సంక్రాంతి మొదలైందంటే చాలు సినిమాల సందడి హీరోల హడావిడి మాములుగా ఉండదు. ఊళ్ళల్లో ఈ పండగని చాలా పెద్ద పండగలా చేస్తారు. సంక్రాంతికి ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్ళను సినిమాకి తీసుకువెళ్ళడం కూడా అక్కడ ఓ సరదా. ఇక ఇదిలా ఉంటే ఈసారి బరిలో మహేష్, బన్నీ ఇద్దరు సూపర్ స్టార్‌లు పోటీపడుతున్నారు. ఒకరు అనిల్‌రావిపూడి దర్శకత్వంలో వస్తున్న `సరిలేరునీకెవ్వరు`తో మహేష్ వస్తుంటే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో `అలవైకుంఠపురంలో` అంటూ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సంక్రాంతి పోటీలో వీరిద్దరు దిగనున్నారు. విజేతలుగా ఎవరు నిలుస్తారా అని అటుఫ్యాన్స్‌లోనూ ఇటు ఈ ఇద్దరిలోనూ అప్పుడే పోటీ మొదలయ్యింది.
చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్న బన్నీకాస్త పంతంగానే ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరూ టీం ఏదో ఒక ప్రమోషన్ చేస్తే వెంటనే అదే సమయానికి తన సినిమాకు సంబంధించి ఏదో ఒకటి విడుదల చేస్తున్నాడు. అలా ఇప్పటి దాకా చాలా సార్లు జరిగింది. తాజాగా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గురించి కూడా ఇలాగే చెయ్యబోతున్నాడంట బన్నీ. సరిలేరు నీకెవ్వరూ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ లో జరుగుతుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. దాని కోసం ఎల్బీ స్టేడియంని వేదికగా కూడా బుక్ చేసింది. ఇప్పుడు అదే రోజున అదే సమయానికి బన్నీ తన అల వైకుంఠపురములో ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరపాలని భావిస్తున్నాడట. త్వరలో అధికారిక ప్రకటన వెలువడబోతుంది. పాటలు, టీజర్ల వరకూ అంటే ఒక ఇంత పెద్ద ఈవెంట్లు క్లాష్ అంటే ఇబ్బందే. లక్షలు ఖర్చుపెట్టి చేసే ఈవెంట్లకు మైలేజ్ రాకపోతే ఇరు సినిమాలకు ఇబ్బందే. ఒకే సమయంలో రెండు పెద్ద ఈవెంట్లు జరిగితే టీవీ రేటింగ్స్ కూడా తగ్గిపోతాయి. అది అల వైకుంఠపురములో కి కూడా మంచిది కాదు. దీనిపై ఆ చిత్రబృందం పునరాలోచించుకుంటే వారికే మంచిది. పైగా టీవీ వారు రైట్స్ కు ఇచ్చే సొమ్ములు కూడా తగ్గించేస్తారు.
ప్రమోషన్ విషయం దగ్గరనుంచి ప్రతిదీ ఇలా పోటీ పడుతూనే మొదటి నుంచి ఇప్పటి వరకు వచ్చారు. చివరికి ఎవరు నెగ్గుతారో తెర మీద చూడాలి. ఇక ఇప్పటి వరకు విడుదలైన పాటల విషయానికి వస్తే అలవైకుంఠపురంలో పాటలకు మంచి హైప్ వచ్చింది. కానీ సరిలేరు నీకెవ్వరు నుంచి విడుదలైన రెండు పాటలకు అంత హైప్ రాలేదు. అందులోని పాటలు ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయాయి. ఇక టీజర్ ట్రైలర్ విషయానికి వస్తే మహేష్‌బాబు సరిలేరునీకెవ్వరుకి మంచి వ్యూస్ వచ్చాయి.