‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ రివ్యూ

– సికిందర్

Rating: 4 / 5
***

సావిత్రి జీవిత కథతో ‘మహానటి’ సంచలన విజయం సాధించాక, మరో సంచలనం సృష్టించదానికి సిద్ధమైంది ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించే బయోపిక్ ఈ మొదటి భాగంలో ఎన్టీఆర్ సినిమా జీవితం చూస్తాం. ఫిబ్రవరి ఏడున రాజకీయ జీవితంతో ‘మహానాయకుడు’ రాబోతోంది. ఎన్టీఆర్ జీవితం మహావృక్షం లాంటిది.

కళామయ, మానవీయ, సామాజిక, రాజకీయ పార్శ్వాలెన్నోముడిపడి వున్నాయి. వీటిని వెండితెర మీద ఆవిష్కరించాలంటే మామూలు ప్రయత్నం కాబోదు. ఈ మహా ప్రయత్నాన్ని దర్శకుడు క్రిష్ తలకెత్తుకున్నారు. ఆల్రెడీ ‘కంచె’, ‘శాతకర్ణి’ లాంటి రెండు పీరియడ్ మూవీస్ తీసి విజయాలు సాధించిన రికార్డు వున్నా తను, ఎన్టీఆర్ బయోపిక్ కి న్యాయం చేయగలిగారా? ఈ ప్రశ్నకి జవాబు చూద్దాం.

కథ

మద్రాసులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం (విద్యాబాలన్) క్యాన్సర్ తో ఆస్పత్రిలో వుండే దృశ్యంతో ప్రారంభమవుతుంది. ఆమె పెద్దకుమారుడు హరికృష్ణ (కళ్యాన్ రామ్) చేత ఎన్టీఆర్ ఆల్బం తెప్పించుకుని చూస్తూ, గత స్మృతుల్లోకి జారుకోవడంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. 1947 – విజయవాడ. ప్రకాశం బ్యారేజి మీద సూటు బూటులో వున్న ఎన్టీఆర్ (బాలకృష్ణ) హుషారుగా సైకిలు తొక్కుకుంటూ పోతూంటారు. ఆయనది రిజిస్ట్రార్ ఉద్యోగం. కానీ ఆఫీసులో అవినీతి పడక, స్వాతంత్ర్యం అవినీతికి వచ్చిందని వ్యతిరేకించి, రాజీనామా చేసేస్తారు.

మద్రాసు వెళ్లి సినిమాల్లో చేరతానంటారు. ఇంట్లో అందరూ వ్యతిరేకించినా బసవతారకం ప్రోత్సహించి పంపుతారు. అలా మద్రాసు వెళ్లి ప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత ఎల్వీ ప్రసాద్ ని కలుసుకుని ‘మనదేశం’లో అవకాశం సంపాదిస్తారు. అక్కడ్నించీ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, తెలుగు ప్రేక్షకుల తిరుగులేని అభిమాన నటుడై పోతారు. మరి ఇంత ప్రేక్షకాభిమానం చూరగొన్న ఎన్టీఆర్, రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఏ పరిస్థితులు, ఏ కారణాలు ఆయనని రాజకీయాల వైపు నెట్టాయి? ఇదే మిగతా ఆయన జీవిత కథ.

ఎలావుంది కథ

ఎన్టీఆర్ తన మానాన తానూ సినిమా జీవితం గడిపేసి రిటైర్ అయిపోయి వుంటే చెప్పుకోవడాని కేమీ వుండేది కాదు. మహా అయితే ఆయన పోషించిన పురాణ పాత్రలు ఆయన్ని ఎలా ఆరాధనీయుడుగా మార్చాయో చెప్పడం వరకే వుండేది. ఉద్యోగం చేస్తున్నప్పట్నుంచీ ఆయన సాటి మనిషి గురించి ఆలోచిస్తూ, రెబెల్ గానూ అహర్నిశలు సమాంతర జీవితం గడపడం వల్లే ప్రజల హృదయాల్లోకి ప్రత్యక్ష్యంగా చొచ్చుకుపోయారు. అది ప్రజల్ని పాలించే దాకా వెళ్ళింది. ఈ భిన్న పార్శ్వాలే ఆయన బయోపిక్ ని సమున్నతం చేయడానికి ఉపయోగ పడ్డాయి.

భారతదేశంలో ఇంకే నటుడికే కాదు, రాజకీయ నాయకుడికి కూడా ఇలాటి బయోపిక్ సాధ్యం కాదు. చెబితే అతిశయోక్తిగా వుండచ్చేమో గానీ, అటెన్ బరో తీసిన ‘గాంధీ’ తర్వాత, ఎన్టీఆర్ బయోపిక్కే చెప్పుకోవాలి. ఇలా వొక విభిన్న భావోద్వేగాల అద్బుత ప్రపంచంలోకి గైకొని పోతుంది. పిల్ల నుంచి ముసలి దాకా కదలకుండా కూర్చోబెట్టేస్తుంది. సినిమాల్లో చేరడానికి మద్రాసు బయల్దేరి వెళ్ళడంతో ప్రారంభమయ్యే బయోపిక్, తెలుగు దేశం పార్టీని ప్రకటించడానికి హైదరాబాద్ బయల్దేరి వచ్చే దృశ్యంతో ముగుస్తుంది.

ఎవరెలా చేశారు

శాతకర్ణి ఎలా వుండే వాడో మనం చూడలేదు. నందమూరి బాలకృష్ణ నటించారు. మనం ఏమనుకోలేదు. ఎన్టీఆర్ ని మనం పాత సినిమాలప్పట్నుంచీ చూస్తూ వచ్చాం. అందుకని జనం ఏమనుకోకుండా చూసే బాధ్యత బాలకృష్ణ మీద వుంది. పాత సినిమాల్లో ఎన్టీఆర్ సన్నగా వుండేవారు, బాలకృష్ణ లేరు. కృష్ణుడుగానూ ఎన్టీఆర్ గ్లామరస్ గా వుండేవారు. సన్నబడని బాలకృష్ణ కృష్ణుడి గెటప్ లో ఇప్పటి తన వయసు నటించారు.

అయితే ఎన్టీఆర్ అరవైలలో పడ్డాక బాలకృష్ణ అచ్చం ఎన్టీఆర్ లాగే వున్నారు. ఈ సన్నం, లావు సంగతుల్ని పక్కన బెట్టి చూస్తే, అన్ని దశల్లోనూ బాలకృష్ణ ముఖ భావాలు, నటన అద్భుతంగా ప్రదర్శించారు. ఇంతకాలానికి ఆయనలోని నిజమైన నటుణ్ణి చూస్తాం. నిర్మాత నాగిరెడ్డితో, ప్రధాని ఇందిరా గాంధీతో, దివిసీమ ఉప్పెన బాధితులతో…ఇలా చెప్పుకుంటే అనేక ఘట్టాల్లో ఆయనలోని ఫ్యాక్షనిస్టు బాలయ్య పాత్రని అదిమిపెట్టి, నిగ్రహంతో ఎన్టీఆర్ కి దగ్గరగా రియలిస్టిక్ గా నటించారు. చివర్లో పార్టీని ప్రకటిస్తున్నప్పుడు టాప్.


ఎన్టీఆర్ బయోపిక్ అంటూ చేసిన ఒక మంచి పనేమిటంటే, ఎక్కడా ఎన్టీఆర్ నటించిన సినిమా క్లిప్పింగ్స్ ని వాడుకోకపోవడం. ఎన్టీఆర్ నటించిన ఆయా సినిమాల్లోని దృశ్యాలని బాలకృష్ణతోనే తీయడం. ‘పాతాళ భైరవి’లో తోట రాముడైనా, ‘సీతారామ కల్యాణం’ లో రావణుడైనా, ‘మాయాబజార్’ లో శ్రీ కృష్ణుడైనా, ‘బందిపోటు’లో బందిపోటైనా, ‘సర్దార్ పాపారాయుడు’ లో అల్లూరి సీతారామారాజైనా, ‘దానవీర శూర కర్ణ’ కర్ణుడైనా, దుర్యోధనుడైనా….ఆఖరికి ‘గుండమ్మ కథ’లో లేచింది మహిళాలోకం పాటలోనైనా, ‘యమగోల’, వేటగాడు’ లలోని చిలక్కొట్టుడు, ఆకుచాటు పిందె పాట ల్లోనైనా స్వయంగా బాలకృష్ణే నటించారు. అయితే విశేషమేమిటంటే, ఇన్ని గెటప్స్ లో ఇన్నిపాత్రలు నటిస్తూ, ఎక్కడా ఒన్ మాన్ షో చేస్తున్నట్టుగానీ, తానేదో పొడిచేస్తున్నట్టు గానీ చిరాకు పుట్టించక పోవడం.

ఎన్టీఆర్ నే మన కళ్ళ ముందుంచడం. అసలు బాలకృష్ణ అనే స్టార్ కన్పించరు ఈ బయోపిక్ లో.
రెండో ప్లస్ పాయిట్. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్…సుమంత్ ని ఇలా చూస్తామని కలలో కూడా అనుకోం. సరీగ్గా అక్కినేనికి సరిపోయారు, మాట తీరు గానీ, ముఖభావాలుగానీ. ఇంకో ప్లస్ పాయింట్ నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్. ఎల్వీ ప్రసాద్ గా జిశ్శూ సేన్ గుప్తా, నాదెండ్ల భాస్కర రావుగా సచిన్ ఖెడేకర్ లు ఎక్సెలెంట్. సచిన్ ఖెడేకర్ నాదెండ్ల పాత్రతో రాబోయే ‘మహానాయకుడు’ లో ఇంకా చాలా పనుంటుంది. అసలు పనంతా అక్కడే.


కానీ బసవతారకం గారి పాత్రలో విద్యాబాలన్ ఒక సర్ప్రైజ్. ఆ పాత్రకి ఆమె చాలా వన్నె తెచ్చారు. ‘మహానాయకుడు’ లో కూడా కొనసాగే పాత్ర. సావిత్రిగా నిత్యామీనన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రభగా శ్రియ, జయప్రదగా హంసిక ప్రముఖ తారలు కనువిందు చేస్తారు. ఇంకా ముప్పై పైబడి పాత్రల్లో నటీనటులున్నారు.

దర్శకుడు క్రిష్ చాలా తక్కువ రోజుల్లో తీసినా విజువల్ క్వాలిటీ పీరియడ్ లుక్ తో చాలా రిచ్ గానూ, ఉన్నతంగానూ వుంది. పీరియడ్ సినిమాల స్పెషలిస్టు ఛాయాగ్రహకుడు జ్ఞాన శేఖర్ మరోసారి ప్రతిభ కనబర్చాడు. లొకేషన్స్, సెట్స్, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీ, ప్రతీదీ ఆయా కాలాల కంటిన్యూటీతో వున్నాయి.
కీరవాణి బ్యాక్ గ్రౌండ్ సంగీతం సోల్ ని సమకూర్చింది ఈ బయోపిక్ కి. దివిసీమ ఉప్పెన దృశ్యాల్లో ఎన్టీఆర్ మీద ‘వెండి తెర దొరా వినవా మొర’ పాట కదిలించేట్టుగా వుంది.

చివరికేమిటి

దర్శకుడు జాగర్లమూడి క్రిష్ బయోపిక్ ని దాని స్థాయిలో నిలబెట్టారు. ఎన్టీఆర్ జీవితంలో భిన్న పార్శ్వాల్ని సమయోచితంగా స్పృశిస్తూ, ఆయన తీసుకున్న నిర్ణయాల వెనుక కారణాల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని సమగ్రంగా చిత్రించడానికి శాయశక్తులా కృషి చేశారు. మొదటి సగం తొలినాటి సినిమా జీవితం, రెండో సగం ఎన్టీఆర్ యాభైలనాటి సినిమా జీవితం తర్వాత అరవైలలో రాజకీయాల వైపు ప్రయాణం. ఈ మొత్తం ఆయన జీవితంలో ఎదురైన ఆయా ప్రముఖుల్ని చూపిస్తూ సినిమాగా కమర్షియల్ అప్పీల్ కి లోటు లేకుండా చూశారు.

ఎక్కడో మద్రాసులో జీవిస్తున్న ఎన్టీఆర్ కి తెలుగు జాతి పట్ల కనువిప్పు ఇందిరాగాంధీని కలిసినప్పుడు అయిందని చూపించడంతో మొదలు పెడితే, దివిసీమ ఉప్పెనతో ప్రజల్లో మమేకమై, ఆ ప్రజలు కుప్ప తెప్పలుగా లేఖలు రాసి కష్టాలు తెలుపుకోవడంతో రాజకీయ ఆలోచనలు రేగాయని చూపడంతో కొనసాగించి, మరో ముఖ్య మంత్రిగా భవనం వెంకట్రాం ప్రమాణ స్వీకారానికి హాజరైనప్పుడు నాదెండ్ల భాస్కరరావు పరిచయంతో ముఖ్యమంత్రులతో కేంద్రం ఆడుకుంటున్న ఆటలు తెలియడం దాకా తీసుకువచ్చి – జై తెలుగు దేశం అంటూ ఎన్టీఆర్ పార్టీని ప్రకటించడం వరకూ తెచ్చి- ఒక అర్ధవంతమైన కాజ్ అండ్ ఎఫెక్ట్ కథనం చేశారు ఈ బయోపిక్ కి. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ చూసి వాస్తవాలు తెలుసుకోవాల్సిన మహానటుడి / నాయకుడి జీవిత చరిత్ర.

నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, మంజిమా మోహన్‌, నరేష్‌, మురళీశర్మ, క్రిష్‌, రవికిషన్‌, శుభలేఖ సుధాకర్‌, రవిప్రకాష్‌, చంద్ర సిద్ధార్థ, భానుచందర్‌, ప్రకాష్‌రాజ్‌, కె.ప్రకాష్‌, ఎన్‌.శంకర్‌, దేవి ప్రసాద్‌ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌
ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ
సంభాషణలు: బుర్రా సాయిమాధవ్‌
నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
సంస్థ: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా