టిఆర్ఎస్ వాళ్లు ఊళ్లలకు వస్తే చెప్పులు చూపించండి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

టిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజవర్గం అభివృద్ధికి చేపట్టిన పనులు శూన్యమని తెలంగాణ కాంగ్రెస్ నేత, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇంటికి అల్లుడు వస్తే ఉండేందుకు వీలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారనీ, కానీ ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో అల్లుడు-బిడ్డ ఇంటికి రావడమే మానుకున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని నేలపట్ల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు గడ్డ మీద.. అనే పాటకు కోమటిరెడ్డి డ్యాన్స్ చేసి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. 

ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించలేని సీఎం కేసీఆర్, రూ.100 కోట్లతో ప్రగతి భవన్ కట్టుకుని కొడుకు, కోడలు, అల్లుడు.. అందరితో కలసి బతుకమ్మ ఆడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కనీసం పేదలకు ఇళ్లు ఇవ్వని టీఆర్ఎస్ నేతలను ఊర్లలో అడుగుపెట్టనివ్వవద్దని సూచించారు. టీఆర్ఎస్ నేతలు ఊర్లో అడుగులు పెడితే చెప్పులు చూపించాలన్నారు. కేసీఆర్ ఏమైనా పెద్ద అదా… ఆయనకు ఎందుకు భయపడాలి.. తెలంగాణ అంతా ఆయన కింద ఉండాల్నా..ఆయన ఏమైనా తోపా అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 

కుక్కకు బిస్కెట్లు పడేసినట్లు ప్రజలకు నగదు పడేసి తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. మునుగోడుకు పట్టిన ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొడతానన్నారు. అనేక మంది ఫ్లోరైడ్ తో బాధపడుతుంటే కనీసం వారి సమస్యను పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ఉద్యమ కాలంలో నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యలపై మాట్లాడి ఫ్లోరైడ్ రక్కసిని తరుముతానని ప్రకటించారని నాలుగున్నరేళ్ల కాలంలో ఫ్లోరైడ్ ను తరుమ చేతకాక చేతులేత్తేశాడన్నారు. ప్రజలంతా కేసీఆర్ ను తరిమి కొట్టాల్సిన అవసరముందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో 1200 మంది పిల్లలు చచ్చిపోయి ఆత్మబలిదానాలు చేసుకున్నారు, ఉస్మానియా విద్యార్దులు కదం తొక్కారు. ప్రజల పోరాటంతో తెలంగాణ కాంక్షను గుర్తించిన తల్లి సోనియమ్మ తెలంగాణను ఇచ్చిందన్నారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము పై కొట్టేటోడు ఈ కేసీఆర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి టిఆర్ఎస్ నాయకులు ప్రచారానికి వస్తే నిలదీయండి, అసలు వాళ్లను ఊళ్లకే అడుగు పెట్టనీయకండి చెప్పులు చూయించండి. ఎక్కువ మాట్లాడితే చెప్పులతో కొట్టండంటూ రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూసుకుంట్లకు కూర్చుంటే లేవరాదు, లేస్తే కూర్చోరాదు ఈయనేం చేస్తాడంటూ ఎద్దేవా చేశారు. 

మునుగోడు నియోజకవర్గ ప్రజల బాదలు తీర్చేందుకే రాజగోపాల్ రెడ్డి వచ్చాడని, కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. తాము ప్రజా సేవ చేయడానికే రాజకీయాలలోకి వచ్చానన్నారు. రాజకీయాలు చేసి సంపాదించుకోవడానికి తాను రాజకీయాలు చేయడం లేదన్నారు. దేవుడు ఇచ్చినట్టు తనకు వ్యాపారాలు ఉన్నాయని తాను బతకడంతో పాటు మరో పది మందిని బతికిస్తున్నానన్నారు. మునుగోడు గోడు తనకు తెలుసన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గట్టుప్పల్ మండలం కోసం పోరాడుతానని గట్టుప్పల్ మండలాన్ని సాధించే తీరుతానన్నారు.

నాంపల్లి, చండూర్, మర్రిగూడ, నారాయణపురం, మునుగోడు, చౌటుప్పల్ ఈ ఆరు మండలాల ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాయన్నారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి సమస్యల పరిష్కరిస్తానన్నారు. ఫ్లోరైడ్ ని తరిమేందుకు ప్రతి ఊరిలో కూడా నీటిప్లాంట్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. మునుగోడులో తనను ఈసారి తనను భారీ మెజారిటీతో గెలిపించాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.