నయనతార తమిళ హిట్! ‘అంజలి సిబిఐ (మూవీ రివ్యూ)

నయనతార తమిళ హిట్!
‘అంజలి సిబిఐ’ 
రచన, దర్శకత్వం : ఆర్. అజయ్ జ్ఞానముత్తు 
తారాగణం : నయనతార, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, అధర్వ, అనురాగ్ కశ్యప్, దేవన్ తదితరులు 
సంగీతం : హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం : ఆర్డీ రాజశేఖర్ 
బ్యానర్ : విశ్వశాంతి పిక్చర్స్ 
విడుదల : ఫిబ్రవరి 22, 2019
2.5 / 5

 నయనతార క్రైం థ్రిల్లర్ తో వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే స్త్రీల సమస్యల గురించిన సినిమాలు కాదు. పురుషుల పరాక్రమాలు పూసుకున్న వూసులు. పురుష పాత్రల్లో పురుషుల్ని కమాండ్ చేస్తూ హల్చల్ చేసే యాక్షన్ సినిమాలు. నయనతార ఇలాటివెన్నో నటించింది. పైగా ఫలానా ఫలానా సిబిఐలు  అంటూ చాలా సినిమాలు వచ్చేశాయి. మళ్ళీ నయనతార ‘అంజలి సిబిఐ’గా వచ్చి కొత్తగా చేసిందేమిటి? ఇది తెలుసుకుందాం…

కథ 

రుద్ర (అనురాగ్ కశ్యప్) అనే సీరియల్ హంతకుడు నగరంలో హత్యలు చేస్తూంటాడు, పోలీసులకి చెప్పి మరీ సంపన్న కుటుంబాలకి చెందిన యువకుల్ని కిడ్నాప్ చేసి, రెండు కోట్లు లాగి చంపేస్తూంటాడు. ఈ కేసులు చేపట్టిన సిబిఐ ఎస్పీ అంజలి (నయనతార)కి  ఐదేళ్ళ క్రితం ఇలాగే హత్యలు చేసిన రుద్ర గుర్తుకొస్తాడు. కానీ అతన్ని తనే ఎన్ కౌంటర్ చేసి కేసు క్లోజ్ చేసింది. మరి ఈ రుద్ర ఎవరు సరీగ్గా ఆ రుద్రా చేసిన పద్ధతిలోనే హత్యలు చేస్తున్నాడు? ఆ రుద్ర ఇంకా బతికే వున్నాడని రుద్ర ఛాలెంజి విసురుతాడు. చేతనైతే తనని పట్టుకోమంటాడు. ఇది నిజమేనా? రుద్ర బతికే వున్నాడా? ఐతే ఎందుకు హత్యలు చేస్తున్నాడు? వీణ్ణి ఎలా పట్టుకోవాలి? ఇవీ అంజలి ముందున్న ప్రశ్నలు…

ఎలావుంది కథ 

ఇది గత సంవత్సరం తమిళంలో హిట్టయిన  ‘ఇమైక్క నోడిగల్’ కి డబ్బింగ్ రూపం. క్రైం థ్రిల్లర్ జానర్. సీరియల్ కిల్లర్ ని పట్టుకునే రొటీన్ లాగే నడిచినా, కథలో వచ్చే ట్విస్టుతో సీన్ మారిపోతుంది. అయితే ఈ ట్విస్టుని వివరించడానికి మరిన్ని ట్విస్టులు ఇస్తూపోవడంతో ఆసక్తిని కోల్పోతుంది. సస్పెన్స్ ని విప్పి చెప్పడానికి, సినిమా ముగియాల్సిన సమయంలో ఫ్లాష్ బ్యాక్ తో చాలా కథ నడపడం వల్ల కూడా, నిడివి భరించలేనంత రెండు గంటలా 50 నిమిషాలకి పెరిగిపోయింది! దర్శకుడు తీసుకున్న ఐడియా బావుంది. కానీ కథ మీద పట్టులేక పోవడంవల్ల ఐడియా బలహీనమైపోయింది. ఇంకా నయనతార పాత్రని కుదించేస్తూ పక్క పాత్రకి పగ్గాలివ్వడం కూడా వుంది. 
ఎవరెలా చేశారు  

నయనతార ఉన్నంతలో పాత్రకి  న్యాయం చేసింది. ఐతే ఇన్వెస్టిగేషన్ ఆధారిత పోలీస్ ప్రోసీజురల్ కథకి లాజిక్కే ప్రాణం. లాజిక్ లేని ఇన్వెస్టిగేషన్ కి అర్ధముండదు. ఆ ఇన్వెస్టిగేటర్ పాత్ర హాస్యాస్పదమవుతుంది. నయనతార సిబిఐ ఎస్పీ పాత్రని రియలిస్టిక్ గా, ప్రొఫెషనల్ గా చూపిస్తూనే, కథకి అడ్డం పడ్డ చోటల్లా లాజిక్ ని పక్కన బెట్టేయడంతో, ఫార్ములా పాత్రలా  మారిపోతూ నిరాశ పరుస్తుంది. ఫస్టాఫ్ లో తనని కలవడానికి ఛాలెంజింగ్ గా వస్తున్న రుద్రని పట్టుకోవడానికైనా, వీడియోలు తీయడానికైనా, సిబ్బందితో ఎలాటి ప్లానింగ్ లేకుండా వచ్చి అతడికి చిక్కి బందీ అయిపోతుంది. అతను పారిపోతాడు. సిబ్బంది వచ్చి ఆమెని విడిపిస్తారు. సెకండాఫ్ ప్రారంభంలోనే ఆమెని సస్పెండ్ చేసి హౌస్ అరెస్ట్ చేసినప్పుడు  పోలీసులు ఫోన్స్, గన్స్  తీసేసుకుంటారు. కానీ తర్వాత ఆమె ఫోన్లో  మాట్లాతూనే వుంటుంది, గన్ తో బయటి కెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో తమని గుర్తుపడతాడని భర్తని చంపిన దుండగులు, నయనతారని వదిలేస్తారు. ఆమె గుర్తు పట్టదా? ఇలాటి ఇల్లాజికల్ సీన్లు చాలా వున్నాయి. ఇవే నయనతార పాత్ర సాహసకృత్యాల్ని, ప్రతీకారాన్నీ ఎంజాయ్ చేయడానికి అడ్డొస్తూంటాయి. 

  విజయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్ తో వచ్చే అతిధి పాత్ర. నయనతారతో రోమాన్స్, పెళ్ళీ వగైరా. నయనతార తమ్ముడుగా అధర్వ సెకండాఫ్ కథని హైజాక్ చేసి తనే హీరో అన్నట్టు వుంటాడు. రాశీఖన్నాతో ఇతడి ప్రేమ ట్రాకు పొడిపొడిగా వుంటుంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్  సీరియల్ కిల్లర్ రుద్ర పాత్రతో చాలా వరకూ ఈ థ్రిల్లర్ ని నిలబెట్టాడు. సైబర్ టెక్నాలజీతో దొరక్కుండా ముప్పు తిప్పలు పెట్టే లాజిక్ తన పాత్రకే వుంది. తన పాత్రకీ ఓ ట్విస్టుతో ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. 

 టెక్నికల్ గా ప్రధానంగా చెప్పుకోవాల్సింది  ఆర్డీ రాజశేఖర్ కెమెరా వర్క్ ని. ప్రతీ సీనూ దాని మూడ్ ని క్రియేట్ చేసే ఎఫెక్ట్స్ తో వుంది. పూర్తి కథ బెంగుళూరులోనే తీశారు. హిప్ హాప్ తమిళ సంగీతం ఇంకో వెరైటీగా వుంది. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు టేకింగ్ ట్రెండీగా వుంది. కానీ లవ్ ట్రాక్ ట్రెండ్ కి దూరంగా వుంది, సుత్తి ప్రేమ కథతో.

చివరికేమిటి 

అసలు కథంతా ఫ్లాష్ బ్యాక్ లోనే వుంది. నడిచే కథంతా ఆ అసలు కథ పరిణామాలే. అయితే ఫ్లాష్ బ్యాకులో నయనతారని దుండగులు చంపకుండా వదిలెయ్యడమే కామన్ సెన్సు కి అడ్డుపడే ఆలోచన. భర్త గుర్తు పడతాడని అతన్ని చంపేసి, ఆమెని వదిలేయడంతో, తర్వాత ఆమె వాళ్ళనే  చంపడం మొదలెపెట్టింది. వాళ్లెంత ఫూలిష్. ఇలా అర్ధం లేని ఫ్లాష్ బ్యాక్ మీద మిగతా కథ అల్లాడు దర్శకుడు. రెండున్నర గంటల థ్రిల్లర్ నడిపి, తీరా ఇలా లాజిక్ లేని సస్పెన్స్ విప్పితే, ఆడియెన్స్ కనిపెట్టలేరా? దీని తర్వాత ఇంకో ఇరవై నిముషాలు పాటూ సాగి,  రెండు గంటలా 50 నిమిషాలకి ముగుస్తుందీ థ్రిల్లర్ డ్రామా.

 ఫస్టాఫ్ లో హత్యలతో కిల్లర్ కీ, నయనతారకీ మధ్య థ్రిల్లింగ్ దృశ్యాలు వస్తూంటే, మధ్య మధ్యలో సంబంధం లేకుండా అథర్వ, రాశీ ఖన్నాల లవ్ ట్రాక్ వస్తూంటుంది. దీంతో ఈ థ్రిల్లర్ జానర్ మర్యాద మంటగలిసి పోతుంది. ఈ లవ్ ట్రాక్ అయినా థ్రిల్లర్ జానర్ మర్యాదలకి లోబడిన పాత్రలతో,  ప్రవర్తనలతో వుండక, ఎంతో పాతకాలం ప్రేమ సినిమా టైపులో,  ఆ రకమైన డైలాగులతో వుంటుంది. ఈ ట్రాక్ వచ్చి ఇంటర్వెల్లో మెయిన్ కథతో కలవడం బావున్నా, ఇంతసేపూ బి గ్రేడ్ ప్రేమతో బోరు కొట్టిస్తుంది. 

 సెకండాఫ్ లో నయనని హౌస్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టి కథని అధర్వకి కట్టబెట్టడంతో ఫ్లాష్ బ్యాక్ వరకూ అతడిదే  హీరోయిజం. ఈ హీరోయిజంలో అనురాగ్ కశ్యప్ తో క్షణం తెరిపి నివ్వని యమఫాస్టు ఫైట్ సీను హైలైట్. దీనికి ఎక్కడ్నించి స్ఫూర్తి పొందారోగానీ, ఇండియన్ సినిమాల్లో ఇలాటి సూపర్ ఫాస్ట్ హేండ్ టు హేండ్ ఫైట్ సీను వచ్చినట్టు లేదు. మార్షల్ ఆర్ట్స్ లో చూసుంటాం, అది వేరు.

 ఈ క్రైం థ్రిల్లర్ అర్ధవంతమైన మూల కథ (ఫ్లాష్ బ్యాక్) తో, రెండు గంటల నిడివితో వుంటే బావుండేది. ఫస్టాఫ్ గంటకే అయిపోతే, సెకండాఫ్ ఇంకో గంటలో అయిపోతుందనుకుంటాం. గంట గడిచినా కొలిక్కి రాకపోవడంతో వికీపీడియాలో చెక్ చేస్తే, బాంబు లాంటి నిజం – రెండు గంటలా 50 నిమిషాలని!

―సికిందర్