావచ్చని చెబుతున్నారు. మొత్తానికి కరోనాతో సహజీవనం చేస్తూనే థియేటర్లకు జనం వస్తారన్న నమ్మకం వ్యక్తమవుతోంది. ఇది గుడ్డి నమ్మకం కాకపోతే మంచిదే!