దేశ చరిత్రను మార్చి వేసిన ఓ మహా నాయకుడు, ఎన్ని తరాలు దాటినా చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఓ మహా నటుడు, దేశానికి పేరు సంపాదించి పెట్టిన ఓ క్రీడాకారుడు ఇలా.. వారి వారి జీవితాలను జనంలోకి తీసుకెళ్లడానికి అప్పుడప్పుడూ బయోపిక్‌లు రూపుదిద్దుకుంటుంటాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ తరహా ఒరవడి ముందు నుంచీ ఉన్నదే. అవి బయోపిక్‌లుగా గుర్తింపు పొందలేదు. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏడాది ఒకటీ, రెండన్నా బయోపిక్‌లు రూపుదిద్దుకుంటుంటాయి. అందులో చాలామటుకు విజయం సాధించాయి. ఈ విజయం సాధించడం అనేది తోటి నిర్మాతలు, దర్శకలు, కథకుల్లో ఆసక్తిని రేపి ఉంటుంది. అందుకే- తరచూ బయోపిక్‌లపై బాలీవుడ్ పెద్దలు కసరత్తు చేస్తూ ఉంటారు. బాలీవుడ్ జాబితాలోఈ మధ్యకాలంలోనే చాలా సినిమాలు వచ్చి చేరాయి. మరిన్ని రాబోతున్నాయి.
తెలుగులో బయోపిక్‌లు బాలీవుడ్ తరహాలో సందడి చేసిన సందర్భాలూ ఉన్నాయి. భక్త పోతన, యోగి వేమన, వీరపాండ్య కట్ట బొమ్మన వంటి సినిమాలను తెలుగు పరిశ్రమ కొన్ని దశాబ్దాల కిందటే తీసింది. అవి బయోపిక్‌లుగా గుర్తింపు పొందలేదంతే. పాండురంగ స్వామి, షిర్డీ సాయిబాబా, ఏసుక్రీస్తు, అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీవారి భక్తుడు హాథీ రామ్‌జీ పై మొన్నటికి మొన్నే వచ్చిన ఓం నమో వేంకటేశాయ వంటి సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ తీసిన `శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర`ను ఎవ్వరైనా మరిచిపోగలరా? ఇదీ బయోపిక్ సినిమానే. వాటిని భక్తి సినిమాలుగా భావించారే గానీ బయోపిక్‌లుగా చూడలేదు ప్రేక్షకులు. అందువల్ల- వాటిని బయోపిక్‌గా గుర్తించలేం. తెలుగులో కొన్ని పీరియాడికల్ సినిమాలు వచ్చాయి.. వెంకటేష్ నటించిన `సుభాష్ చంద్రబోస్`, నాగార్జున లీడ్ రోల్ చేసిన `రాజన్న`లాంటివి పీరియాడికల్స్ మిగిలిపోయాయి.
ఆధునిక తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ పేరుతో వచ్చిన మొట్టమొదటి సినిమా `మహానటి`. రావడం, రావడంతోనే ఓ మైలురాయిలా వచ్చింది. ఇందులో లీడ్ రోల్ చేసిన కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ అతికినట్టు సరిపోయారు. వారిద్దరూ మలయాళీ నటులే. ఆధునిక తెలుగు సినిమాలో ఈ సినిమా ఒక ట్రెండ్ సృష్టించింది. మరోసారి బయోపిక్‌లు తీయవచ్చని, అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగితే ప్రేక్షకులు ఆదరిస్తారనీ మహానటి చాటి చెప్పింది. అప్పటివరకూ ఈ తరహా జోనర్ జోలికి వెళ్లాలా? వద్దా? అనుకుంటూ ఉన్న నిర్మాతలు, దర్శకులకు ధైర్యాన్ని ఇచ్చింది. సాహసం చేసి తీస్తే, కలెక్షన్లు వస్తాయనీ సూచించింది. అదే సమయంలో `రుద్రమదేవి,` `గౌతమీ పుత్ర శాతకర్ణి` ప్రేక్షకులను కట్టి పడేశాయి.
ఇక- తెలుగు ప్రేక్షకులను వరుసగా కొన్ని బయోపిక్‌లు పలకరించబోతున్నాయి. తెలుగు రాజకీయాలను శాసించిన ఇద్దరు ప్రధాన నాయకుల జీవితాల మీద తీసిన ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకరు రాజకీయాల్లోనూ తనదైన ముద్రను వేసిన మహానటుడు ఎన్టీఆర్..మరొకరు మహా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎన్టీఆర్ సినిమా రంగాన్ని ఆధారంగా చేసుకుని ఓ భాగాన్ని, రాజకీయ రంగాన్ని ఆధారంగా చేసుకుని రెండో భాగాన్నీ తెరకెక్కించారు. వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రను కేంద్రబిందువుగా చేసుకుని `యాత్ర` సినిమాను తీశారు. ఎన్టీఆర్ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకే ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. ఆ తరువత జరిగిన పరిణామాలు కూడా ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీలకం. వివాదాలమయం కూడా.
ఎన్టీఆర్ బయోపిక్ ఎక్కడైతే ముగుస్తుందో.. అక్కడి నుంచే కథను మొదలయ్యేలా మరో బయోపిక్ కూడా రాబోతున్నది. అదే `లక్ష్మీస్ ఎన్టీఆర్`. దీన్ని రామ్‌గోపాల్ వర్మ తీశారు. ఎన్టీఆర్ భార్యగా ఆయన జీవితంలో ప్రవేశించిన లక్ష్మీ పార్వతి దృష్టి కోణంలో ఉంటుంది ఈ సినిమా. రామ్‌గోపాల్ వర్మ సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. సున్నితత్వం కనిపించదు. మొరటుగా, ముక్కు మీద గుద్దినట్టుగా ఉంటాయి. ఆయన తీసిన ఇలాంటి సినిమాల్లో విజయాల శాతం కూడా తక్కువే. అయినప్పటికీ- `లక్ష్మీస్ ఎన్టీఆర్` తెలుగుదేశం ప్రత్యర్థులను విపరీతంగా ఆకట్టుకునేదిగా ఉండొచ్చు.
సినీ రంగాన్ని పక్కన పెడితే-ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లో చాలా భావసారూప్యం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో పరస్పరం బద్ధ శతృవులైన పార్టీలకు వారిద్దరూ నాయకత్వం వహించారు. పార్టీలు వేరు అయినప్పటికీ ఇద్దరి వ్యక్తిత్వాలు దగ్గరగానే కనిపిస్తాయి. ఎవరికీ తలవంచని మనస్తత్వం వారిది. గమ్యం ఒక్కటే. లక్ష్యం ఒక్కటే. చరిత్రను సృష్టించాలనుకున్నారు. సృష్టించారు. దీనికోసం ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచారు. సమకాలీన రాజకీయాలను శాసించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్టీఆర్.. ఢిల్లీ ప్రభువులకు ఏనాడూ తల వంచలేదు. వారిని ఎదిరించారు. వైఎస్ఆర్‌లోనూ అలాంటి నైజం కనిపిస్తుంది. తాను ఉన్నది ఓ జాతీయ పార్టీలో అయినప్పటికీ.. ఆ పార్టీ అధిష్ఠానాన్ని వైఎస్ఆర్ లెక్క చేయలేదు. తాను అనుకున్నది చేస్తూ పోయారు.
తమకు తాముగా నిర్దేశించుకున్న గమ్యాన్ని వారు చేరుకోగలిగారు. దీనికోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. జనం మెచ్చేలా పరిపాలించారు. సామాన్య ప్రజలకు దగ్గరయ్యారు. వారిద్దరి జీవితాలు ఎలా ముగిశాయనేది అప్రస్తుతం. ఎన్టీఆర్, వైఎస్ఆర్ మీద తీసిన బయోపిక్‌లు కొద్దిరోజుల తేడాతో వరుసగా విడుదల కాబోతుండటం ఒక రకంగా కాకతాళీయమే. ఎన్టీఆర్ జీవితంపై రెండు భాగాలుగా తీసిన వాటిల్లో ఒకటి ఎన్టీఆర్ `కథా నాయకుడు` సినిమా మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతోంది. 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది.
హిందీ చలన చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి భావసారూప్యమే ఉన్న రెండు బయోపిక్‌లు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రులపై బయోపిక్‌లు రాగా.. హిందీలో ప్రధానమంత్రులపై రాబోతున్నాయి. అక్కడ కూడా రెండు ప్రధాన పార్టీల నాయకుల మీదే కావడం కూడా యాదృశ్చికమే. ఒకరు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఇంకొకరు ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ. మన్మోహన్ సింగ్ మీద తీసిన బయోపిక్‌లో అనుపమ్ ఖేర్ నటించారు. మోడీ బయోపిక్‌లో సురేష్ ఒబెరాయ్ నటిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పని చేసిన కాలాన్ని తీసుకుని తీసిన `ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్` సినిమా విడుదలకు ముందే వివాదాలను రేకెత్తించింది. కోర్టుల వరకూ వెళ్లింది. `పీఎం నరేంద్రమోదీ` సినిమా షూటింగ్ ఇప్పుడిప్పుడే మొదలైంది.
తెలుగులో రెండు, హిందీలో రెండు బయోపిక్‌లు రాజకీయాలకు సంబంధించినవి కావడం, అవన్నీ 2019 ఎన్నికలు సమీపించే నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం మరో ఆసక్తికర అంశం. హిందీ సంగతి ఎలా ఉన్నా.. తెలుగులో రాబోతున్న ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడేవి గానే భావించాలి. ఎందుకంటే- మన రాష్ట్రంలో సమకాలీన రాజకీయాల్లో ఆ ఇద్దరు మహా నాయకుల వారసులే ఉన్నారు కాబట్టి. ఆ వారసులు కూడా రెండు ప్రధాన పార్టీలకు నాయకత్వాన్ని వహిస్తున్నారు కాబట్టి. ఎన్టీఆర్ రాజకీయ వారసునిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. వైఎస్ఆర్ వారసునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయాలు ప్రవేశించిన తరువాతే అలాంటి సినిమాలు బయోపిక్‌లుగా పేరు తెచ్చుకున్నాయని అనుకోవచ్చు. గతంలో తీసిన సినిమాలు కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే తీస్తే, ఇటీవలి కాలంలో వచ్చిన, రాబోతున్న బయోపిక్‌లు ప్రేక్షకులను ఓటర్ల రూపంలో చూస్తున్నాయి. ఇవి ఓటర్లను ఎంత మేర ప్రభావితం చేస్తాయి? తటస్థ ఓటర్లను తమవైపునకు తిప్పుకోగలుగుతాయా? ఓటుబ్యాంకును పెంచగలుగుతాయా? అనేది రెండో భాగంలో చూద్దాం.