కేవీ రెడ్డి ఋణం తీర్చుకున్న ఎన్ .టి రామారావు

ఇది 1971 నాటి మాట. ఒకరోజు ఉదయం మద్రాసులోని తన ఇంటి మేడ మీద వున్నారు తెలుగువారి అభిమాన కథానాయకుడు ఎన్.టి  రామారావు. అప్పుడు ఇంట్లో పనిచేసే కుర్రవాడు పైకి వచ్చి “అయ్యా ” అని పిలిచాడు. రామారావు ఏమిటన్నట్టు చూశాడు.

“అయ్యా తమరికోసం కె.వి రెడ్డి  సార్  అంట  వచ్చారు ” అన్నాడు. ఆ మాట వినగానే రామా రావు ఉలిక్కి పడ్డాడు. వాడివైపు చూసి “నీ మొఖం… కేవీ రెడ్డి సర్ మన ఇంకేటికి రావడం ఏమిటిరా… ఇంకా ఎవరో అయి వుంటారు. వెళ్లి పేరు అడిగి రా ” అన్నాడు.

వాడు మళ్ళీ కిందికి వెళ్ళీ వెంటనే పైకి రొప్పుతూ వచ్చాడు.”అయ్యా వారు డైరెక్టర్ కేవీ రెడ్డి సార్  అంట” అన్నాడు. రామారావు కుర్చీలో కూర్చున్నవాడు టక్కున లేచాడు. పరుగు నడకతో మెట్లు దిగి క్రిందికి వచ్చాడు .

నిజమే కింద సోఫాలో డైరెక్టర్ కేవీ రెడ్డి కూర్చొని వున్నాడు. రామారావు ఊహించని ఘటన. సంభ్రమాశ్చార్యాలతో రెడ్డి గారి దాగరకు వెళ్లి నమస్కారం పెట్టాడు. రామారావును చూడగానే రెడ్డి గారు లేచాడు. మీరు కూర్చోండి.అన్నాడు.

ఎదురుగా వున్న సోఫాలో రామారావు కూర్చున్నాడు. ఇప్పటికి రామారావు నమ్మలేక పోతున్నాడు. కేవీ రెడ్డి గారు తన ఇంటికి రావడం ఏమిటి? అని. కుర్రోడిని పిలిచి మంచి కాఫీ తీసుక రమ్మని చెప్పాడు.

ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. కెవి రెడ్డి అంటే ఎన్.టి రామారావు కు మాటల్లో చెప్పలేనంత అభిమానమ్. 1957లో రెడ్డిగారు దర్శకత్వం వహించిన “మాయాబజార్ ” సినిమాలో శ్రీకృష్ణుడుగా రామారావు నటించాడు. ఆసినిమాలో నిర్మాతలు కాదన్నా రామారావును కృష్ణుడు పాత్రకు రెడ్డి గారు ఎంపిక చేశాడు. ఆ తరువాత రెడ్డి గారి దర్శకత్వంలో జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, సత్య హరిశ్చంద్ర, ఉమాచండి గౌరీ శంకరుల కథ  చిత్రాల్లో నటించాడు. ఉమాచండి గౌరీ శంకరుల కథ చిత్రం విజయ ప్రదిక్షన్స్ వారు నిర్మించారు. ఈ సినిమా 11 జనవరి 1968లో విడుదలైంది . సినిమా ఊహించని పరాజయం పొందింది. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి కేవీ రెడ్డి అంటే ఎంతో అభిమానంగా ఉండేవారు. వారికి ప్రత్యేకంగా ఒక కారు , స్టూడియోలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే సినిమా ఫ్లూప్ అయ్యిందో, కారు వెనక్కు తీసుకున్నారు, ఆఫీసుకు తాళం వేశారు. ఇది రెడ్డి గారికి పెద్ద అవమానం.

ఇది తెలిసి రామా రావు రెడ్డి గారిని స్వంతంగా సినిమా తీసుకొమ్మని వెంటనే కాల్ షీట్స్ ఇచ్చారు. ఉమా చండి గౌరీ శంకరుల కథ సినిమా హీరోయిన్ సరోజాదేవిని కూడా ఒప్పించి ఆమె కాళ్ళ షీట్స్ కూడా తీసుకున్నారు. పింగళి నాగేంద్ర రావు కథ ఇచ్చారు. అదే భాగ్య చక్రం. ఈ సినిమా 1968 వ సంవత్సరం సెప్టెంబర్ 13న విడుదలైంది. ఈ సినిమా కూడా రెడ్డి గారిని ఆదుకోలేక పోయింది. దీంతో రెడ్డి గారు మానసికంగా దెబ్బ తిన్నారు. ఇంటికే పరిమితమైపోయారు.

అలా రెడ్డి గారిని చూడగానే పాత జ్ఞాపలు రామారావును కలవర పెట్టాయి. రెడ్డి గారినే చూస్తున్నాడు రామారావు. కేవీరెడ్డి  గొంతు సవరించుకొని ” నీతో పని వుంది వచ్చా మిస్టర్ రామారావు “అన్నాడు. “చెప్పండి గురువు గారు” అన్నాడు.

“మా అబ్బాయి అమెరికా వెడతాను అంటున్నాడు, నా ఆర్ధిక పరిస్థితి అందుకు సహకరించదు. అందుకే మా అబ్బాయి నీతో చనువుగా ఉంటాడు కాబట్టి ఎలాగైనా అతనితో అమెరికా ప్రయాణం మానిపించు” అన్నాడు.

రామారావుకు విషయం అర్ధమైంది. డబ్బు సహాయం చేస్తానంటే తీసుకోడు  అభిమానవంతుడు. మరి ఏమిటి చేయడం? గురువు గారి అబ్బాయి అమెరికా వెళ్ళాలి… ఎలా ఎలా? అప్పుడే రామారావు మనసులో ఓ ఫ్లాష్ వెలిగింది.

“గురువు గారు నేనే మీ దగ్గరకు వద్దామనుకున్నా” అన్నాడు. “నా దగ్గరకా ?” అని ఆశ్చర్యంగా చూశాడు. “అవును గురువు గారు  శ్రీకృష్ణ సత్య అనే స్క్రిప్ట్ తయారు చూసుకున్నామా సంస్థ లో నిర్మించాలని, మాసంస్థ కోసం మీరు ఈ సినిమా దర్శకత్వం చేసి పెట్టాలి”అన్నాడు. కేవీరెడ్డి  ఆశ్చర్యంగా చూశాడు.

“మా సంస్థలో మీ పేరు ఉండాలి గురువు గారు” అన్నాడు. “ఇక దర్శకత్వం వద్దనుకున్నా?” “మా సంస్థ లో మీ పేరు ఉండాలి గురువుగారు, మీరు  సెట్ కు వచ్చి కూర్చుంటే చాలు. మిగతావి మేము చూసుకుంటాం”

రెడ్డి గారు రామా  రావు వైపు చూసి “సరే రామారావు” అన్నాడు. ఒక్క క్షణం అని రామ రావు లోపలకు వెళ్ళాడు. శ్రీకృష్ణ సత్య  స్క్రిప్ట్. కవర్లో ఓ లక్ష లక్ష రూపాయలు అడ్వాన్స్ రెడ్డి గారి చేతిలో పెట్టాడు.

అలా రెడ్డి గారి అబ్బాయి అమెరికా వెళ్ళాడు, రెడ్డి గారి ఆర్ధిక పరిస్థితులు  చక్కబడ్డాయి. నిజానికి శ్రీకృష్ణ సత్య సినిమాను ఎన్ .టి రామారావు దర్శకత్వం వహించాలనుకున్నాడు.

కానీ గురువు గారి అవసరాన్ని గుర్తించి ఆ సినిమా రెడ్డి గారి దర్శకత్వంలో తీశాడు.  ఈ సినిమా  24 డిసెంబర్ 1971లో విడుదలైంది. అది రామారావు గురువు గారికి ఇచ్చిన మర్చిపోలేని కానుక.

-భగీరథ