ఎన్నికలంటేనే ప్రచారం. ఎన్నికలంటేనే కోట్లు ఖర్చు చేయడం. ఎన్నికలంటేనే కార్యకర్తల్ని మద్యంలో ముంచెత్తడం. ఎన్నికలంటేనే ఓటర్లకు డబ్బులు పంచడం. ఎన్నికలంటేనే బెదిరింపులకు పాల్పడటం. మన ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు అర్థం ఏనాడో మారిపోయింది. కానీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ద్వారా దేశానికి సరికొత్త సందేశం ఇద్దామని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. నామినేషన్ వేసేసి ఊరుకుందాం.. ప్రచారం అస్సలు చేయొద్దు.. ప్రలోభాలు అసలే వద్దు.. అంటూ ఇతర రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరమేంటి.? అన్నదే జానారెడ్డి ప్రశ్న.. ఎన్నికల విషయమై. నిజానికి, ఇది అత్యంత కీలకమైన అంశం.
ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు చేయడానికి కూడా అభ్యర్థులు వెనుకాడటంలేదిప్పుడు. అంతలా ఖర్చు చేశాక. దానికి నాలుగైదు రెట్లు సంపాదించుకోకుండా ఏ రాజకీయ నాయకుడైనా వుండగలడా.? అయితే, ప్రస్తుత ప్రజాస్వామ్యంలో జానారెడ్డి చెబుతున్నట్లు ప్రచారం లేని ఎన్నికలు అసాధ్యం. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గులాబీ పార్టీని ఇంకోసారి దెబ్బ కొట్టాలనే కసితో వుంది బీజేపీ. వాస్తవానికి నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి జానారెడ్డి పట్ల సానుకూల వాతావరణమే కనిపిస్తోంది నియోజకవర్గంలో. అదే బహుశా జానారెడ్డి తాజా ప్రతిపాదనకు కారణం కావొచ్చు. కేవలం డబ్బు మాత్రమే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాన్ని మార్చగలదన్న ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారు కాబట్టే.. టీఆర్ఎస్, బీజేపీ గనుక కలిసొస్తే… ప్రచారం లేకుండా ఉప ఎన్నికకి వెళదామని జానారెడ్డి చెబుతున్నారన్నమాట.