మలయాళ సినీ నటి హనీరోజ్ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎర్నాకులం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, గతకొంత కాలంగా ఒక బిజినెస్ మెన్ ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని, అసభ్యకర వ్యాఖ్యలతో ఆగమనేలా అవమానిస్తోన్నట్లు హనీరోజ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు 27 మంది మీద కేసులు నమోదు చేయగా, బిజినెస్ మాన్ బాబీ చెమ్మనూరు ప్రధాన నిందితుడిగా మారారు.
హనీరోజ్ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో తనను వివిధ కార్యక్రమాలకు ఆహ్వానించిన బాబీ చెమ్మనూరు, కొన్ని కారణాల వల్ల తాను హాజరు కాలేకపోవడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు వివిధ మార్గాల్లో వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. హాజరవుతున్న ఈవెంట్లకు వచ్చి, తగిన అవకాశాల్లో లైంగికంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన హనీరోజ్, చివరికి పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించి, బాబీ చెమ్మనూరును అరెస్ట్ చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం ద్వారా చట్టపరమైన కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ చర్యలపై హనీరోజ్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, తన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుని తగిన చర్యలు తీసుకున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఈ కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది, ఎందుకంటే హనీరోజ్ ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ దృష్టికి తీసుకెళ్లారు. నిందితులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని హనీరోజ్ వెల్లడించారు. ఈ కేసు కారణంగా మహిళల భద్రతకు సంబంధించిన చర్చలు మళ్లీ తెరమీదకు వచ్చాయి.