దెయ్యంతో కూడా విజయ్ కి హిట్టే? ( ‘టాక్సీవాలా’ రివ్యూ)

-సికిందర్

నెలకో సినిమాతో వస్తూ విజయ్ దేవర కొండ చాలా బిజీగా వున్నాడు. అంతే బిజీగా అటు పైరసీదార్లు తమ పని మీద వున్నారు. విడుదలకి ముందే ‘టాక్సీవాలా’ ని ఆన్ లైన్లో లీక్ చేశారు. షూటింగ్ పూర్తయిన రష్ కాపీ కూడా గతంలో ఆన్ లైన్‌లో లీక్ ఇచ్చారు. అయినా ఇప్పుడు థియేటర్లోనే చూడమంటూ విజయ్ విజ్ఞప్తి చేశాడు. అదే నోటితో ఇది ‘గీతగోవిందం’ అంత బ్లాక్ బస్టర్ హిట్ అవదని కూడా చెప్పేశాడు. ఏడాది కాలంగా విడుదల ఆపిన ‘టాక్సీవాలా’ ఇన్ని సంచలనాలు సృష్టిస్తూ ప్రేక్షకుల మధ్య కొచ్చింది. ‘ది ఎండ్’ తీసిన టెక్కీ రాహుల్ సాంకృత్యాయన్ దీనికి దర్శకత్వం వహించాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా చెబుతున్నదీంట్లో విజయ్ నటించడమంటే తను వైవిధ్యాన్ని కోరుకుంటున్నాడని అనుకోవచ్చు. మరి ‘టాకీవాలా’ తో అందించిన వైవిధ్యమేమిటి? ఇదొకసారి పరిశీలిద్దాం…

కథ

డిగ్రీ చదివిన శివ (విజయ్) నగరానికి వస్తాడు. గ్యారేజీ నడిపే ఫ్రెండ్ బాబాయ్ (మధునందన్), అతడి అసిస్టెంట్ (విష్ణు) ఇక్కడ వుంటారు. బాబాయ్ కొన్ని ఉద్యోగాలు చూపిస్తాడు. శివ దేంట్లోనూ ఇమడలేకపోతాడు. క్యాబ్ నడుపుకోవాలన్న ఆలోచన వస్తుంది. దీనికి వదిన నగలమ్మి (కల్యాణి) సాయం చేస్తుంది. అన్న(రవిప్రకాష్) సహకరిస్తాడు. క్యాబ్ కొనుక్కుని నడుపుతున్న శివకి డాక్టర్ అనూషా (ప్రియాంకా జవల్కర్) పరిచయమై ప్రేమలో పడతాడు. ఇంకోవైపు ఆ కారుతో వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ కారులో ఆత్మ వుందని అర్ధమై పోతుంది. కారుని వెనక్కి ఇచ్చేద్దామంటే ఆ పాత కాంటెస్సా కారునమ్మిన రఘురాం (షిజూ) అనే అతను కనబడడు. ఒక రాత్రి ప్రమాదం నుంచి ఆత్మ కాపాడ్డంతో అది మంచి ఆత్మేనని దాంతో స్నేహం చేస్తాడు. ఓ రాత్రి ఓ డాక్టర్ కారెక్కితే యాక్సిడెంట్ చేసి అతణ్ణి చంపేస్తుంది ఆత్మ. దీంతో పూర్తిగా బెదిరిపోయిన శివ, రఘురాంని పట్టుకోవడానికి అతనింటికెళ్తాడు. అక్కడో సైకాలజిస్టు (రవివర్మ) బందీగా వుంటాడు. అతను ఆ ఆత్మ కథ చెప్పడం ప్రారంభిస్తాడు…

ఏమిటా కథ, ఎవరిదా ఆత్మ, శిశిర (మాళవికా నాయర్) అనే అమ్మాయికేం సంబంధం, ఆమె కోరుకుంటోంది, ఆ కోరిక శివ ఎలా తీర్చాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది అతీంద్రియ శక్తుల కథ. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే ఆత్మ సంబంధ పాయింటుతో ఈ కథ చేశారు. మనం బ్రతికి వుండగానే మన ఆత్మ బయటికి వెళ్లి ప్రపంచాన్ని చూడ్డమనే శాస్త్రీయంగా రుజువుకాని ఒక దృష్టాంతం ఆస్ట్రల్ ప్రొజెక్షన్. అయితే దీన్ని కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. హాలీవుడ్ లో ఈ పాయింటుతో ‘ఇన్సిడస్’, ‘డాక్టర్ స్ట్రేంజ్’ లాంటి సినిమాలు ఇరవై ముప్ఫై వచ్చాయి. మన పురాణాల్లో దీని ప్రసక్తి వుంది. దీన్ని లింగ శరీరయానం అన్నారు. ఇదొక విద్య అనుకుంటే దీన్ని పరమహంస యోగానంద సాధించారని చెప్పుకుంటారు. మెహర్ బాబా దీన్ని బోధించారని కూడా వుంది. ఇలాటి సమాచారాన్ని కూలంకషంగా పరిశీలించి కథని కన్విన్సింగ్ గా ముగించాల్సింది.

ఎవరెలా చేశారు .

ఖచ్చితంగా ఇది విజయ్ కెరీర్ లో మైలురాయి. ‘నోటా’ లాంటి మసాలా సినిమాలే కాకుండా రియలిస్టిక్ సినిమాల్లో దాని ఫీల్ తో నటనలో శైలిని మార్చుకుని ఇలాటి థ్రిల్లర్ ని సమున్నతం చేయగలడని నిరూపించాడు. టాక్సీవాలా అంటే గుర్తుండిపోయే అతడి క్యారెక్టరే, సహజ నటనే. క్లయిమాక్స్ లో కథ పరిధి దాటిపోయి పాత్ర చెదిరిపోయింది గానీ, ఆ లోపు కథ పరిధులు దాటని ఫన్, హార్రర్, రోమాన్స్, ఎమోషన్లు కలిపి హైలైట్ బాగా అయ్యాడు. ఇటీవల అతను నటించిన ఫార్ములా పాత్రలకంటే ఇది చాలా బెటర్ పాత్ర. నీటైన ఈ పాత్రని కింది క్లాసు ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారు. కింది తరగతుల ప్రేక్షకుల్లో కూడా మార్పు వస్తోంది. వూరికే మాస్ పులివేషాలేసి తాటాకు చప్పుళ్ళతో రంకెలేస్తే చూసే ప్రేక్షకులిక వుండరని దీన్ని బట్టి అర్ధమవుటింది.

కవ్వించే గర్ల్ ఫ్రెండ్ పాత్రలో ప్రియాంకా జవల్కర్, సీరియస్ సమస్యతో మాళవికా నాయర్ ఇద్దరివి కూడా నీటైన పాత్రలు, నటనలు. డాక్టర్ గా ఉత్తేజ్ కన్పిస్తాడు. విలన్ రఘురాంగా షిజూది నీటైన పాత్రే, నటనే. ఇక కామెడీ విషయానికొస్తే సహజ హాస్యంతో మధునందన్, విష్ణులు ఎక్సెలెంట్. ముఖ్యంగా హాలీవుడ్ అనే పేరుతో విష్ణు చేసే సైలెంట్ కామెడీ తెలుగు ప్రేక్షకులకి కొత్త ఫీల్. ఇతన్ని కూడా బాగా ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు.

సెకెండ్ హీరోయిన్ తల్లి పాత్రలో మాజీ హీరోయిన్ యమున, సైకాలజీ ప్రొఫెసర్ పాత్రలో రవివర్మ కనిపిస్తారు.
ఇది పాటలకి ప్రాధాన్యమున్న సినిమాకాదు గానీ, నేపధ్య సంగీతం (జేక్స్ బిజోయ్) హైపర్ గా వుంది. అలాగే సుజిత్ సరంగ్ ఛాయగ్రహణంలో లైటింగ్స్, కలర్స్ ప్రొఫెషనల్ గా వున్నాయి.

చివరికేమిటి

సూపర్ నేచురల్ థ్రిల్లర్ జానర్ లో ఇదొక సక్సెస్ ఫుల్ ప్రయత్నం. విజయ్ దేవరకొండ చెప్పిన వైవిధ్యం అపహాస్యం కాని ఎంటర్ టైనర్. చివరి అరగంట మాత్రం అనవసరంగా సాగదీసి ఇబ్బంది పెట్టిన మాట మాత్రం వాస్తవం. క్లయిమాక్స్ లో రెండు సీన్లతో ముగిసిపోయే కథని హాస్పిటల్లో శవం కామెడీతో లాజిక్ లేకుండా పిచ్చి కామెడీ చేస్తూ సాగదీయడం అనవసరం. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ తో కథ ముగిపు ఎలాగు కన్విన్సింగ్ గ వుండదు కాబట్టి ఇలా కామెడీతో కప్పిపుచ్చాలని చూసి వుంటారు. వికటించిన ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ప్రయోగానికి చూపించిన పరిష్కారం మాత్రం నమ్మశక్యంగా లేదు.

మిగతా కథంతా ప్రారంభం నుంచీ ఎక్కడా పట్టుసడలకుండా పకడ్బందీగా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ చేశారు. ఫస్టాఫ్ అంతా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా  కేవలం కారుతో విజయ్ స్ట్రగుల్ అనే సింగిల్ లనితో శీను తర్వత సీనుగా సాగే కథనాన్ని కదలకుండా కూర్చుని ప్రేక్షకులు చూడ్డం గమనించదగ్గ విషయం. కంటెంట్, పాత్రలు బావుండి, అవి మాత్రమే పకడ్బందీగా ప్లే అవుతూంటే ప్రేక్షకులు ఇంకేమీ కోరుకోరని దీన్నిబట్టి అర్ధమవుతోంది. కేవలం మూడు పాత్రలకి సంబంధించిన సస్పెన్స్ తో కూడిన కథే ఈ సినిమా. ఇంటర్వెల్ కి షాకింగ్ సంఘతానొకటి ప్లస్ అయింది.

‘ది ఎండ్’ తీసి దెబ్బతిన్న దర్శకుడు, మాజీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి రాహుల్ సాంకృత్యాయన్ ‘టాక్సీవాలా’ తో మంచి మైలేజీ పొందాడు. దీన్ని కాపాడుకుంటే మరికొన్ని మెట్లు ఎక్కవచ్చు.

Rating: 3/5

రచన – దర్శకత్వం : రాహుల్ సాంకృత్యాయన్
తారాగణం : విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవల్కర్, మాళవికా నాయర్, రవి ప్రకాష్, ఉత్తేజ్, మధునందన్, యమున తదితరులు
సంగీతం : జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం : సుజిత్ సరంగ్
బ్యానర్ : జీఏ -2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్
నిర్మాతలు : బన్నీ వాస్, వంశీ, ప్రమోద్
విడుదల : నవంబర్ 17, 2018