ముఖ్యమంత్రి ఫ్యామిలీకి పేపర్ ఉంటే ఆ కిక్కే వేరప్పా

ముఖ్యమంత్రికే పత్రిక, టివిలు ఉంటే ఆ కిక్కే వేరప్పా అని మరోసారి నిరూపితమైంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సిఎంగా ఉన్న రోజుల్లో సాక్షి అనే పత్రిక, టివిని ఆరంభించారు. తనదనంతర కాలంలో ఆ పత్రికకు పెద్దఎత్తున ప్రభుత్వ యాడ్స్ ఇచ్చారన్న ప్రచారం ఉంది. ఇక తెలంగాణ రాకముందే అప్పటి ఉద్యమ నేత కేసిఆర్ కూడా టిన్యూస్, నమస్తే తెలంగాణ పత్రికలు స్థాపించారు. టిన్యూస్ తన పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ లోనే నడిపిస్తుండగా నమస్తే తెలంగాణ కథ వేరే ఉంది. ఆ పత్రకను సిఎల్ రాజం అనే బిగ్ షాట్ ప్రారంభించారు. ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఆ పత్రకను రన్ చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆ పత్రికను రాజం నుంచి కేసిఆర్ గుంజుకున్నారు. తర్వాత రాజం ఇంగ్లీష్ పత్రిక పెట్టారు. మూశేశారు. ఇప్పుడు విజయక్రాంతి అనే పత్రికను ప్రారంభించారు. ఇక నమస్తే తెలంగాణను గుంజుకున్న తర్వాత ఆ పత్రికకు, అలాగే సొంత చానల్ టిన్యూస్ కు యాడ్స్ పంట పండించారు ప్రభుత్వ పెద్దలు.

నమస్తే తెలంగాణకు కోట్లల్లో యాడ్స్ ఇచ్చేశారు తెలంగాణ సిఎం కేసిఆర్. ఇదేంటని ప్రశ్నించేవారే లేకపోవడంతో యాడ్స్ వరద పారించారు. అలాగే టిన్యూస్ లో కూడా. దీంతో కేసిఆర్ ఫ్యామిలీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక ఆదాయం అమాంతంగా మెరుపు వేగంతో దూసుకుపోయింది. అయితే తెలంగాణ సర్కారు ఏ పత్రికకు ఎంత యాడ్స్ ఇచ్చారు? ఏ పత్రిక ఆదాయం ఎంత అన్నదానిపై ఉస్మానియా యూనివర్శిటీ మాజీ జర్నలిజం ప్రొఫెసర్, మీడియా విశ్లేషకురాలు పద్మజా షా సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న వివరాలను బహిర్గతం చేశారు. ఆ వివరాలను హూట్ వెబ్ సైట్ లో ‘‘ముఖ్యమంత్రే మీడియా అధినేత అయితే’’ అనే క్యాప్షన్ తో కథనాన్ని ప్రచురించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన మీడియా సంస్థలకు భారీ ఎత్తున ప్రకటనల రూపంలో ఆదాయం అందజేయడం అవినీతి అంటారా? లేక అధికార దుర్వినియోగం కిందకు వస్తుందా అన్న ప్రశ్నను లేవనెత్తారు.

2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి మధ్య కాలంలో సర్యూలేషన్ పరంగా మొదటి స్థానంలో ఉన్న ఈనాడు సంస్థకు 271 లక్షల రూపాయల యాడ్స్, ఇదే కాలంలో నమస్తే తెలంగాణ పత్రికకు ఈనాడు కంటే తక్కువగా అంటే 262 లక్షల రూపాయల యాడ్స్ వచ్చాయి. అదే సమయంలో సాక్షి పత్రకకు 192 లక్షలు, ఆంధ్రజ్యోతికి 45.6 లక్షలు యాడ్స్ ద్వారా ఆర్జించాయి.

ఇక 2017 ఏప్రిల్ నుంచి 2018 ఫిబ్రవరి వరకు చూసుకుంటే ఈనాడు యాడ్స్ ఆదాయం 271.9 లక్షల వద్దే ఉండిపోయింది. సాక్షి కొద్దిగా మెరుగై 207 లక్షల వరకు చేరింది. ఆంధ్రజ్యతి అనూహ్యంగా పుంజుకుంది 135 లక్షల రూపాయలకు చేరింది. (ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతి పత్రిక తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.) ఇదంతా ఇలా ఉంటే నమస్తే తెలంగాణ పత్రికకు మాత్రం కండ్లు తిరిగేలా యాడ్స్ దక్కాయి. నమస్తే ఆదాయం 1281 లక్షలకు చేరిపోయింది. అంటే ఆ పెరుగుదల శాతం చూస్తే 387 శాతంగా ఉన్నది. ఏడాదిలో ఇంతభారీ తేడా రావడం చూస్తే సిఎం సొంత పత్రిక కాబట్టే యాడ్స్ గుట్టలు గుట్టలుగా కుమ్మరించారన్న వాదన ముందుకొస్తోంది. అలాగే ఎలక్ర్టానిక్ మీడియా విషయానికి వస్తే కేసిఆర్ సొంత చానల్ టిన్యూస్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయిందని మీడియా వర్గాల్లో టాక్ నడుస్తోంది.

మొత్తానికి సొంత పత్రిక, సొంత చానెల్ కోసం కోట్ల నిధులు కుమ్మరించడంతో పెద్ద దుమారం చెలరేగే అవకాశాలున్నాయి. అదేకాకుండా ఇతర రాష్ట్రాల పత్రికలకు, ఇతర దేశాల పత్రికలకు కూడా కోట్లాది రూపాయల యాడ్స్ కుమ్మరించారు. అయినదానికి కానిదానికి జాకెట్ యాడ్స్ తో దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. తెలంగాణ వస్తే జనాల బతుకులు బాగుపడతాయనుకుంటే సిఎం కుటుంబానికి చెందిన పత్రిక, టివి బాగానే బాగుపడిందని మీడియా రిపోర్టర్లు చర్చించుకుంటున్నారు. ఒకవైపు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయడంలేదని జర్నలిస్ట్ యూనియన్లు గగ్గోలు పెడుతుంటే తమ కుటుంబ మీడియా సంస్థలకు మాత్రం కోట్లు కట్టెబట్టారని ఆగ్రహంగా ఉన్నారు. సందుట్లో సడేమియా అన్నట్లు లోకల్ పత్రికలతోపాటు, జాతీయ, అంతర్జాతీయ పత్రికలకు జాకెట్ యాడ్స్ ద్వారా వెచ్చించిన సొమ్ములో పెద్దమొత్తంలో కమిషన్ ను అయిన వారు అందుకున్నట్లు విమర్శలు కూడా ఉన్నాయి.