15వ శతాబ్ధానికి సంబంధించిన పాత్రలో నాగ్,టైటిల్ ఏంటంటే

పీరియడ్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. తమ చిత్రాల్లో ప్లాష్ బ్యాక్ లో అయినా పీరియడ్ లుక్ తేవాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. హీరోలు కూడా ఉత్సాహంగా తమను తాము ఆ కాలంలోకి వెళ్లి చూసుకోవటాన్ని ఆస్వాదిస్తున్నారు.

తాజాగా నాగార్జున  15వ శతాబ్ధానికి సంబంధించిన  రుద్రుడు అనే పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఇది స్టైయిట్ తెలుగు సినిమా కాదు. తమిళంలో రూపొంది తెలుగులో డబ్బింగ్ అవ్వబోతోంది. నాగార్జున ని తమ సినిమాలోకి తీసుకోవటం ద్వారా తెలుగు మార్కెట్ ని సొంతం చేసుకోవచ్చని నిర్మాతల ఆలోచన కావచ్చు.

ఇక ఆ చిత్రాన్ని డైరక్ట్ చేయనుంది మరెవరో కాదు… తమిళ స్టార్ హీరో ధనుష్. ధనుష్‌ హీరోగా నటిస్తూనే ఒక మల్టీస్టారర్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగార్జున మరో హీరోగా నటిస్తున్నారు.

ఖుషీ చిత్రం దర్శకుడు ఎస్‌జే.సూర్య, నటి అదితిరావు వంటి  భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి నాన్‌ రుద్రన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా
తెలుస్తుంది. ఈ చిత్ర కథలో 15వ శతాబ్ధానికి సంబంధించిన సన్నివేశాలుంటాయని, ఆ ఎపిసోడ్‌లోనే నాగార్జున కనిపిస్తారని ప్రచారం తమిళనాట జరుగుతోంది. ఆ పాత్ర పేరే రుద్రుడు అని..ఆ పాత్ర మళ్లీ ఈ కాలంలోకి వస్తే అది ధనుష్ అవుతుందని చెప్పుకుంటున్నారు.