―సికిందర్
Rating: 3 / 5
రోమాంటిక్ కామెడీలు, రోమాంటిక్ డ్రామాలు రొటీన్ అయిపోయిన ట్రెండ్ లో హోమోలవ్ చూపించే బోల్డ్ మూవీ వచ్చింది. అదికూడా స్టార్స్ తో. పైగా హోమ్లీగా. బోల్డేమిటి, హోమ్లీ ఏమిటీ అని డౌట్ రావచ్చు. ఇదే ప్రత్యేకత. బోల్డ్ తో చేసిన మెయిన్ స్ట్రీమ్ ప్రయోగం. ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’(ఒకమ్మాయిని చూస్తే నాకెలా అన్పించిందంటే) అని. ఈ టైటిల్ పాత పాట పల్లవే (‘1942 – ఏ లవ్ స్టోరీ’, 1994) అనిల్ కపూర్ హీరోగా, విధు వినోద్ చోప్రా సినిమానే. మళ్ళీ ఇద్దరూ ఇప్పుడు సోనమ్ కపూర్ , రాజ్ కుమార్ రావ్ లతో, కొత్త దర్శకురాలితో, ఈ సాహస ప్రయోగం చేశారు. ఇదెలా వుందో చూద్దాం…
కథ
స్వీటీ (సోనమ్) అనే అమ్మాయి పంజాబ్ లోని మోగాలో బల్బీర్ చౌదరి (అనిల్ కపూర్) అనే గార్మెంట్స్ ఫ్యాక్టరీ యజమాని కూతురు. బబ్లూ (అభిషేక్ దుహన్) ఆమె అన్న. ఇంకా ఇంట్లో నానమ్మ, ఇద్దరు పనివాళ్ళూ వుంటారు. ఆమె రహస్యంగా ఢిల్లీ వెళ్లి వస్తూంటుంది. బబ్లూ ఫాలో అయి కనిపెడుతూంటాడు.
సాహిల్ మీర్జా (రాజ్ కుమార్ రావ్) ఒక సినిమా నిర్మాత కొడుకు. నాటకాల పిచ్చితో నాటక కంపెనీలో వుంటాడు. ఒక రోజు ఢిల్లీ వచ్చిన స్వీటీని బబ్లూ పట్టుకోబోతే తప్పించుకుని నాటక రిహార్సల్స్ లో దూరిపోతుంది. బబ్లూతో పోరాడి ఆమెని రక్షిస్తాడు సాహిల్. ఆమె వూరెళ్ళి పోయాక, ఆమెని చూసి ప్రేమలో పడ్డ సాహిల్ ఆమె వూళ్ళో మకాం వేస్తాడు. సాహిల్ మతం వేరని బబ్లూ ఇంట్లో గొడవపడతాడు. తండ్రి బల్బీర్ చౌదరి స్వీటీకి సంబంధాలు చూడ్డం మొదలెడతాడు. పెళ్లి ఇష్టం లేని స్వీటీ ఈ విషయం సాహిల్ కి చెప్తుంది. తను లెస్బియన్ అనీ, ఢిల్లీలో కుహూ (రేజీనా) అనే అమ్మాయితో రిలేషన్ షిప్ లో వున్నాననీ అంటుంది.
సాహిల్ బుర్ర తిరిగిపోతుంది. ఇక ఆమె మీద ప్రేమని చంపుకుని, ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. స్వీటీ లెస్బియన్ సమస్యని ఇంట్లో తీర్చి, ఆమెని కుహూతో అంగీరించేలా చేసేందుకు ఓ ప్లానేస్తాడు. ఏమిటా ప్లాను? ఈ సమస్యతో ఇంట్లో ఎలాటి సంక్షోభం ఏర్పడింది? ఈ సంక్షోభాన్ని నాటకాన్ని ప్రదర్శించి ఎలా పరిష్కరించాడు సాహిల్?…ఇవీ మిగతా కథలో తేలే విషయాలు.
ఎలావుంది కథ
బోల్డ్ కథ ఉద్దేశపూర్వకంగా ఓల్డ్ గా వుంది. ఇలాటి బోల్డ్ కథ ఇరవై ఏళ్ల క్రితం దీపా మెహతా బోల్డ్ గానే తీసింది. ‘ది ఫైర్’ అని షబనా అజ్మీ, నందితా దాస్ లు జంటగా నటించారు. దాన్ని ఆ లైంగిక ప్రవృత్తిని ప్రధానంగా చేసి అలాటి దృశ్యాలతో చూపించారు. దాంతో దాడులు జరిగాయి. ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడీ బోల్డ్ తో దాడుల్లేవు, బేడీల్లేవు. అలాగని స్వలింగ సంపర్కాన్ని సుప్రీం కోర్టు ఆమోదించింది కదాని, దీన్ని ‘ఎ’ సర్టిఫికేట్ సినిమాగా తీసి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశం కనపడదు. దీనికి పెద్ద ధైర్యం అవసరం లేదు. ఇలాటి బోల్డ్ కథని మెయిన్ స్ట్రీమ్ సినిమాగా తీసి, కుటుంబ సినిమాగా కుటుంబ ప్రేక్షకుల్లోకి తీసికెళ్ళడానికే ధైర్యం కావాలి.
ఆ ధైర్యమే ఈ బోల్డ్ ఈజ్ ఓల్డ్ ఉద్దేశపూర్వక ప్రయోగం. స్వలింగ సంపర్కం చట్టబద్ధమయ్యాక ఇంకా ఆ లైంగిక ప్రవృత్తి వున్న ‘ఎల్జీబీటీక్యూ’ వర్గాలతో తిరుగుబాట్ల కథలు చూపించకుండా, ఈ తీర్పుతో ఇలాటి సమస్య నెదుర్కొంటున్న కుటుంబాల పరిస్థితేమిటన్నకోణంలో ఓ ప్రయత్నం చేసిందీ కొత్త దర్శకురాలు. అందుకని ఈ బోల్డ్ కథని కుటుంబాలకి దగ్గరయ్యేలా ఓల్డ్ ఫ్యాషన్డ్ గానే, సున్నితంగానే చెప్పింది.
కానీ చివర్లో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు వుంది. అంతా సుఖాంతమయ్యాక – నువ్వీ నాటకాన్ని ఊరూరా తిప్పి, చిన్నప్పట్నుంచీ ఈ సమస్యతో సతమతమవుతున్న తన లాంటి వాళ్లకి ధైర్యం కల్పించమని హీరోయిన్ చెప్తుంది హీరోతో. ఈ కథలో హీరోయిన్ చిన్నప్పుడే తనలో మార్పు గమనిస్తుంది. ఇలాటి చిన్నపిల్లలు తనలాగా సిగ్గుపడకుండా బ్రతికేలా ఎడ్యుకేట్ చేయమని ఆమె ఉద్దేశం.
జనాభాలో 2 .5 శాతంతో అరుదుగా వుండే ఈ జీవనశైలిని నాటకాలేసి ఎడ్యుకేట్ చేస్తే, ఇదేదో బావుందని ఇలాటి బుద్ధిలేని బుల్లెమ్మలు కూడా బోల్డుగా ఇందులోకి దిగిపోతే? ధూమపానం మంచిదే, మీరు కూడా తాగొచ్చు అనడంలా వుందిది.
ఎవరెలా చేశారు
ఇందులో అసభ్యతకి, అశ్లీలానికీ చోటు లేదు. సోనమ్, రెజీనాల జోడీ ఫ్రెండ్స్ లాగానే కన్పిస్తారు. వాళ్ళు లెస్బియన్స్ అని ఒకసారి చెప్పి వదిలేస్తారు అలాటి సీన్లుగానీ, డైలాగులు గానీ వాళ్ళ మధ్య వుండవు. మహా అంటే చేతులు పట్టుకోవడం, హగ్ చేసుకోవడం చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి కనిపించే సీన్లు కూడా అయిదారుకి మించి వుండవు. పాయింటు లెస్బియన్ కల్చర్ ని చూపించడం కాదు, ఈ పాయింటుతో కుటుంబపు రప్చర్ ని చూపించడమే. ఈ ఫోకస్ ని ఎక్కడా చెదరనివ్వలేదు. నటీమణులిద్దరూ ఈ ఫ్యామిలీ కథలో ప్రేక్షకుల్ని అఫెండ్ చేయకుండా, ఫ్యామిలీ కథల్లో ఇమిడిపోయే మెలో డ్రామాతో సానుభూతిని రాబట్టుకుంటారు.
నాటక దర్శకుడుగా రాజ్ కుమార్ రావ్ ఎప్పట్లానే ఫన్నీ యాక్టింగ్. ఇద్దరమ్మాయిల ప్రేమని కుటుంబ సభ్యులతోనే వూళ్ళో నాటకంగా వేయించి, ప్రేక్షకులందరి సమక్షంలో సమస్యని పరిష్కరించి పారేస్తాడు. హృదయాల్ని పిండేసే ఈ మెలోడ్రామాకి ప్రేక్షకులు కరిగిపోయి (అంటే వూళ్ళో జనం) ఇద్దరమ్మాయిల సహజీవనాన్ని కాదనలేకపోతారు. ఈ నాటకం రోమియో జూలియెట్ నాటకంలాగే వుంటుంది. అద్దాల గదిలో బందీ అయిన సోనమ్ కపూర్, తనని బయటికి తీయమని తండ్రిని వేడుకోవడం అనార్కలీ కథలా కూడా వుంటుంది. రాజ్ కుమార్ రావ్ బంపర్ నాటకాన్ని రచిస్తాడు. తనని కొట్టకుండా ముందే ప్రకటిస్తాడు – ఈ నాటకాన్ని హృదయంతో చూడాలనీ, బుర్రతో చూసి రెచ్చిపోయి రాళ్ళు చ్చుకోవద్దనీ.
ఈ మొత్తం ఫ్యామిలీ డ్రామాలో ఫార్ములా ప్రకారం అనిల్ కపూర్ తండ్రి పాత్రే (నిజజీవితంలో కూడా సోనమ్ తండ్రే) సంఘర్షణాత్మక పాత్ర. కూతుర్ని పల్లెత్తు మాటనకుండా, అర్ధంజేసుకునే ప్రయత్నంతో, తనే చాలా తప్పు చేశాడన్న అపరాధభావంతో, సమస్యతో సర్దుకు పోవాల్సిన అవసరంతో – ఇలా మూడు షేడ్స్ తో పాత్రని నిలబెడతాడు. చివరికి అన్నీ పక్కన బెట్టి – ఇదికూడా ప్రేమే కదా – అని హుషారుగా అంగీకరిస్తాడు.
రాజ్ కుమార్ రావ్ వెంట వచ్చే నాటక కంపెనీ కుక్ గా జుహీచావ్లాది హాస్య పాత్ర. తన బ్రాండ్ నవ్వు మొహంతో సీన్లని కాంతివంతం చేస్తూంటుంది. పనిలోపనిగా భార్య లేని అనిల్ కపూర్ తో ఫ్లర్టింగ్. తనకి భర్త విడాకులిచ్చాడు, పిల్లలు ఎదిగి వాళ్ళ ఇష్టప్రకారం జీవించడానికి వెళ్ళిపోయారు, ఇన్నాళ్ళూ వాళ్ళకోసం తను జీవించింది, ఇప్పుడు తన కోసం తాను జీవిస్తానని హల్చల్ చేస్తూంటుంది. పిల్లల్ని పట్టి వుంచకూడదని, వదిలెయ్యాలనీ ఆమె చెప్పే సూక్తి అనిల్ కపూర్ మీద బాగా పనిచేస్తుంది. చివరికిలా ముగుస్తుంది – నాతో పార్టనర్ షిప్ చేస్తావా? – అంటాడు. ఎలాటి పార్టనర్ షిప్, ప్రొఫెషనలా? పర్సనలా? – అంటుంది.
హీరోయిన్ అన్న పాత్రలో కొత్త నటుడు అభిషేక్ దుహన్ పైకొచ్చే పోకడలున్నాయి. రాజ్ కుమార్ రావ్ ఇంట్లో చేరి భ్రష్టు పట్టిస్తున్నాడనే కోపంతో రెండుసార్లు అతణ్ణి తన్నే పాత్రకూడా. నాటకాన్ని కూడా చెడగొట్ట బోతాడు.
ఫీల్ గుడ్ పాత్రలతో, ఫీల్ గుడ్ నటనలతో ఒక విషమ సమస్యని సానుకూల ధోరణికి మార్చేస్తుంది దర్శకురాలు.
చివరికేమిటి
ఈ బోల్డ్ కాన్సెప్ట్ లో ఏ కోణం మీద ఫోకస్ చేయాలో ఆ కుటుంబ కోణం పట్టుకుని ఆ కుటుంబ ప్రేక్షకుల్లోకి తీసికెళ్ళాలన్న మార్కెట్ యాస్పెక్ట్ మంచిదే. కానీ 1500 థియేటర్లలో రిలీజ్ చేసినా 3.30 కోట్లకి మించి రాలేదు మొదటి రోజు. మెయిన్ స్ట్రీమ్ సినిమాగా తీసినా ఆ ఫ్యామిలీ ప్రేక్షకులే లేరు. ఎంత ఫ్యామిలీగా ఎంటర్ టైన్ చేసినా ఇలాటి అసహజ ప్రేమలు ఛీథూనే.
హీరోయిన్ చిన్నప్పటి జీవితం వుంటుంది. పిల్లలతో కలవకుండా ఎప్పుడూ ఒంటరిగా వుంటూ, ఏవో భావాలు రాసుకుంటూ, అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు బొమ్మలేసుకుంటూ, పూర్తి ఇంట్రోవర్ట్ గా పెరుగుతుంది. తండ్రి తెలుసుకునేటప్పటికి చేయిదాటి పోతుంది. చిన్నప్పట్నుంచీ ఈమె మానసిక లోకాన్ని నేను తరచి చూడలేదే అన్న అపరాధభావం వెన్నాడుతుంది.
ఇదే, ఈ ఛీథూ అన్పించే సినిమాతో కళ్ళు తెరవాల్సిన నివురు గప్పిన నిజం. ఛీథూ అన్పించే పరిస్థితి ఇంట్లోనే మొలకెత్తుతోందేమో కన్నేసి వుంచుకోవాలి. మొక్కగా వున్నప్పుడు వంచొచ్చు, మానయ్యాక కరెంటు షాకులే షాకులు. ఈ సినిమాని ఛీథూ అనుకుని అనిల్ కపూర్ పాత్రలో హెచ్చరికని మిస్సయితే, రేపెప్పుడో ఇంట్లోనే ఛీథూ! అరుదైన 2.5 శాతమే కదాని కాదు. ఈ 2.5 శాతం మరణాలతో ఖాళీ అవుతూండగా మళ్ళీ జననాలతో భర్తీ అవుతూ వుంటుంది…అలాటి జననాలు ఎక్కడైనా సంభవించవచ్చు.
దర్శకత్వం ; షెల్లీ చోప్రా ధార్
తారాగణం : రాజ్ కుమార్ రావ్, సోనమ్ కపూర్, అనిల్ కపూర్, జుహీ చావ్లా, రేజీనా కాసాండ్రా తదితరులు
రచన : షెల్లీ చోప్రా ధార్, గజల్ దహీవాల్, సంగీతం : రోచాక్ కోహ్లీ, ఛాయాగ్రహణం : హిమాన్ ధమీజా, రంగరాజన్ రామ్ భద్రన్
బ్యానర్ : వినోద్ చోప్రా ఫిలిమ్స్
నిర్మాత : విధు వినోద్ చోప్రా
విడుదల : ఫిబ్రవరి 1, 2019