రామ్ ట్వీట్ రచ్చ రచ్చ అవుతోందే

ఆంధ్రా నాదే…తెలంగాణా నాదే అంటూ హీరో రామ్ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లులు కురిపించారు. దాంతో మళ్ళీ తెలంగాణా వాళ్లు ఏమైనా అనుకుంటారు అని డౌట్ వచ్చిందేమో ..వెంటనే రెండు రాష్ట్రాలు తనవే అంటూ ట్వీట్ చేసారు.

వివరాల్లోకి వెళితే…. అనంతపురం జిల్లా ఎర్రమంచిలో కియా కార్ల సంస్థలో ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభించిన సందర్బంగా చంద్రబాబు ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘కొన్నేళ్ల క్రితం అనంతపురం జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తాయంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషితో జిల్లాకు నీటి సరఫరా అందించాం. దీని ద్వారా జిల్లాలో మరెన్నో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ పై రామ్‌ స్పందిస్తూ.. ‘ఇది నిజమే.. మన రాష్ట్రానికి ఇది భారీ ముందడుగు. మున్ముందు ఇలాంటివి మరెన్నో వస్తాయి’ అని పేర్కొన్నారు. రామ్‌ ఈ ట్వీట్‌ చేయగానే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మద్దతు తెలుపుతున్న ఏకైక హీరో రామ్‌ అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.

ఈ కామెంట్లపై రామ్‌ స్పందిస్తూ.. ‘నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్‌.. నువ్వు మంచి చెయ్‌.. నీకూ ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే. ఇదే మాట మీదుంటా. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అస్సల్లేదు. ముందు నేను పౌరుడిని ఆ తర్వాతే నటుడ్ని’ అని వెల్లడించారు రామ్‌.

రీసెంట్ గా ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ,డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలయికలో వస్తున్న తొలి చిత్రం అధికారికంగా ప్రారంభమయ్యింది.. ‘ ఇస్మార్ట్ శంకర్ ‘ అనే టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ సరికొత్త లుక్ లో కనిపించనుండగా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం జరుగుతోంది… యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఈ సినిమా లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు..పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.