పేరుకే సీనియర్లు…! కావాలని చేస్తారో – ఇరికించాలని అంటారో – మనసులో మాటలు కక్కేస్తారో – అజ్ఞానం బయటపెట్టుకుంటారో – కార్యకర్తలు ఏమనుకుంటారన్న విషయం విస్మరిస్తారో… తెలియదు కానీ… కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్లు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. సమయం సందర్భం లేకుండా… మాంచి కాకమీదున్న కార్యకర్త ఆవేశంపై నీళ్లు జల్లుతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేయగా… తాజాగా జానారెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇంతకూ అవేమిటంటారా… కాంగ్రెస్ – బీఆరెస్స్ పొత్తు గురించి.!
అవును… తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కునేందుకు అన్ని పార్టీలతో కలసి పనిచేస్తామన్నారు. సరే దాందేముందిలే అనుకునేలోపు… బీఆరెస్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో… ఒకపక్క రేవంత్ రెడ్డి – కేటీఆర్ లు జుట్టు జుట్టు పట్టుకునే కొట్టేసుకుంటుంటే… మరో పక్క బీఆరెస్స్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కార్యకర్తలు భావిస్తుంటే… ఇంకోపక్క ఈ రెండు పార్టీల పొత్తు.. జనాలు నిర్ణయిస్తారని చెప్పడం అజ్ఞానమే అంటున్నారు విశ్లేషకులు.
బీఆరెస్స్ కు తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని… వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకుటామని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే… హాథ్ సే హాథ జోడో యాత్ర లో పొత్తులపై చెబుతూ.. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో మొన్న కొమటి రెడ్డి, నేడు జానా రెడ్డి లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. కార్యకర్తల్లో అసహనం కలిగించడమే అనే కామెంట్లు తాజాగా వినిపిస్తున్నాయి! రేవంత్ పై రివేంజ్ ఏమైనా ఉంటే… రేవంత్ ను ఏదోలా ఇరికించాలని భావిస్తే… అందుకు వెరే మార్గాలు వెతుక్కోవాలి తప్ప… ఇలా పార్టీ ని ఇరకాటంలో పెట్టే పనులు చేయడం.. కుర్చున్న కొమ్మ ను నరుక్కున్నట్లే అవుతుంది అని మరికొందరు సూచిస్తున్నారు!
ఇటీవల కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాష్ట్రంలో హంగ్ వచ్చే పరిస్థితి ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆరెస్స్ – కాంగ్రెస్ కలవక తప్పదని చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా చూస్తే.. రాహుల్ గాంధీ అనర్హత వేటును బీఆరెస్స్ బలంగా వ్యతికించింది. పార్లమెంటులో కూడా కాంగ్రెస్ కు మద్దతుగా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. బీజేపీ ముక్త్ భారత్ అని చెబుతున్న బీఆరెస్స్.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తోంది. అయితే ఇది దేశ స్థాయిలోనా, లేక రాష్ట్ర స్థాయిలో ఉంటుందా అనేది రానున్న రోజుల్లో బయటపడుతుంది. కానీ… ఈలోపే తమకున్న తుత్తరతో కాంగ్రెస్ సీనియర్లు ఇలా పార్టీ కేడర్ ను కంఫ్యూజన్ లో పాడేస్తున్నారు! మరి వీరి ఆవేశాన్ని, అజ్ఞానాన్ని ఎవరు ఆపుతారు – మరెవరు నిలువరిస్తారా అన్నది వేచి చూడాలి!