మొన్న కేసీఆర్..ఈ రోజు రజనీకాంత్

అత్తివరదరాజస్వామి సన్నిధిలో సూపర్ స్టార్ రజనీ

తమిళనాడులోని కాంచీపురంలో 40 ఏళ్లకొకసారి దర్శనమిచ్చే అత్తి వరదరాజ స్వామి దర్శనానికి భక్తులు పొటెత్తుతున్న సంగతి తెలిసిందే. స్వామి వారి దర్శనానికి మరో మూడు రోజులే ఉన్నందున భక్తుల తాకిడి ఎక్కువైంది. సామాన్యులే కాక సెలబ్రెటీలు సైతం స్వామి వారిని చూడటానికి పోటీ పడుతున్నారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. తాజాగా అత్తివరదరాజస్వామిని ప్రముఖ నటుడు రజనీకాంత్‌ దర్శించుకున్నారు.

ఈ ఉదయం కుటుంబసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, వేదపండితులు సాదరస్వాగతం పలికారు. అనంతరం రజనీ దంపతులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. వారం క్రితం రజనీ భార్య లత ఒక్కరే ఆలయానికి రాగా.. ఇప్పుడు దంపతులిద్దరూ వచ్చి స్వామిని దర్శించుకున్నారు.

1979లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి మరలా ఈ ఏడాది జూన్‌ 1 నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నెల 17వరకూ దర్శనమిచ్చే స్వామిని దర్శించుకునేందుకు ప్రస్తుతం రోజుకు సుమారు 3 లక్షలమంది భక్తులు వస్తున్నారు. తాకిడి ఎక్కువగా ఉండడం వలన ప్రస్తుతం స్వామి వారి దర్శననానికి పది గంటల సమయం పడుతోందని నిర్వాహకులు తెలిపారు.

చివరి రెండు రోజులు కేవలం సాధారణ భక్తులనే అనుమతిస్తామని ఆలయ నిర్వహకులు చెబుతున్నారు. ఆలయ కోనేటి గర్భంలో ఉండే అత్తి వరదస్వామి 40 సంవత్సరాలకొకసారి 40 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు. దేశ విదేశాల నుంచి వస్తున్న లక్షలాది మంది భక్తులతో కాంచీపురం జనసంద్రంగా మారింది.