—సికిందర్
సీరియల్ గా విడుదల వాయిదా పడుతూ ఇవాళ విడుదలైంది రాంగోపాల్ వర్మ ‘భైరవ గీత’. ఆయన శిష్యుడు సిద్ధార్థ్ దర్శకత్వంలో తెలుగు – కన్నడ భాషల్లో నిర్మించిన ఈ రాయలసీమ ఫ్యాక్షన్ యాక్షన్ కి, లిప్ లాక్ సీన్లతో పబ్లిసిటీ ఇచ్చి ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఫ్యాక్షన్ కి ప్రేమని జోడిస్తూ వర్గపోరాట సామాజిక కథగా కూడా చేశారు. మరి ఈ వర్గపోరాట సామాజిక కథని ప్రేమ కథతో ఎలా చెప్పారో ఒకసారి చూద్దాం…
కథ
భైరవ (ధనంజయ్) రాయలసీమ భూస్వామి సుబ్బారెడ్డి (బాలరాజ్ వాడీ) దగ్గర బానిసలా పని చేస్తూంటాడు. సుబ్బారెడ్డి కూతురు గీత (ఇరా మోర్) ని చూసి ప్రేమలో పడతాడు. ప్రత్యర్థులతో ఒక ప్రమాదకర పరిస్థితి నుంచి గీతని కాపాడడంతో ఆమె అతనంటే ఇష్టపడుతుంది. ఇంతలో కట్టారెడ్డి (విజయ్ రామ్) అనే ఫ్యాక్షనిస్టుతో గీతకి సంబంధం కుదురుతుంది. ఈ సందర్భంగా ఆమె కట్టారెడ్డి చెంప వాయిస్తుంది. ఇక భైరవనే పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తుంది. దీంతో ఆమె తండ్రి భైరవ మీద పగబడతాడు. గీతని తీసుకుని భైరవ పారిపోతాడు. వాళ్ళ మీదికి సుబ్బారెడ్డి ముఠాని ఎగదోస్తాడు. ఇక భైరవ, గీతతో ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడి, సీమలో సుబ్బారెడ్డి, కట్టారెడ్డి, ఇంకో కేశవరెడ్డి (భాస్కర్ మన్యం) దురాగతాల్ని ఎలా అంతమొందించాడనేది మిగతా కథ.
ఎలావుంది కథ
1991 లో జరిగిన నిజ కథ అన్నారు వాయిసోవర్ లో రాంగోపాల్ వర్మ. రాయలసీమలో తరతరాల బానిస సంకెళ్ళు తొలగిపోవడానికి ఓ ప్రేమకథ మూలమైందన్నారు. దీని ఆధారాలు చెప్పలేదు. ఆ ప్రేమకథే ఈ ‘భైరవ గీత’. కులం కాకుండా మెరిట్ ఆధారంగా మనుషుల్ని సమానంగా చూడాలని చెప్పే ఈ కథని పాత విప్లవ ఎర్ర సినిమాల తీరులో చెప్పారు. ప్రేమ కథ ‘జయం’ని గుర్తుకు తెస్తే, తిరుగుబాటు ‘యజ్ఞం’ ని గుర్తు చేస్తుంది. ఇలాటిదే బానిసల కథ దర్శకుడు స్వయంగా చిన్నప్పుడు అనుభవించింది, కొంకణి భాషలో ‘జూజే’ (2017) గా వచ్చి, అంతర్జాతీయ అవార్డులందుకుంది. నిజ కథ అంటున్న ‘భైరవగీత’లో బానిసల కథని మూసఫార్ములా ధోరణిలో వచ్చిన సినిమాలనే గుర్తుకు తెస్తూ సినిమాటిక్ గా చెప్తే, గోవాలో దర్శకుడు అనుభవించిన వాస్తవ కథ ‘జూజే’ ని వాస్తవికతకి దగ్గరగా, అసలు బానిసల విముక్తి ఎలా జరుగుతుందో అర్ధవంతంగా చూపించారు. ‘భైరవ గీత’లో విప్లవానికి ప్రేమకథ మూలమైతే, ‘జూజే’ లో సెక్సువల్ హెరాస్ మెంట్ మూలమవుతుంది. అయితే ‘భైరవగీత’ కథ పాయింటు తప్పి ఇంకెటో వెళ్ళిపోయిన కథగా చతికిలబడింది. మొదలెట్టిన విషయం ఒకటైతే, ముగించిన విషయం మరొకటి. పైగా ఇప్పుడు లేని ఫ్యాక్షన్ కి ‘అరవింద సమేత’ లో శాంతి మంత్రం చెప్పడమెలా వుందో, ‘భైరవగీత’ లో కాలం చెల్లిన బానిసల విముక్తి చూపడం కూడా అలావుంది.
ఎవరెలా చేశారు
హీరోహీరోయిన్లు ధనుంజయ్, ఇరా లిద్దరూ కెమిస్ట్రీ లోపించిన ప్రేమకథలో తేలిపోయారు. ఇద్దరి నటనలూ బాగానేవున్నా పాత్రచిత్రణలు బలహీనంగా వున్నాయి. లిప్ లాకులతో లవ్ స్టోరీని కవర్ చేయాలనుకున్నాడేమో దర్శకుడు, అవి వర్కౌట్ కాలేదు. ప్రేక్షకులు కూడా నవ్వుతున్నారు. మొన్నే ‘24 కిసెస్’ లో కూడా ముద్దు సీన్లతో మొహం మొత్తింది. ఇంకా మత్తెక్కిపోతూ చూసే పరిస్థితిలో ప్రేక్షకులులేరు. ముద్దులు కాదు కావాల్సింది, లవ్ స్టోరీలో నేటి కాలపు ఇంటెన్సిటీ.
దొరలుగా నటించిన విలన్ల నటన అతి హింసతో కూడుకుని వుంది. ఈ హింసని చూడాలంటే దమ్ములుండాలి. బానిసని తగులబెట్టి చంపే సీను, బానిసని నరికి చంపే సీను, హీరో తల్లిని కొట్టి చంపే సీను… ఇలా చాలావుంది విలన్ల పైశాచికత్వం.
పాటలు కొన్ని పాత పాటల వరసల్ని కలిపి కొట్టేశారు. హీరోహీరోయిన్ల మీద ‘ఏదో ఏదో ఇది’ సాంగ్ ని ‘పిడుగు రాముడు’ లో ‘ఏమో ఏమో ఇది’ లోంచి ఎత్తేశారు. హీరోహీరోయిన్ల మీద ఎరోటిక్ సాంగ్ ని వర్మ తీసిందే ‘రంగీలా’ లో ‘తన్హా తన్హా’ నుంచి లేపేశారు. హీరో తల్లి చనిపోయాక వచ్చే శాడ్ సాంగ్ ని, కమల్ హాసన్ ‘నాయకుడు’ లో ‘ఎవరు కొట్టారే’ నుంచి కాపీ కొట్టేశారు.
కెమెరా వర్క్ లో మొదట వుండే యాంగిల్స్ పావు గంట తర్వాత వుండవు. స్టడీ షాట్స్ కొచ్చేస్తాయి సీన్లు. అవుట్ డోర్ లొకేషన్స్ ఫ్యాక్షన్ నేటివిటీకి తగ్గట్టున్నాయి. వీటికి డ్రోన్ షాట్స్ కూడా తీశారు.
నటనలు, సంగీతాలు, సాంకేతికాలు, హింసా ఎలావున్నా, కొత్త దర్శకుడు కథ దగ్గరే పొరపాట్లు చేశాడు. ఏం కథ చెప్పాలనుకున్నాడో తనకే స్పష్టత లేకపోతే ప్రేక్షకులేం అర్ధంజేసుకుని చూస్తారు. ఇది ప్రేమ కథా, బానిసలా కథా? ప్రేమ కథని బానిసల బ్యాక్ డ్రాప్ లో నడపాలా, లేక ప్రేమ కథని బ్యాక్ డ్రాప్ లోకి నెట్టేసి బానిసల కథగా నడపాలా? ఏది కరెక్టో తేల్చుకోలేకపోయాడు.
చివరికేమిటి
స్క్రీన్ ప్లేతోనే సమస్య. ప్రపంచంలో యుద్ధాలకి కులం కాదు, మతం కాదు కారణ మన్నారు. ఉన్నోడికీ లేనోడికీ మధ్యే యుద్ధాలన్నారు వర్మ వాయిసోవర్ తో ప్రారంభిస్తూ. కానీ ఆ వెంటనే విలన్ ని పరిచయం చేస్తూ కింది కులాల అణచివేత దారుగా డైలాగులు చెప్పించారు. వాళ్ళనే బానిసలుగా చూపారు. కింది కులం హీరో తన కూతుర్ని ప్రేమించాడని పగబట్టాడు. ఇది ఇప్పుడు కూడా జరుగుతున్నదే. అయితే ఈ ప్రేమకథని ప్రధాన కథ చేయకుండా, సెకండాఫ్ లో దీన్ని వదిలేసి, బానిసల విముక్తి కథగా చేయడంతో స్క్రీన్ ప్లే రెండుగా ఫ్రాక్చర్ అయింది. ప్రేమకథ ప్రధానకథగా చివరంటా బలమైన భావోద్వేగాలతో వుంటే, ఈ ప్రేమని నిలబెట్టడం కోసం బానిసలందరూ తిరగబడి వుంటే, అప్పుడు కథకి అర్ధముండేది. కానీ సెకండాఫ్ లో హీరో తల్లిని చంపగానే బానిసలు తిరుగుబాటు చేయడం, వాళ్ళ బాధలు చెప్పుకోవడం, వాళ్ళ బాధల విముక్తి కోసమే పోరాటానికి దిగడంతో – ప్రేమకథ అనామకంగా మిగిలిపోయి సెకండాఫ్ పూర్తిగా ఫ్లాట్ గా కుప్పకూలింది. పైగా బానిసలతో వందేమాతరం పాట! ఇలా సెకండాఫ్ ప్రేమ కథ వదిలేసి ఎర్ర విప్లవ సినిమా చూపించారు. స్క్రీన్ ప్లేకి మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటనేది పూర్తిగా విస్మరించారు. ఇవాళ్టి మార్కెట్ యాస్పెక్ట్ ఎకనమిక్స్ లేదా రోమాంటిక్సే. ఈ కథని యూత్ అప్పీల్ కోసం రోమాంటిక్స్ తో న్యాయం చేయాల్సింది, చేయలేకపోయారు.
Rating: 1.5
దర్శకత్వం : టి. సిద్ధార్థ్
తారాగణం : ధనుంజయ్, ఇరా మోర్, బాలరాజ్ వాడీ, భాస్కర్ మన్యం, దయానంద్, విజయ్ రామ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే : రాంగోపాల్ వర్మ, రామ్ వంశీకృష్ణ, మాటలు : సంగీతం : రవిశంకర్, ఛాయాగ్రహణం : జగదీష్ చీకటి
నిర్మాతలు: రాంగోపాల్ వర్మ, అభిషేక్ నామా, భాస్కర్ రాశి
విదుదల : డిసెంబర్ 14. 2018