30 సంవత్సరాలనాటి జ్ఞాపకం
తెలంగాణ సినిమాకు ఓ ఊపును ,ఉత్సాహాన్ని తీసుకొచ్చింది బి. నరసింగరావే . తెలంగాణాలో దొరల కుటుంబంలో జన్మించిన నరసింగ రావు ఆ దొరల గడిలలో జరిగే దారుణాలను తెరపైన మలిచిన సాహసవంతుడు . నరసింగరావు దొరల కుటుంబంలో జన్మించినా ఆయన అభిప్రాయలు , ఆలోచనలు వామపక్ష భావాలతో నిండివుంటాయి . చదువుకునే రోజుల నుంచి ఆయన రూటే సెపెరేటేగా ఉండేది . కళలన్నా , కవిత్వమన్నా అభిమానం .
తనలోని ఆలోచనలను, ఆవేదనలు , భాధలు , గాధలను తన ప్రజలతో పంచుకోవాలుకున్నాడు . తన స్నేహితుడు రవీంద్రనాథ్ తో చర్చించాడు . ఆయన నరసింగ రావును ప్రోత్సహించాడు . అదే మా భూమి సినిమా.. ఈ సినిమా ద్వారా గౌతమ్ ఘోష్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు . ఆ తరువాత 1988లో తన దర్శకత్వంలో “దాసీ” అనే సినిమాకు శ్రీకారం చుట్టాడు .
నిజానికి ఈ సినిమా అనేది ఓ సాహసమైన చర్య . దొరల కుటుంబంలో వున్న ఎవరైనా ఇలాంటి సినిమా చెయ్యరు . దొరల గడిలో ఓ దాసీ మహిళ జీవిత చిత్రణే ఈ సినిమా. . నరసింగ రావు స్వతహాగా సృజనాత్మక కవి కాబట్టి , తన ఊహల ప్రకారం దర్శకత్వం వహించాలనుకున్నాడు . తాను చిన్నప్పుడు చూసిన ఘట్టాలను, విన్న కథల సమాహారమే ‘దాసీ ‘ సినిమా.
నిజానికి ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలామంది వారించారు . దొరల బతుకు బయట పెట్టవద్దని హెచ్చరించారు . అయినా నరసింగ రావు వెనుకడుగు వెయ్యలేదు . తనకు ఏదైతే ప్రపంచానికి చూపెట్టాలని అనుకున్నాడో , ఆ విషయంలో చాలా స్పష్టంగా వున్నాడు . అందుకోసం నిరంతరం శ్రమించాడు . మిత్రులతో కలసి కథకు సినిమా రూపకల్పన చేశాడు .
చాలా సహజంగా ఉండాలనేది ఆయన ఆలోచన . అందుకు ఏమాత్రం రాజీపడేవాడు కాదు . పాత్రల కోసం ఆయా నటుల ఆహార్యం వుండాలనుకొనేవాడు . అలాగే అర్చన అయినా రూప అయినా వస్త్రాల విషయంలో కూడా రాజీపడేవాడు కాదు . ప్రతి పాత్ర ఆయన ఆశించినట్టుగా తయారు చేసేవాడు . తన ఆలోచనలు తెరపైన మలచడానికి ఒరియా కెమెరామన్ ఏకే బీర్ ను ఎంపిక చేసుకున్నాడు .
సహజమైన లొకేషన్ లను ఎంపిక చేసుకొని షూటింగ్ మొదలు పెట్టాడు . ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు హైదరాబాద్ సారధి స్టూడియోస్‌లోనే చేశాడు . ఈ చిత్రం షూటింగ్ కు తరచుగా నేను వెళ్ళేవాడిని . నరసింగ రావు ఆలోచనలు ఎంత వైవిధ్యంగా వుంటాయో ఆయన సినిమా మేకింగ్ కూడా అంతే భిన్నంగా ఉండేది . తక్కువ ఖర్చుతో , లభ్యమైన వనరులతోనే షూటింగ్ చేసేవాడు . అప్పటికే పేరున్న అర్చన, రూపాదేవిని ముఖ్య పాత్రలకు ఎంపిక చేసుకున్నాడు . ఆయన షూటింగ్ ఎలాంటి ఆడంబరం లేకుండా జరుగుతూ ఉండేది .
తన మనసులో వున్న ఆలోచనలు తరచుగా తనని ఆత్మ విమర్శ చేసుకునేలా చేసేవని చెప్పేవాడు నరసింగరావు . హైదరాబాద్, పరిస ప్రాంతాల్లోని గడీల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది . విశేషమేమంటే ఈ సినిమాకు ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి .
తెలుగులో ఉత్తమ ప్రాంతీయ సినిమా , ఏకే బీర్ కు ఉత్తమ ఛాయాగ్రహణం , అర్చనకు జాతీయ ఉత్తమ నటి , సుదర్శన్ కు ఉత్తమ వస్త్రాలంకరణ , వైకుంఠానికి ఉత్తమ కల దర్శకుడు అవార్డు . ఆరోజుల్లో ఒక తెలుగు సినిమాకు ఐదు జాతీయ అవార్డులు రావడం ఎవరు వూహించని గొప్ప విషయం .
దాసీ సినిమాతో నరసింగ రావు పేరు మారుమ్రోగిపోయింది . “దాసీ” చిత్రం ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా పాల్గొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది .
– భగీరథ