ఎన్నికల ప్రచార డాక్యు డ్రామా (‘ఠాకరే’రివ్యూ)

―సికిందర్
Rating: 2.5./ 5
***

ఈసారి శివసేన పార్టీ దివంగత అధ్యక్షుడు బాలా సాహెబ్ ఠాకరే బయోపిక్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో బాటే ఝాన్సీ లక్ష్మీ బాయి ‘మణికర్ణిక’ కూడా ప్రేక్షకుల్ని పలకరించింది. ఇద్దరి భావజాలాలు వేర్వేరు. ఆమెది ప్రధాన స్రవంతి భావజాలం, ఈయనది సమాంతర అతివాద భావజాలం. జాతీయంగా ప్రధాన స్రవంతి భావజాలాన్ని పక్కన బెడితే, ఈ ఎన్నికల సమయంలో అతివాద భావజాలాన్ని ప్రాంతీయంగా ఉపయోగించుకోవాలని ఎక్కుబెట్టారు. ఇలాటి భావజాలాన్ని మహారాష్ట్ర కిచ్చిన వాడు ఠాకరే. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో ప్రచార చిత్రంగా బయోపిక్ ని తయారుచేసి వదిలారు. ఈ భావజాలంతో సాధించిందేమిటనే ప్రశ్న మద్దతుదార్లకి తట్టకపోవచ్చు గానీ, పరస్పర విరుద్ధ భావజాలాలైన మరాఠా మణూస్ సాకారమైందా? హిందూత్వ లక్ష్యాలు పూర్తయ్యాయా? అన్న ప్రశ్నలుంటాయి. ఇదెలాగో చూద్దాం…

కథ

1950 లలో బాలా సాహెబ్ ఠాకరే ఒక పత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తూంటాడు. తండ్రీ కళారంగంలో పని చేసిన వాడే. తమ్ముడికీ కళలంటే ఆసక్తి వుంది. పత్రికలో వేస్తున్న కార్టూన్లతో తమిళ ఎడిటర్ కి ఇబ్బందులొచ్చి రాజీ పడమంటారు. రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఠాకరే. ఈ సమయంలో బయట తిరుగుతూ మరాఠీలకి ఎదురవుతున్న అవమానాలు గమనిస్తాడు.

సౌత్ ఇండియన్సు, గుజరాతీలు, పార్సీలూ అన్నిరంగాల్లో బొంబాయిని ఆక్రమిస్తూ మరాఠీలకి భుక్తి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం పెంచుకుంటాడు. తమ్ముడితో కలిసి ‘మార్మిక్’ అనే పత్రిక ప్రారంభించి మరాఠా మణూస్ నినాదాన్ని వ్యాప్తి చేస్తాడు. దీంతో బాధిత మరాఠీలు ఠాకరేని ఆశ్రయించడం మొదలెడతారు. తన నినాదానికి ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి, 1966 లో ఛత్రపతి శివాజీ పేరు ధ్వనించేలా శివ సేన పార్టీ స్థాపిస్తాడు.

తనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదనీ, అరాచకమే తన మార్గమనీ ప్రకటిస్తాడు. హక్కుల కోసం బిచ్చ మెత్తుకునే కంటే గూండాల్లాగా మారి హక్కుల్నిలాక్కోవాలని రెచ్చగొడతాడు. దీంతో ప్రాంతీయేతరుల మీద దాడులు మొదలైపోతాయి. ఉడిపి హోటళ్ళు పటాపంచలవుతాయి. గుజరాతీ, పార్సీ వ్యాపారాలు ధ్వంసమవుతాయి. బొంబాయి కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉత్తర, దక్షిణ రాష్ట్రాల అధికారుల, ఉద్యోగుల జాబితాలు తయారు చేసి విడుదల చేస్తాడు.

ఏర్ ఇండియా కార్యాలయం మీదికి దండెత్తి, మరాఠీ ఉద్యోగుల లెక్క చెప్పమంటాడు. మరాఠీ సినిమా విడుదల ఆపి, హిందీ సినిమా విడుదల చేస్తున్న థియేటర్ల మీద దాడులు జరిపిస్తాడు. దేశానికి సినిమా తీయడం నేర్పిందే మరాఠీ వాడైతే, మరాఠీ సినిమాలకే థియేటర్లు దొరకవా అని చావగొడతాడు. పారిశ్రామికంగా యూనియన్లలో పాగా వేసిన లాల్ బందర్లని (ఎర్రకోతుల్ని) చంపెయ్యాలని ప్రకటించడంతో, ఒక కమ్యూనిస్టు ఎమ్మెల్యేని చంపేస్తారు…

ఇంతలో ఠాకరే ఒక సంఘటనని పట్టుకుని దీర్ఘాలోచనలో గార్డెన్ లో పూల మొక్కని ట్రిమ్మింగ్ చేస్తూంటాడు. బ్లాక్ అండ్ వైట్ లో వుండే ఈ దృశ్యంలో ఆ చామంతి పువ్వు కాస్తా కాషాయ వర్ణంలోకి మారుతూంటుంది… విశ్రాంతి.

ఎలావుంది కథ

కథ కాదు, అందుకని సినిమాలా లేదు. ఎన్నికల ప్రచార డాక్యు డ్రామాలాగా వుంది. నిర్మాతలు పార్టీ నాయకులే, దర్శకుడూ ఠాకరే కుటుంబ సన్నిహితుడే. కాబట్టి ఠాకరే కీర్తనలతో ఎన్నికల ప్రచారాస్త్రంగా తీశారు. ఠాకరే జీవితంలోని ఒక్కో ప్రధాన ఘట్టం తేదీలు వేస్తూ డాక్యుమెంటరీ కథనం చేశారు. సినిమా కళ గురించి అస్సలు పట్టించుకోలేదు. సినిమాలాగా తీయకూడదన్న ఒక స్పష్టతతో ఎన్నికల డాక్యూడ్రామాగానే తీశారు కాబట్టి, దీన్ని సినిమా రచనని వెతికే దృష్టితో చూడకూడదు. తెలుగులో ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి ఏం రచన చేస్తున్నారో ఒక స్పష్టత లేకపోవడంతో, అది డాక్యుమెంటరీ కాలేదు, సినిమా కాలేదు సరికదా, రెండో భాగానికి ఉపోద్ఘాతమై కూర్చుంది.

ఐతే ఠాకరే రాజకీయ జీవితాన్ని తేదీలు వేసి క్రొనలాజికల్ ఆర్డర్ లో చూపిస్తున్నప్పుడు, ఇంటర్వెల్ కి ముందంతా మణూస్ గురించి, ఇంటర్వెల్ తర్వాతంతా మణూస్ ని వదిలేసి హిందూత్వ గురించీ చూపించారు. 40 ఏళ్ళు మణూస్ గురించి పోరాడినా, ఎందరో నమ్మి పోరాడిన మరాఠీలు ప్రాణాలు పోగొట్టుకున్నా, ఆ లక్ష్యం సాధించలేదు. ఉన్నట్టుండి హిందూత్వ వాదాన్ని ఎత్తుకుని, హింసాగ్ని రగిలించి, ఇదీ ఏమీ సాధించకుండానే పోరాటం సాగుతూ వుంటుందని చెప్పి ముగించారు.

అతి వాదం ఏదీ సాధించదనీ, సాగదీస్తూనే వుంటుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల కోసమనీ అన్నట్టు చూపించారు. మణూస్ తో మరాఠీయేతరులు వుండరాదని చెప్పి అన్నేళ్ళు పోరాడేక, హిందువులందరూ ఒక్కటే, హిందువులందరూ మతాన్ని కాపాడుకోవడానికి ఏకం కావాలనీ హింసాత్మక హిందూత్వ వాదాన్ని ఎత్తుకున్నప్పుడు, మణూస్ కి అర్ధమేలేకుండా పోయింది. హిందువులందరూ ఒకటే అన్నప్పుడు మరాఠీయేతరులు కూడా మహారాష్ట్రలో వుండొచ్చు. ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. దీని గురించి ఓ మరాఠీ మిత్రుణ్ణి అడిగితే, అక్కడి జనం మణూస్, హిందూత్వా ఒకటేనని అనుకుంటున్నారని చెప్పాడు.

ఎవరెలా చేశారు

ఠాకరే పాత్రలో నవాజుద్దీన్ ఠాకరే సాబ్ ఒడ్డూ పొడవూ లేకపోయినా, బాడీ లాంగ్వేజినీ, ఫేషల్ ఎక్స్ ప్రెషన్స్ నీ అనుకరించడంలో ప్రతిభ కనబర్చాడు. తెరమీద మెస్మరైజ్ చేసే ఈ ఫైనల్ ఫ్రేములు ఎన్ని టేకులు తీసుకుంటే వచ్చాయోగానీ, వీటిని రాబట్టిన దర్శకుడికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి వుంటుంది.

వాయిస్ అనుకరుణని లైట్ తీసుకున్నారు. నవాజుద్దీన్ ఠాకరే లోని శాంతం, క్రోధం, ఆవేశం, అక్కస్సు, ప్రేమ (ఇంట్లో) మొదలైన ఎమోషన్స్ ని చాలా రియలిస్టిక్ గా ప్రదర్శించాడు. నవ్వడం దాదాపూ వుండదు. సంతోషం సంతోషకరమైన ఘట్టాల్లోనూ వుండదు. నిలువెత్తు ఠాకరే ఎలా వుండే వాడో నవాజుద్దీన్ ని చూస్తే తెలిసిపోతుంది. ఠాకరే స్మోకర్, డ్రీంకర్. ఈ దృశ్యాలు విపరీతంగా వుంటాయి. ఇంకే సినిమాల్లోనూ చూడనన్ని చట్ట బద్ధమైన హెచ్చరికలు వరసగా స్క్రోల్ అవుతూనే వుంటాయి.

ఇక మొరార్జీ దేశాయి, మనోహర్ జోషి, రజనీ పటేల్, జార్జి ఫెర్నాండెజ్, యశ్వంత రావ్ చౌహాన్, ఠాకరే సతీమణి మీనా తాయి, ఇందిరా గాంధీ మొదలైన ఇతర పాత్రలు ఆయా సందర్భాల్లో కన్పిస్తాయి. ఇందిరా గాంధీ పాత్ర వేసిన థియేటర్ ఆర్టిస్టు, ఎన్నారై అవంతికా అక్రేకర్ అందరిలోకి బెస్ట్. 1970 ల నాటి ఇందిర పోలికలతో ఆశ్చర్య పరుస్తుంది. దర్శకుడు కూడా ఇందిర తల అలా పైకెత్తి వినే బాడీలాంగ్వేజినే ఎష్టాబ్లిష్ చేస్తూ మిడ్ షాట్స్ తీయడం గొప్ప జస్టిఫికేషన్. ఠాకరే సతీమణి పాత్రలో అమృతరావ్ ఆమె సున్నిత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ చెరిగిపోని ముద్ర వేస్తుంది.

హిందీ, మరాఠీ భాషల్లో విడుదల చేసిన ఈ బయోపిక్ మేకింగ్ క్వాలిటీ చాలా ఉన్నతంగా వుంది. ఫస్టాఫ్ పొడవునా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే బ్లాక్ అండ్ వైట్ దృశ్యాలు కళాత్మకంగా వున్నాయి – కలర్ సినిమాల కంటే బ్లాక్ అండ్ వైటే బెటర్ అన్పించేలా. ఒకప్పటి ‘ఇండియా టుడే’ ప్రఖ్యాత సీనియర్ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ నైపుణ్యపు తెలుపు నలుపు భావ చిత్రాల్లా.1950 లనుంచీ కాలక్రమేణా ముంబాయి అభివృద్ధి చెందుతూ వస్తున్న వివిధ దశల తెలుపు నలుపు దృశ్యాలు కళ్ళకి కట్టినట్టున్నాయి.

సెకండాఫ్ లో కలర్ దృశ్యాలు వస్తాయి. సెట్స్, భవనాలు, ఔట్ డోర్ లొకేషన్స్, బీచి, ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్, మేకప్, నాటి పాతకాలపు మనుషుల్ని పోలిన మనుషులు, వాళ్ళ నాటి బాడీ లాంగ్వేజీలు, భాష, తమిళ తంబిల ఇడ్లీ సాంబార్ సేల్స్, పోటీగా ఠాకరే వడ పావ్ సూపర్ సేల్స్…చెప్పుకుంటే బొంబాయి – ముంబాయిలని కూడా బయోపిక్ చేసి చూపించారు. సినిమాగా ఏ కళ లేకపోయినా, డాక్యు డ్రామాతో చాలా కళాప్రదర్శన చేశారు. రాజకీయ పార్టీ తీసే రాజకీయ సినిమా – లేదా డాక్యు డ్రామా – ఇంత కళాఖండంలా తీయడం అరుదు.

చివరికేమిటి

బాబరీ మసీదు కూల్చివేత, దాంతో ముంబాయి మతకల్లోలాలు – వీటికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఠాకరే పై కోర్టు విచారణతో, 2000 సంవత్సరంలో ప్రారంభమవుతుంది బయోపిక్. ఈ విచారణ మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాకులు 1950 ల నాటి నుంచీ వస్తూంటాయి. ఈ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకుల్లో క్రొనలాజికల్ ఆర్డర్ లో ఠాకరే జీవితంలోని ముఖ్య ఘట్టాలతో కూడిన దృశ్యాలు రన్ అవుతూంటాయి. కోర్టులో ప్రశ్నోత్తరాలకీ, ఈ ఫ్లాష్ బ్యాకులకీ సంబంధమే వుండదు. కేవలం ఈ డాక్యుమెంటరీ మాత్రంగా చూపిస్తున్న బయోపిక్ ని ఏంతో కొంత సినిమాలా అన్పించేట్టు చేసే ప్రయత్నంలో భాగంగానే కోర్టు విచారణని కథగా చేసి జోడించినట్టు తెలుస్తుంది.

‘మహానటి’ లో సావిత్రి జీవితంలో పాత్ర – ఒకే సమస్య -దాంతో సంఘర్షణా అనే సినిమా కథా రూపం సాధ్యం కాక, ఆమె జీవితాన్ని ఫ్లాష్ బ్యాకుల్లో డ్రీమ్ టైము కింద సర్దేసి, రియల్ టైంలో ఆ జీవితాన్ని తెలుసుకునే జర్నలిస్టుల సంఘర్షణ అనే సినిమా కథా రూపంతో గోడ చేర్పు నిచ్చినట్టు – ఠాకరే బయోపిక్ విషయంలో కూడా కోర్టు విచారణ అనే రియల్ టైం లైవ్ కథతో, ఠాకరే జీవితాన్ని డ్రీమ్ టైం కింద డాక్యుమెంటరీ చేశారు. అయితే ఈ కోర్టు విచారణ కథేనా అంటే కాదు.

కోర్టు అడిగేది అడుగుతుంది, ఠాకరే చెప్పేది చెప్పేసి వెళ్ళిపోతాడంతే. అయితే ప్రచార సాధనంగా తప్పనిసరిగా డాక్యుమెంటరీ చేయాల్సి వచ్చిన బయోపిక్ డ్రీమ్ టైమ్ కి, గంతకి తగ్గ బొంత అన్నట్టు, ఏదోవొక రియల్ టైమ్ ని జోడించి తీయలాన్న తెలివితేటలైనా ప్రదర్శించినందుకు సంతోషించాలి. కంటెంట్ ఎలా వస్తోందో తెలుసుకోకుండా పైపైన టెక్నికల్ ఆర్భాటాలు చేసి వూదరగొడితే ఏం లాభం.

ఈ కోర్టు విచారణ ఒక్కో దృశ్యంలో ఒక్కో డైలాగు పేలుస్తూంటాడు ఠాకరే. బాబరీ మసీదుని కూల్చలేదని, అక్కడ శుభ్రం చేశామనీ అంటాడు. తనది ప్రజాతంత్ర కాదని, ఠోక్ తంత్ర (చావబాదుడు సిద్ధాంతం) అనీ అంటాడు. మతకల్లోలాలు తాను జరిపించలేదనీ, వెంటనే ప్రజల్లోకి వెళ్ళాననీ అంటాడు ( ఏఏ ప్రజల్లోకి వెళ్ళాడో చెప్పడు. ఫ్లాష్ బ్యాకు దృశ్యాల్లో ముస్లింల నుద్దేశించి, తనకి మతాలతో పేచీ లేదనీ, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళ తోనే పోరాటమనీ అంటాడు. అలాంటప్పుడు హిందూ ముస్లిం ప్రజలందర్లోకి వెళ్లానని చెప్పాలి, చెప్పడు).

చివరికి మీకే శిక్ష వేయాలని జడ్జి అడిగితే, తను న్యాయవ్యవస్థని నమ్మనంటాడు. ప్రజాతీర్పునే గౌరవిస్తానని వెళ్లిపోతూంటాడు ప్రజల్లోకి. నమ్మనప్పుడు కోర్టు కెందుకొచ్చాడో, రాజకీయ నాయకుడిగా ఎందుకున్నాడో తెలీదు. తమ నాయకుడి అడ్డగోలు తనాన్ని గర్వంగా చూపించుకోవడానికి ఎక్కడా వెనుకాడలేదు ఈ బయోపిక్ రూపకర్తలు. అడ్డగోలు తనాన్ని గ్లామరైజ్ చేసి చూపించారు.

కానీ కోర్టులో ఇదంతా జరగలేదు. కేసు దాఖలు చేయడంలో జాప్యం వల్ల, లిమిటేషన్ చట్టం కింద అనర్హంగా ప్రకటించి కొట్టేసింది కోర్టు.
ఫ్లాష్ బ్యాక్ దృశ్యాలు ఫస్టాఫ్ లో మహారాష్ట్ర మణూస్ పాయింటుతో నడుస్తాయి. ఈ ప్రారంభంలో కాస్త ఎంటర్ టైన్ చేస్తాడు దర్శకుడు. కార్టూనిస్టుగా రాజీనామా చేసి బొంబాయిలో మరాఠీల పరిస్థితి చూస్తూ తిరుగుతున్నప్పుడు ఒక సినిమా చూస్తాడు ఠాకరే. అది మరాఠీలని బకరాలని చేసి ఆడుకునే కార్టూన్ ఫిలిం. థియేటర్లో అన్ని వర్గాల ప్రేక్షకులూ ఒకటే నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. కార్టూన్ ఫిలింలో సర్దార్జీ, గుజరాతీ, మద్రాసీ, ఆఖరికి కాబూలీ వాలా కూడా బక్క మరాఠీలని పీకి అవతల పడేస్తూంటారు. వెనకనుంచి వికటాట్టహాసం చేస్తూ ఒక్క కిక్ ఇస్తే వెళ్లి అంత దూరంలో పడతాడు మరాఠీ. ఠాకరే సీరియస్ గా చూస్తాడు కార్టూన్ ఫిలింని.

ఇక్కడ్నుంచి మొదలు పెడతాడు మరాఠా ఆత్మగౌరావ పోరాటం. పత్రిక పెట్టి భావవ్యాప్తి చేస్తాడు. మొదటి కార్యక్రమంగా కర్ణాటకలో కలిపిన బెల్గాంని తిరిగి మహారాష్ట్రలో కలపాలని ఆందోళన చేస్తాడు. ప్రధాని మొరార్జీ దేశాయ్ కాన్వాయ్ కి ఆందోళనాకారులు అడ్డంపడతారు, గాయపడతారు, చనిపోతారు. అక్కడే నిలబడి చూస్తూంటాడు. అరెస్టయి జైలు కెళ్తే భగ్గుమంటుంది నగరం. కాల్పుల్లో మరికొందరు చనిపోతారు. అల్లర్లు ఆపడానికి ప్రభుత్వం మళ్ళీ అతన్నే వేడుకుంటుంది.

కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శాసించే బలమైన నాయకుడవుతాడు పార్టీ పెట్టి. తను హిట్లర్ నని ప్రకటించుకుంటాడు.ఇక మరాఠీలఅవకాశాల కోసం ప్రవాసుల్ని తరిమే కార్యక్రమం ఇంకోవైపు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తూ ఠాకరేకి నోటీసిస్తుంది – ఎమర్జెన్సీని సమర్ధించకపోతే పార్టీని బ్యాన్ చేస్తామని. దేశంలో క్రమశిక్షణకి ఎమర్జెన్సీ ఎంతో మంచిదని సమర్ధిస్తాడు. తనకి ముందు దేశం, ఆ తర్వాతే రాష్ట్రమని ఇందిరతో చెప్తాడు. ఇందిర బ్యాన్ లిస్టు లోంచి ఠాకరే పార్టీ పేరు కొట్టేస్తుంది.

రాష్ట్రంలో మణూస్ ఉద్యమం తలనొప్పులు తెస్తుంది ప్రభుత్వానికి (ఇంత మణూస్ అంటున్న బయోపిక్ లో నవాజుద్దీన్ సహా నటీనటులు, సాంకేతికులు 90 శాతం బయటి రాష్ట్రాల వాళ్ళే). కొన్నేళ్ళ తర్వాత అప్పుడు ఆలోచించి, “మన పిల్లలు చదువుల్లో రాణించాలి. పెద్ద చదువులు చదివితే పెద్ద ఉద్యోగాల్లో పోటీ పడవచ్చు. బయటి వాళ్ళని ఇలా దెబ్బ కొట్టాలి. ఇడ్లీ సాంబార్ కి పోటీగా వడ పావ్ ప్రారంభించండి. ఎందరికో ఉపాధి లభిస్తుంది …” ఇలా అనడం మొదలెడతాడు. దీంతో ప్రజలు ఈ మార్గం పడతారు. ఇదేదో ముందే చెప్పొచ్చుగా?

ఇక ఇంటర్వెల్ ముందు కమ్యూనిస్టు ఎమ్మెల్యేని చంపాక, ఠాకరే మొక్కని కత్తి రిస్తున్నప్పుడు పువ్వు కాషాయంగా మారుతుంది. ఇక హిందూత్వ నాయకుడిగా మొదలు.

***

ఒక మొహర్రం వేడుకలో పాల్గొని ప్రసగించినప్పుడు, తనకి మతాలతో పేచీ లేదనీ, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే పోరాటమనీ అంటాడు. అందుకని మీరంతా శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొనాలని అంటాడు. ఇప్పుడే కాదు, మణూస్ ఉద్యమంలో కూడా మరాఠా ముస్లిములు కనిపిస్తారు. ఇప్పుడీ శివాజీ జయంత్యుత్సవాల్లో ఉత్సాహంగా ఆడిపాడతారు. ఇంతలో వేడుకల్లో అల్లర్లు జరుగుతాయి. దుండగులు హింసకి పాల్పడతారు.

అప్పుడు వెంటనే ఠాకరే ముస్లిం వ్యతిరేకిగా మారిపోతాడు- “ఎప్పుడెప్పుడు వీళ్ళని మనం దగ్గరికి తీసినా వీళ్ళు మన గొంతులు కోస్తున్నారు. వీళ్ళు మారరు. మీరింకా పిరికి పందల్లా బ్రతకకండి. ఓట్ల కోసం ఇంత దిగజారుడా? ఇవాళ్టి నుంచి హిందువుల గురించి మాట్లాడేవాడే హిందూస్తాన్ రాజ్యమేలుతాడు” అని ప్రసంగించి హిందూత్వ వాదిగా, ‘హిందూ హృదయ సామ్రాట్’ గా మారిపోతాడు. నాయకత్వం లేని ముస్లిములనీ, మణూస్ నీ వదిలేస్తాడు.

తర్వాత బాబరీని కూల్చితే కూల్చాడు, శివాజీ వేడుకల్లో ముస్లిం దుండగులెవరో అల్లర్లు జరిపారని ముస్లిములనే వదిలేయకుండా వుంటే, బాబరీ కూల్చివేతకి వాళ్ళు తనకి వ్యతిరేకంగా మారి, ముంబాయిలో ప్రతీకార దాడులు జరిపే వాళ్ళు కాదు. దీనికి ప్రతీకారంగా తనూ మత కల్లోలాలు జరిపించేవాడు కాదు. మళ్ళీ దీనికి ప్రతీకారంగా దావూద్ ఇబ్రహీం ముంబాయిలో పేలుళ్లు జరిపే వాడు కాదు. ఈ మొత్తాన్నీ తీసుకుని దేశంలో టెర్రరిజం ప్రబలేది కాదు.

విచిత్రమేమిటంటే, తనకి మతాలతో పేచీ లేదనీ, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే పోరాటమనీ అన్నవాడే, శివాజీ వేడుకల్లో అల్లర్ల సాకుతో అవతలి మతానికి పూర్తి వ్యతిరేకంగా మారిపోవడం. తన అతివాదానికి, అవతలి మతంలోని అతివాదులు రియాక్టయినప్పుడు అలాటి – ‘మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే పోరాటం’ మొదలెట్టాలి తను అన్న మాట ప్రకారం. ప్రజలకేం సంబంధం. ముస్లిములు తన వెంటే వున్నారు. వాళ్ళెప్పుడు గొంతులు కోశారు.

(ఠాకరే చనిపోయేవరకూ వైద్యుడు ముస్లిమే, గొంతు కోయలేదు. యోగి ఆదిత్యా నాథ్ వూళ్ళో గోవుల్నిచూసుకునేదీ, ఆయనకి వండి పెట్టేదీ, ఆలయం నిర్మించిందీ, దాన్ని నిర్వహిస్తున్నదీ ముస్లిములే. గొంతు కోయలేదు. అదే ముస్లిములని ప్రభుత్వ స్థానాల్లో వుండనివ్వడు. బయటికి మాత్రం తను ముస్లిం వ్యతిరేకి హిందూ ఫ్యాన్స్ కోసం. సూడో సెక్యూలరిజం సరే, ఇటు వైపు సూడో హిందూత్వం కూడా).

గొంతులు అతివాదులు కోస్తారేమో. అదికూడా వాళ్ళతో చెలిమి చేసినప్పుడు. అతివాదులు వర్సెస్ అతివాదుల క్రీడలో పరస్పరం ఎన్నైనా గొంతులు కోసుకోవచ్చు. ఈ క్రీడతో ప్రజలకేం సంబంధం. చేతకాని అతివాదం పెట్టుకుని, ఒక వర్గం మొత్తాన్నీ జనరలైజ్ చేసి ముద్ర కొట్టడం. ప్రజాస్వామాన్ని, సెక్యులరిజాన్ని నమ్మని ఠాకరే, నమ్మిన అతి వాదంతో కూడా సవ్యంగా లేనట్టు, మణూస్ నీ, హిందూత్వానీ ఓట్ల కోసం వాడుకున్నట్టూ ఓపెన్ గానే చూపించారు.

ఈ ప్రచార బయోపిక్ ని స్ట్రక్చర్ పరంగా సినిమా రచనా దృష్టితో చూడకూదనుకున్నాం. ఇది స్ట్రక్చర్ తో సంబంధంలేని పాత్ర చిత్రణ సమస్య. మళ్ళీ చివర్లో బాంబు పేలుళ్ళ తర్వాత ఠాకరే ఇంకో డ్రామా చేస్తాడు. అన్నీ పోగొట్టుకున్న ఒక ముస్లిం కుటుంబం రక్షణ కోసం తన దగ్గరికి వస్తుంది. వాళ్ళని ఇంట్లో కూర్చో బెట్టుకుని అభయమిస్తాడు. నమాజ్ చేసుకోనిస్తాడు. అప్పుడు “మతాలతో నాకు పేచీ లేదు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళతోనే నా పోరాటం” – అదే రికార్డు ప్లే!

 

పరస్పర విరుద్ధ భావాలతో, హింసతో, అడుగడుగునా ధిక్కారంతో, గొప్ప నాయకుడుగా దిగ్విజయంగా హైలైట్ చేశారు.

———-

దర్శకత్వం : అభిజిత్ పన్సే
నవాజుద్దీన్ సిద్ధిఖీ, అమృతారావ్ తదితరులు
స్క్రీన్ ప్లే : అభిజిత్ పన్సే,
రచన : అరవింద్ జగ్తాప్,
మాటలు : మనోజ్ యాదవ్
సంగీతం : రోహన్ రోహన్, సందీప్ శిరోద్కర్,
ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ
బ్యానర్స్ : వయాకాం మోషన్ పిక్చర్స్, రాయిటర్స్ ఎంటర్ టైన్మెంట్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్
విడుదల : జనవరి 25, 2019