నోట మాట రావడంలేదు! ‘నోటా’ మూవీ రివ్యూ

(సికిందర్ )

‘నోటా’ 
రచన – దర్శకత్వం : ఆనంద్ శంకర్ 
తారాగణం : విజయ్ దేవరకొండ, మెహ్రీన్ పీర్జాదా, నాజర్, సత్యరాజ్, యషికా ఆనంద్ తదితరులు 
సంగీతం : శక్తికాంత్ కార్తీక్, ఛాయాగ్రహణం: సంతాన కృష్ణన్ రవిచంద్రన్ 
బ్యానర్ : స్టూడియో గ్రీన్ 
నిర్మాత : కేఈ జ్ఞానవేల్ రాజా 
విడుదల : అక్టోబర్ 5, 2018


  రేటింగ్   2.25 / 5

          ‘నోటా’ అనే ఎన్నికల్లో వోటింగ్ ఛాయిస్ టైటిల్ తో విజయ్ దేవరకొండ రాజకీయ సినిమా ప్రయత్నం  ఈ మధ్య బాగా నలుగుతున్న వార్త. అందులోనూ తెలుగు – తమిళ ద్విభాషా చిత్రంలో నటించడం ప్రేక్షకుల్లో క్రేజ్ తీసుకువచ్చింది. నటిస్తున్న ప్రేమ సినిమాల మధ్య విజయ్ సీరియస్ రాజకీయ సినిమాలో నటించడం అతడి పరంగా ఏ కొత్తదనంతో కూడుకుని వుంటుందన్న ఒక ఆసక్తిని పెంచింది. అదే సమయంలో విజయాలు సాధించని మూడు సినిమాల తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించడం అభిమానులకి ప్రశ్నార్ధకమై కూర్చుంది. దేశంలో ఎన్నికల సీజన్ అప్పుడే మొదలైపోయింది. తెలంగాణాలో ఇక ఒకటి రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణాలో ఒక రాజకీయపార్టీ ‘నోటా’  చూసి వోటర్లు వోటింగ్ లో నోటా మీట నొక్కేస్తారని  ఆందోళన లేవదీసింది. కొందరు కోర్టుకి కూడా వెళ్లారు. ఇంతకీ ‘నోటా’ లో ఏముంది? ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా సంచలన సందేశం ఇచ్చారా? ‘నోటా’ తో ప్రేక్షకులకి ఏం చెప్పదల్చుకున్నారు? ఇవొకసారి చూద్దాం…

 

కథ 

          సీఎం వాసుదేవరావు (నాజర్) కొడుకు వరుణ్ (విజయ్ దేవరకొండ) లండన్ లో వీడియో గేమ్ డెవలపర్ గా వుంటాడు. తన జీవితం తను రిచ్ గా ఎంజాయ్ చేస్తూంటాడు. ఇండియా కొచ్చి ఫ్రెండ్స్ తో బర్త్ డే పార్టీ ఎంజాయ్ చేస్తూంటే, హుటాహుటీన తండ్రి అతణ్ణి తన స్థానంలో సీఎంగా నియమించేస్తాడు తన మీద సీబీఐ కేసు కారణంగా. రాజకీయాలంటే ఇష్టంలేని, అనుభవంలేని వరుణ్ రెండు వారాల సీఎం గా చేయాల్సిన పని ఇంట్లో కూర్చుని ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడమే. కానీ తీర్పు తండ్రి దోషియని రావడంతో ఇక ఫుల్ టైం సీఎంగా కొనసాగాల్సి వస్తుంది. సీనియర్ జర్నలిస్టు మహేంద్ర (సత్యరాజ్) సహకారంతో పాలనా వ్యవహారాలు  చూస్తూంటే, బెయిల్ మీద విడుదలైన తండ్రి మీద హత్యాయత్నం జరిగి కోమాలోకి వెళ్ళిపోతాడు. తండ్రికి ఇంకో పదివేల కోట్ల మనీలాండరింగ్ వ్యవహారంతో  కూడా సంబంధముందనీ, ఇందులో భాగంగానే ఎవరో హత్యాయత్నం చేశారనీ గ్రహించిన వరుణ్, ఇక కుట్రాల్ని కనుక్కునే  ప్రయత్నాలు ప్రారంభిస్తాడు…

ఎలావుంది కథ 

          ఈ తెలుగు –తమిళ ద్విభాషా చలనచిత్రం, తెలుగు రాజకీయాలు ప్రతిబింబించని ఇటీవలి తమిళ రాజకీయాల కథ. జయలలిత మరణం తదనంతర పరిణామాల్లో శశికళ ఆధ్వర్యంలో జరిగిన రిసార్ట్స్ రాజకీయాలతో బాటు, చెన్నైకి వరదలొచ్చిన పరిస్థితి, ఫ్లెక్సీ బోర్డుల సంస్కృతి, పార్టీకో ఛానెళ్ళ రొద, ఒక స్వామీజీ చక్రం తిప్పడాలు వగైరావగైరా రాజకీయ వాతావరణమంతా ఇందులో కనిపిస్తుంది. అయితే ఏవీ కూడా ఒక కథగా అల్లుకోలేదు. విడివిడి ఎపిసోడ్లుగా వచ్చి పోయే ఈ సంఘటనలు నిజానికి సినిమాని ఒక ఏకమొత్తం కీలక డ్రామాకి చోటు లేకుండా చేశాయి. ఇంటర్వెల్ కి తండ్రి మీద హత్యాయత్నమనే పాయింటుతో ఒక కీలక డ్రామా ఏర్పడిందనుకుంటే, ఇక రౌడీ సీఎం వస్తున్నాడని హీరో ప్రకటించడంతో,  కథ రసకందాయంలో పడిందనుకుంటే, సెకండాఫ్ లో దీని వూసే వుండదు. మళ్ళీ విడివిడి తమిళనాడు సంఘటనల వరసే. విడివిడి ఎపిసోడ్ల ఎపిసోడిక్ కథనంతో సినిమా కథ ఏర్పడదని తెలుసుకోలేకపోయారు.

ఎవరెలా చేశారు

          విజయ్ దేవరకొండకి మొదటి పావుగంట ఆసక్తికర కథనం సమకూరింది. ప్రారంభంలోనే సీఎం పదవి వచ్చి మీద పడడం, అదేమీ పట్టకండా ఇంట్లో వీడియో గేములు ఆడుకుంటూ కూర్చోవడం, చూడకుండా ఫైళ్ళ మీద సంతకాలు పడెయ్యడం, అంతలో రెండు వారాల సీఎం పదవి అనుకుంటే తండ్రికి శిక్ష ఖరారు కావడంతో ఆ పదవిలోనే వుండాల్సి రావడం, తండ్రికి పడిన శిక్షతో సొంత పార్టీ వర్గాలే అల్లర్లు రేపడంతో వాళ్ళని కాల్చి పారెయ్యమని ఆదేశాలివ్వడం లాంటి మలుపులు చకచకా వస్తూ తన పాత్రని  ఆసక్తికరంగా మార్చాయి. రెగ్యులర్ నాయకులకంటే ఒక యూత్ గా తాను ఫీలైన ప్రకారమే తెగింపుగా చర్యలు తీసుకోవడమనే ఈ పాత్రచిత్రణ – తర్వాత పాత్రకి ఎదగడానికి ఉపయోగపడని అనేక  ఎపిసోడ్ల బారిన  బలహీన పడింది. నటనలో తన టాలెంట్ తో ఎంత నిలబెదామని ప్రయత్నించినన సేకేందాఫ్ కొచ్చేసరికి కథే పూర్తిగా సహకరించడం మానేసింది.  ముందు పావుగంట ఇరవై నిముషాలు పాత్రకి వున్నా ఎంటర్ టైన్మెంట్ వేల్యూ కూడా కనుమరుగై సీరియస్ అయిపోయింది. పైగా హీరోయిన్, ఆమెతో రోమాన్సూ వంటి యూత్ అప్పీలున్న దృశ్యాలకి అభిమానుల కోసమైనా చోటివ్వాలని అనుకోలేదు. 

          సీనియర్ జర్నలిస్టుగా నటించిన సత్యరాజ్ కూతురి పాత్ర వేసిన హీరోయిన్ మెహ్రీన్ ఈ సినిమాలో ఎందుకుందో అర్ధంగాదు. టీవీ జర్నలిస్టు పాత్ర ఇంట్లో కూర్చుని తండ్రి కన్పించినప్పుడల్లా నాల్గు మాటలు చెప్పడమే. ఓ నాల్గు సీన్స్ లో కన్పించి మాయమై పోవడమే. ప్రతిపక్ష నాయకుడి కూతురి పాత్ర వేసిన  యషికా ఆనంద్ ఫర్వాలేదు. నటించడానికి పాత్ర వుంది. సీనియర్ నటులుగా సత్యరాజ్, నాజర్ లు ఫర్వాలేదు. ఇక కాసేపు కన్పించే కమెడియన్ ప్రియదర్శి ఏం నవ్వించాడో అర్ధంగాదు. 

          టెక్నికల్ గా ఉన్నతంగా వుంది. కెమెరా వర్క్, మ్యూజిక్ రెండూ బలాలు ఈ బలహీన మూవీకి. దర్శకత్వం బాగానీ వున్నా,  రాజకీయ కథ రాజకీయ కథలా లేకపోవడంతో దీనికి దర్శకత్వమే అనవసరమనిపిస్తుంది.

చివరికేమిటి 


          బయట రోజూ ట్రెండింగ్ అవుతున్న రాజకీయాలే హాట్ హాట్ గా బావుంటున్నాయి. ఈ ఎన్నికల సీజన్లో పూర్తిగా కాలీన స్పృహ లేకుండా, అయిపోయి చల్లారిన తమిళ రాజకీయాలే మళ్ళీ చూపించే సాహసానికి వొడిగట్టిందీ రాజకీయ సినిమా. ఈ దృశ్యాలు –  చెన్నై వరదలతో సహా- టీవీల్లో చూసేసినవే. కనీసం ‘నోటా’ అనే టైటిల్ కైనా న్యాయం చేయని కథలేని సొదగా ముస్తాబై, విజయ్ దేవరకొండ అభిమానుల హృదయాలని దోచుకోవడానికి విచ్చేసిందీ తమిళ మార్కు రాజకీయ మసాలా కాని మసాలా. అభిమానుల కోసం హీరో హీరోయిన్ల మధ్య రోమాన్సు లేదుగానీ, సెకెండాఫ్ లో ముసలి పాత్ర సత్యరాజ్ కి ఫ్లాష్ బ్యాక్ వేసి,  లవ్ స్టోరీ చూపించడం అత్యవరమన్పించింది తమిళ దర్శకుడికి! ఇక విజయ్ అభిమానులకే వుండాలి ఓపిక! 

 

ఇది కూడా చదవండి

కెసియార్ మూడో కన్ను మీద సోషల్ మీడియా సెటైర్