నల్లగొండ కాంగ్రెస్ లో కొత్త సమీకరణాలు, జానారెడ్డితో కీలక భేటీ

కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు తిరుగుతాయో ఎవరికీ అంతుచిక్కదు. నిన్నటి వరకు ఆ పార్టీలో హీరోగా ఉన్న నాయకుడు రేపు జీరోగా మారిపోతుంటారు. జీరోగా ఉన్న వారు హీరోలవుతారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఆ పార్టీ చిత్ర విచిత్రమైన వ్యవహారాలకు పెట్టింది పేరు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి పార్టీ అని ఎప్పటి నుంచో జనాల్లో ఉన్న టాక్. అదీ నల్లగొండ కాంగ్రెస్ అంటే కిందినుంచి మీదిదాకా రెడ్లే లీడర్లు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ స్థానాల్లో రెడ్లు నాయకత్వ స్థానాల్లో లేరు కానీ లేకపోతే నిండుగా రెడ్లతో ఆ పార్టీ నిండిపోయేదే. అయినప్పటికీ రిజర్వుడు స్థానాల్లో కూడా తెర వెనుక పాత్రల్లో రెడ్లు చక్రం తిప్పుతుంటారు.

ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి కట్టింది. ఈ కూటమిలో కాంగ్రెస్, టిడిపి, జన సమితి, సిపిఐ ఉన్నాయి. ఎటు పోయి ఎటొచ్చినా కూటమిలో ఏ సీటులో చూసినా రెడ్డి నేతలే కనబడుతున్నారు. కొన్ని పార్టీల్లో ఉన్న కొద్దిగొప్ప బిసి నేతలు కూటమి కారణంగా మరుగునపడిపోయే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో నల్లగొండ కాంగ్రెస్ లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. అవి ఎంత వరకు ఫలప్రదం అవుతాయో కానీ బిసి నేతలంతా తెర మీదకొచ్చారు. 

బిసి యువ నేతలు హైదరాబాద్ లో జానారెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. నల్లగొండ జిల్లాలో బిసిలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలంటూ జానారెడ్డిని వారు నిలదీశారు. నల్లగొండ కాంగ్రెస్ రాజకీయమంటే రెడ్ల రాజకీయమే అన్న ప్రచారం ఉందన్నారు. ఈ పరిస్థితి మారుస్తారా లేదా అని జానారెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజా కూటమిలో రెడ్లకు తప్ప బిలకు స్థానం లేదా అని అడిగారు.

జనారెడ్డిని కలిసిన నల్లగొండ బిసి కాంగ్రెస్ నాయకుల్లో…

చిరుమర్రి కృష్ణయ్య, మిర్యాలగూడ

చామల శ్రీను, నకిరేకల్

పోత్నక్ ప్రమోద్ కుమార్, భువనగిరి

నూకా కిరణ్ యాదవ్, నకిరేకల్

అందెం లింగం యాదవ్, భువనగిరి

రవి ముదిరాజ్, మునుగోడు 

తదితరులు ఉన్నారు. 

వీరంతా నల్లగొండ జిల్లాలో బిసిలకు ఇచ్చే సీట్లేమిటి అని జానారెడ్డిని అడిగారు. దీనికి జానారెడ్డి స్పందిస్తూ టిఆర్ఎస్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ బిసిలకు టికెట్లు ఇస్తుందని భరోసా ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ఒక సీటు బిసి నేతకు ఇవ్వబోతున్నామని, మరో సీటు కూడా ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ బిసిల వైపు ఉంటుందని, బిసిలకు గౌరవం ఇస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ లో అవకాశాలు రావని బిసి యువ నేతలెవరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని జానారెడ్డి భరోసాఇచ్చినట్లు సమావేశంలో పాల్గొన్న ఒక నాయకుడు తెలిపారు.

అయితే జానారెడ్డి తర్వాత బిసి నేతలు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డితోనూ భేటీ  అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో బిసిలకు ఎక్కువ సీట్లు ఇచ్చేలా అధిష్టానం పై వత్తిడి చేసే దిశగా కాంగ్రెస్ బిసి నేతలు కదులుతున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంత మేకు సఫలమవుతాయన్నది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే రెడ్డి నేతల పార్టీ అన్న ముద్ర తెలంగాణలో వేసుకుని ఉన్నది. మరి జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బిసి వర్గాల ఓటింగ్ ను అరకొర సీట్లు ఇచ్చి వేయించుకోవాలంటే సాధ్యం కాదని బిసి నేతలు అంటున్నారు.